Thursday, November 9, 2017

పోతన రామాయణం - 33

9-320-వ.
ఇట్లు పుష్పకారూఢుండై, కపి బలంబులు చేరికొలువ. శ్రీరాముం డయోధ్యకుం జనియె; నంతకు మున్న యప్పురంబునందు.
9-321-సీ.
వీథులు చక్కఁ గావించి తోయంబులు; 
చల్లి రంభా స్తంభచయము నిలిపి
పట్టుజీరలు చుట్టి బహుతోరణంబులుఁ; 
గలువడంబులు మేలుకట్లుఁ గట్టి
వేదిక లలికించి వివిధరత్నంబుల; 
మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి
కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి; 
ప్రాసాదముల దేవభవనములను
9-321.1-తే.
గోపురంబుల బంగారు కుండ లెత్తి
యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి
జనులు గైచేసి తూర్యఘోషములతోడ
నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు.

భావము:
ఈ విధంగ పుష్పకవిమానం ఎక్కి వానర సేనలు సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్యాకు వెళ్ళాడు. దానికి ముందే ఆ నగరంలో. వీధులు అన్నీ చక్కగా తుడిచి కళ్ళాపిజల్లారు. అరటి స్తంభములు నిలబెట్టి పట్టుబట్టలు కట్టారు. తోరణాలు, కలువపూల దండలు, చాందినీలు కట్టారు. అరుగులు అలికించి రత్నాల ముగ్గులు వేసారు. గోడలపై రామకథలు వ్రాయించారు. భవనాల దేవాలయాల, గోపురాల మీద బంగారు కలశాలు పెట్టారు, వాకిళ్ళలో కానుకలు అమర్చారు. ఇలా సర్వాంగ సుందరంగా పట్టణాన్ని అలంకరించి, ప్రజలు నమస్కరించి, మంగళ వాయిద్యాలతో శ్రీరాముడికి ఎదుర్కోలు చేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=321

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: