Thursday, November 30, 2017

పోతన రామాయణం - 48

9-349-ఆ.
మధువనంబులోన మధునందనుం డగు
లవణుఁ జంపి భుజబలంబు మెఱసి
మధుపురంబు చేసె మధుభాషి శత్రుఘ్నుఁ
డన్న రామచంద్రుఁ డౌ ననంగ.
9-350-వ.
అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులయిన కుశ లవులిద్దఱను వాల్మీకివలన వేదాదివిద్యల యందు నేర్పరులై పెక్కు సభల సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుం జని.

భావము:
మథురభాషి శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చేలా, మధురాసురుని కొడుకు లవణుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు. అంతట కొన్నాళ్ళకు శ్రీరాముని పుత్రులు ఐన కుశుడు లవుడు ఇద్దరు వాల్మీకి వల్ల వేదాది విద్యలలో ఆరితేరారు. అనేక సభలలో స్వరసహితముగా శ్రీరామకథా శ్లోకాలు పాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక దినం శ్రీరాముని యాగశాలకు వెళ్ళి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=350

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, November 27, 2017

పోతన రామాయణం - 47

9-347-వ.
అంత; సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె; వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె లక్ష్మణునకు నంగ దుండును, జంద్రకేతుండును భరతునకుఁ దక్షుండును, బుష్కలుం డును శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభ వించిరి; అయ్యెడ.
9-348-క.
బంధురబలుఁడగు భరతుఁడు
గంధర్వచయంబుఁ ద్రుంచి కనకాదుల స
ద్బంధుఁ డగు నన్న కిచ్చెను
బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్.


భావము:
అంతట, అప్పటికే కడుపుతో ఉన్న సీతాదేవి కుశలవులను అను పుత్రులను కన్నది. వారికి వాల్మీకి జాతకర్మలు చేసాడు. లక్ష్మణునకు అంగదుడు, చంద్రకేతుడు; భరతునకు దక్షుడు, పుష్కలుడు; శత్రుఘ్నునికి సుబాహుడు, శ్రుతసేనుడు అని ఇద్దరేసి కొడుకులు పుట్టారు. అప్పుడు. బలశాలి అయిన భరతుడు బంధువులు, తల్లులు, లోకులు మెచ్చేలా, గంధర్వులను సంహరించి ధనాన్ని, బంగారాన్ని తీసుకువచ్చి సజ్జనబంధువైన సోదరుడు శ్రీరాముడికి ఇచ్చాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Sunday, November 26, 2017

పోతన రామాయణం - 46

9-346-సీ.
వసుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు; 
కొఱకునై రాముండు గూఢవృత్తి
నడురేయి దిరుగుచో నాగరజనులలో; 
నొక్కఁడు దన సతి యొప్పకున్న
నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ; 
బాయంగలేక చేపట్ట నేమి
తా వెఱ్ఱి యగు రామధరణీశ్వరుండనే; 
బేల! పొమ్మను మాట బిట్టు పలుక
9-346.1-ఆ.
నాలకించి మఱియు నా మాట చారుల
వలన జగములోనఁ గలుగఁ దెలిసి
సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి
పర్ణశాలఁ బెట్టఁ బనిచె రాత్రి.

భావము:
రాజ్యంలో జరిగే విశేషాలు స్వయంగా తెలుసుకోడానికి రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. అర్థరాత్రి ప్రజల్లో ఒకడు భార్యతో దెబ్బలాడి, “పరాయి ఇంటిలో కొన్నాళ్ళు కాపురం చేసిన చంచలురాలైన భార్యను ఏలుకోడానికి నేనేమైనా వెఱ్ఱిరాముడను అనుకున్నావా? పోపో.” అని కేకలేస్తుంటే శ్రీరాముడు విన్నాడు. అంతేకాక, చారుల ద్వారా ఈ విషయం లోకంలో వ్యాపించి ఉందని తెలిసికొన్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతాదేవిని చెప్పకుండ రాత్రివేళ వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=346

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, November 25, 2017

పోతన రామాయణం - 45

9-343-వ.
అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు దమతమ భూములు మరల నిచ్చి యిట్లనిరి.
9-344-ఆ.
"ధరణి వలదు మాకుఁ దపసుల కేల? నీ
వఖిలలోక గురుఁడవైన హరివి; 
మా మనంబు లందు మలయు చీఁకటిఁ బాపు
భవ దుదారరుచులఁ బార్థివేంద్ర!"
9-345-వ.
అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు చని; రిట్లు పెద్దకాలంబు రాజ్యంబుచేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున.


భావము:


అంతట, శ్రీరాముడి వితరణబుద్ధికి మెచ్చుకొని బ్రాహ్మణులు వారందరు ఆయా భూములు వెనుకకు ఇచ్చివేసి ఇలా అన్నారు. “రాజా! మునులం అయిన మాకు రాజ్యం ఎందుకు, వద్దు, నీవు సకల లోకాలకు పూజినీయుడవు. విష్ణుమూర్తివి.. నీ దయా కిరణాలు ప్రసరించి, మా మనసులలో కమ్ముకొన్న అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుము.”అని చెప్పి ఆ మునులు దేవోత్తముడైన శ్రీరాముని వినయ వినమ్రులై పూజించి వెళ్ళిపోయారు. ఇలా చాలా కాలం రాజ్యపాలనం చేసి శ్రీరాముడు ఒక రోజు...



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Friday, November 24, 2017

పోతన రామాయణం - 44

9-342-సీ.
"భగవంతుఁడగు రామభద్రుండు ప్రీతితో; 
దేవోత్తముని సర్వదేవమయునిఁ
దనుఁదాన కూర్చి యధ్వరములు చేసెను; 
హోతకుఁ దూరుపు నుత్తరంబు
సామగాయకునికి శమనదిగ్భాగంబు; 
బ్రహ్మకుఁ గ్రమమునఁ బడమ రెల్ల
నధ్వర్యునకు శేష మాచార్యునకు నిచ్చి; 
సొమ్ములఁ బంచి భూసురుల కొసఁగి
9-342.1-తే.
తనదు రెండు పుట్టంబులు దనకు నయిన
మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క
వినతుఁడై యుండె; నా రాము వితరణంబు
పాండవోత్తమ! యేమని పలుకవచ్చు?


భావము:
“ఓ పాండవోత్తమా! పరీక్షిత్తూ! సాక్షాత్తు భగవంతుడే ఐన శ్రీరాముడు వినయవంతుడు ప్రీతితో తానే అయిన విష్ణుమూర్తి గురించి అనేక యాగాలు చేసాడు. హోతకు తూర్పుదిక్కు, సామగానం చేసిన వానికి ఉత్తరపు దిక్కు, ఋత్వికునికి దక్షిణపు దిక్కు, అధ్వర్యనికి పడమర దిక్కు, మిగిలినది గురువునకు ఇచ్చివేసాడు. తనకు రెండు వస్త్రాలు, తన భార్యకు మంగళసూత్రంబిళ్ళ ఉంచుకుని మిగిలిన సంపదలను విప్రులకు పంచిపెట్టాడు. ఆ శ్రీరాముని దానశీలత ఎంతని పొగడగలము.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Wednesday, November 22, 2017

పోతన రామాయణం - 43

9-340-ఆ.
"భ్రాతృజనుల యందు బంధువులందును
ప్రజల యందు రాజభావ మొంది
యెట్లు మెలఁగె? రాఘవేశ్వరుం డెవ్వనిఁ
గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?"
9-341-వ.
అనిన శుకుం డిట్లనియె.

భావము:
“శ్రీరాముడు సోదరులు, బంధువులు, లోకులు ఎడ మహారాజుగా ఎలా మసిలాడు. ఎవరిని ఉద్దేశించి యాగాలు ఏ విధంగా ఆచరించాడు.” అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=340

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 42

9-338-ఆ.
సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి
భక్తిగల్గి చాల భయముఁ గలిగి
నయముఁ బ్రియముఁ గల్గి నరనాథు చిత్తంబు
సీత దనకు వశము చేసికొనియె.
9-339-వ.
అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.


భావము:
సీతాదేవి సిగ్గుపడుట, శృంగారాలంకారం, శ్రద్ద, భయభక్తులు నయము, ప్రీతి కలిగి మెలగుతూ రాజు శ్రీరాముని మనసును తనకు వశం చేసుకుంది.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Tuesday, November 21, 2017

పోతన రామాయణం - 41

9-336-క.
తండ్రి క్రియ రామచంద్రుఁడు
తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్
తండ్రుల నందఱు మఱచిరి
తండ్రిగదా రామచంద్రధరణిపుఁ డనుచున్.
9-337-వ.
మఱియు, నా రామచంద్రుండు రాజర్షిచరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీవ్రతుండును, సర్వలోకసమ్మతుండును నగుచు ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైన గృతయుగధర్మంబుఁ గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబుచేయుచుండె; నయ్యెడ

భావము:
శ్రీరాముడు కన్నతండ్రిలా పరిపాలిస్తుండటంతో. ప్రజలు అందరూ మా తండ్రి శ్రీరాముడే అని అనుకుంటున్నారు. కనుక రామ పాలనలోని ప్రజలు అందరు తమ కన్నతండ్రులను సైతం మరచిపోయారు. ఇంకను, ఆ శ్రీరాముడు రాజఋషివంటివాడు స్వధర్మంలో నిష్ఠ కలవాడు. ఏకపత్నీవ్రతుడు. లోకులందరికీ ఆమోదయోగ్యుడు. దర్మమువ్యతిరేకం కాని విధంగానే కోరికలను తీర్చుకొంటూ త్రేతాయుగం అయినా కృతయుగ ధర్మాలను నడపిస్తూ ఏలుతున్నాడు. చిన్నపిల్లలు చనిపోవడం లాంటి లోకులకు కీడులు కలగనివ్వకుండ రాజ్యం ఏలుతున్నాడు. అప్పుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=336

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 40

9-334-వ.
మఱియును.
9-335-సీ.
పొలతుల వాలుచూపుల యంద చాంచల్య; 
మబలల నడుముల యంద లేమి; 
కాంతాలకములంద కౌటిల్యసంచార; 
మతివల నడపుల యంద జడిమ; 
ముగుదల పరిరంభముల యంద పీడన; 
మంగనాకుచముల యంద పోరు; 
పడతుల రతులంద బంధసద్భావంబు; 
సతులఁబాయుటలంద సంజ్వరంబు; 
9-335.1-తే.
ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల
నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం దక్రమంబు; 
రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు.


భావము:
ఇంకను, శ్రీరాముని పాలనలో ఉన్న రాజ్యం రామరాజ్యం. ఆ రామరాజ్యం అంతా ఎంత ధర్మ బద్ధంగా సాగింది అంటే; స్త్రీల వాలుచూపులలో మాత్రమే చాంచల్యం కనిపించేది; వనితల నడుములలో మాత్రమే పేదరికం ఉండేది; నెలతల తలవెంట్రుకలలో మాత్రమే కౌటిల్యం ఉండేది; తరుణుల నడకలలో మాత్రమే మాంద్యం ఉండేది; నెలతల కౌగలింతలలో మాత్రమే పీడన ఉండేది; కామినుల స్తనాల్లో మాత్రమే ఘర్షణ ఉండేది; సతులతో కలయికల్లో మాత్రమే బంధాలు ఉండేవి; కాంతల ఎడబాటులలో మాత్రమే సంతాపం ఉండేది; ఎవరి ప్రియురాండ్ర మనసు వారు తెలిసి దొంగిలించుటలో మాత్రమే దొంగతనాలు ఉండేవి; ప్రియభార్యలను భర్తలు అడ్డగించి జడలుపట్టుకొని లాగటంలో మాత్రమే అక్రమాలు ఉండేవి;



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Saturday, November 18, 2017

పోతన రామాయణం - 39

9-333-సీ.
కలఁగు టెల్లను మానెఁ జలధు లేడింటికి; 
జలనంబు మానె భూచక్రమునకు; 
జాగరూకత మానె జలజలోచనునకు; 
దీనభావము మానె దిక్పతులకు; 
మాసి యుండుట మానె మార్తాండవిధులకుఁ; 
గావిరి మానె దిగ్గగనములకు; 
నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల; 
కడఁగుట మానె ద్రేతాగ్నులకును;
9-333.1-ఆ.
గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె; 
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణిభరణరేఖఁ దాల్చు నపుడు.

భావము:
ఆ రామరాజ్యంలో సంక్షోభాలు లేవు. సప్త సముద్రాలు కంపించడం లేదు. భూమండలం నిర్భయంగా ఉంది. పాపులు లేకపోడంతో విష్ణుమూర్తి జాగరూకత అవసరం లేకపోయింది. దిక్పాలకులకు దైనం లేదు. సూర్య చంద్రులకు వెలవెల పోవటం లేదు. దిక్కులు ఆకాశాలకు కావిరంగు పట్టటంలేదు. చెట్ల ఎడిపోవుటం లేదు. త్రేతాగ్నులు అణగిపోవుటం లేదు. భూభారం తగ్గడంతో దిగ్గజాలకు, కులపర్వతాలకు, వరాహమూర్తికి, ఆదిశేషుడికి, కూర్మమూర్తికి భారం తగ్గిపోయింది. లోకులకు కలతలు లేవు. అలా శ్రీరాముడు రాజ్యం ఏలాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=333

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, November 17, 2017

పోతన రామాయణం - 38

9-331-చ.
కొడుకులుఁ బెద్దకోడలును గొబ్బున మ్రొక్కిన నెత్తి చేతులం
బుడుకుచు మోములుందలలుబోరన ముద్దులుగొంచునవ్వుచుం
దొడలకు వారి రాఁదిగిచి తోఁగఁగఁ జేసిరి నేత్రధారలన్
వెడలిన ప్రాణముల్ దగఁ బ్రవిష్టములయ్యె నటంచు నుబ్బుచున్.
9-332-వ.
అంత వసిష్ఠుం డరుగుదెంచి. శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్దులుం దానును సమంత్రకంబుగ దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున, సముద్రనదీజలంబుల నభిషేకంబు చేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలకంబులాడి, మంచి పుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి, సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుఁడు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి కౌసల్యకుఁ బ్రియంబు చేయుచు, జగత్పూజ్యంబుగ రాజ్యంబు జేయుచుండెను; అప్పుడు.


భావము:
కొడుకులూ, పెద్దకోడలు మ్రొక్కగా, వారిని పైకి లేవదీసి చేతులతో నిమురుతు, ముఖాలు, తలలు ముద్దులు పెడుతూ, నవ్వుతూ ఒళ్ళోకి చేరదీసి సంతోషాశ్రువలతో వారిని తడిపేసారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి అంటూ పొంగిపోయారు. అంతట, ఇంద్రుడికి మంగళస్నానాలు చేయించె బృహస్పతి వలె, వసిష్ఠులవారు వచ్చి కులపెద్దలు తాను శ్రీరామచంద్రునికి జటలు కట్టిన జుట్టు చిక్కు తీసి, మంత్రయుక్తంగా పవిత్రమైన సముద్రపు నీటితో, నదుల నీటితో స్నానాలు చేయించారు. శ్రీరాముడు సీతాదేవి స్నానాలు చేసి, చక్కటి బట్టలను ధరించి, సువాసనలుగల పూలు ముడిచికొని, సుగంధాలను రాసుకొని, ఆభరణాలు అలంకరించుకొని, తనకు భరతుడు అప్పగించిన పట్టపు సింహాసనపై కూర్చున్నారు. భరతుని ఆదరిస్తూ కౌసల్యాదేవి సంతోషించేలా, లోకం పూజించేలా రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఆ సమయంలో....



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Thursday, November 16, 2017

పోతన రామాయణం - 37

9-328-వ.
ఇట్లు వచ్చి.
9-329-ఉ.
తల్లులకెల్ల మ్రొక్కి తమ తల్లికి వందన మాచరించి య
ల్లల్ల బుధాళికిన్ వినతుఁడై చెలికాండ్రను దమ్ములం బ్రసం
పుల్లతఁ గౌగలించుకొని భూవరుఁ డోలిఁ గృపారసంబు రం
జిల్లఁగఁ జాల మన్ననలు చేసె నమాత్యులఁ బూర్వభృత్యులన్.
9-330-వ.
తత్సమయంబునఁ దల్లులు

భావము:
ఇలా అంతపురం చేరి శ్రీరాముడు తల్లులు అందరికి నమస్కరించి తమ కన్నతల్లికి నమస్కారం చేసాడు. పండితుల ఎడ వినయం చూపించాడు. స్నేహితులకు తమ్ముళ్ళకు ఆలింగనాలు చేసాడు. మంత్రులను, సేవకులకు మిక్కిల ఆదరం చూపించాడు. ఆ సమయంలో తల్లులు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=329

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, November 12, 2017

పోతన రామాయణం - 36

9-327-సీ.
పటికంపు గోడలు బవడంపు వాకిండ్లు; 
నీలంపుటరుగులు నెఱయఁ గలిగి
కమనీయ వైడూర్య స్తంభచయంబుల; 
మకరతోరణముల మహిత మగుచు
బడగల మాణిక్యబద్ధ చేలంబులఁ; 
జిగురుఁ దోరణములఁ జెలువు మీఱి
పుష్పదామకముల భూరివాసనలను; 
బహుతరధూపదీపముల మెఱసి
9-327.1-తే.
మాఱువేల్పులభంగిని మలయుచున్న
సతులుఁ బురుషులు నెప్పుడు సందడింప
గుఱుతు లిడరాని ధనముల కుప్ప లున్న
రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు.


భావము:
స్పటికాల గోడలు, పగడాల వాకిళ్ళు, ఇంద్రనీలాల వేదికలు నిండుగ ఉన్నాయి. వైడూర్యాలు పొదిగిన స్తంభాలు, మకర తోరణాలతో, ధ్వజాలతో, మాణిక్యాలు పొదిగిన వస్త్రాలతో, చిగురటాకుల తోరణాలతో, పూలదండలసువాసనలతో, ధూప దీపాలతో, దేవతలలా తిరిగుతున్న స్త్రీపురుషులతో, అనంత ధనరాసులతో మనోఙ్ఞంగా ప్రకాశిస్తున్న రాజప్రసాదానికి శ్రీరామచంద్రప్రభువు వచ్చాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Saturday, November 11, 2017

పోతన రామాయణం - 35

9-324-వ.
ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబున రామచంద్రు డరుగుచున్న సమయంబున.
9-325-మ.
ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న
ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డాపొంతవాఁడే మరు
త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ డటంచుంచేతులం జూపుచున్
సతులెల్లం బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్.
9-326-వ.
ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని.

భావము:
ఇలా ముస్తాబయిన ఆ పట్టణం ప్రవేశించి రాజమార్గంలో శ్రీరాముడు వేంచేస్తున్న సమయంలో. నగరకాంతలు అందరూ భవనాలపైకెక్కి చూస్తూ, “ఇతనే రాజు రాముడు. ఇదిగో సీతా దేవి, రాముడు ఈమెకోసమే రావణుణ్ణి సంహరించాడు. అడిగో లక్ష్మణుడు, సుగ్రీవుడు అడిగో, ఆ పక్కవాడే ఆంజనేయుడు, ఆ పక్కన ఆ విభీషణుడు అని అంటూ చేతులు చాపి చూపి మరీ పరిశీలనగా చూడసాగారు. ఈ విధంగా ప్రజలు అందరూ చూస్తుండగా శ్రీరాముడు రాజమార్గంలో వెళ్లి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=325

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, November 10, 2017

పోతన రామాయణం - 34

9-322-క.
సమద గజదానధారల
దుమదుమలై యున్న పెద్ద త్రోవలతోడన్
రమణీయ మయ్యె నప్పురి
రమణుఁడు వచ్చినఁ గరంగు రమణియపోలెన్.
9-323-ఆ.
రామచంద్రవిభుని రాకఁ దూర్యములతో
రథ గజాశ్వ సుభటరాజితోడ
నమరెఁ బురము చంద్రుఁ డరుదేర ఘూర్ణిల్లు
జంతుభంగమిలిత జలధిభంగి.


భావము:
అప్పుడు ఆ పట్టణం మదించిన ఏనుగుల మదజల ధారలతో తడసిన రాజమార్గాలతో మనోహరంగా, భర్త రాకకై ఎదురు చూస్తున్న భార్యలా ఉంది. చంద్రుని రాకతో సాగరం ఉప్పొంగినట్లు, రామచంద్రుని రాకతో అయోధ్యా నగరం మంగళవాద్యములుతో; రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు, సైనికులుతో విలసిల్లింది.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Thursday, November 9, 2017

పోతన రామాయణం - 33

9-320-వ.
ఇట్లు పుష్పకారూఢుండై, కపి బలంబులు చేరికొలువ. శ్రీరాముం డయోధ్యకుం జనియె; నంతకు మున్న యప్పురంబునందు.
9-321-సీ.
వీథులు చక్కఁ గావించి తోయంబులు; 
చల్లి రంభా స్తంభచయము నిలిపి
పట్టుజీరలు చుట్టి బహుతోరణంబులుఁ; 
గలువడంబులు మేలుకట్లుఁ గట్టి
వేదిక లలికించి వివిధరత్నంబుల; 
మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి
కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి; 
ప్రాసాదముల దేవభవనములను
9-321.1-తే.
గోపురంబుల బంగారు కుండ లెత్తి
యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి
జనులు గైచేసి తూర్యఘోషములతోడ
నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు.

భావము:
ఈ విధంగ పుష్పకవిమానం ఎక్కి వానర సేనలు సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్యాకు వెళ్ళాడు. దానికి ముందే ఆ నగరంలో. వీధులు అన్నీ చక్కగా తుడిచి కళ్ళాపిజల్లారు. అరటి స్తంభములు నిలబెట్టి పట్టుబట్టలు కట్టారు. తోరణాలు, కలువపూల దండలు, చాందినీలు కట్టారు. అరుగులు అలికించి రత్నాల ముగ్గులు వేసారు. గోడలపై రామకథలు వ్రాయించారు. భవనాల దేవాలయాల, గోపురాల మీద బంగారు కలశాలు పెట్టారు, వాకిళ్ళలో కానుకలు అమర్చారు. ఇలా సర్వాంగ సుందరంగా పట్టణాన్ని అలంకరించి, ప్రజలు నమస్కరించి, మంగళ వాయిద్యాలతో శ్రీరాముడికి ఎదుర్కోలు చేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=321

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

పోతన రామాయణం - 32

9-319-సీ.
కవ గూడి యిరుదెసఁ గపిరాజు రాక్షస; 
రాజు నొక్కటఁ జామరములు వీవ
హనుమంతుఁ డతిధవళాతపత్రముఁ బట్ట; 
బాదుకల్ భరతుండు భక్తిఁ దేర
శత్రుఘ్ను డమ్ములుఁ జాపంబుఁ గొనిరాఁగ; 
సౌమిత్రి భృత్యుఁడై చనువుచూప
జలపాత్రచేఁబట్టి జనకజ గూడిరాఁ; 
గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ
9-319.1-ఆ.
బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి
కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి 
గ్రహము లెల్లఁ గొలువఁ గడు నొప్పు సంపూర్ణ
చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.


భావము:
జంటగా రెండు పక్కలా చేరి సుగ్రీవ విభీషణులు కూడి చామరాలు వీస్తున్నారు. హనుమంతుడు వెల్లగొడుగు పట్టుతున్నాడు. కాలిజోళ్ళు భరతుడు భక్తితో తీసుకు వస్తున్నాడు శత్రుఘ్నుడు విల్లంబులు తీసుకువస్తున్నాడు. లక్ష్మణుడు చనువుగా సేవచేస్తున్నాడు. కలశం పట్టుకుని జానకీదేవి కూడా వస్తోంది. బంగారపు కత్తిని అంగదుడు మోసుకొస్తున్నాడు. బంగారపు డాలును జాంబవంతుడు మోసుకొస్తున్నాడు. ఆ విధంగ దివ్యవైభవాలతో పుష్పకవిమానం అధిరోహించి గ్రహాలు సేవించే నిండు చంద్రుడిలా శ్రీరాముడు చక్కగా ఉన్నాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Wednesday, November 8, 2017

పోతన రామాయణం - 31

9-317-వ.
వచ్చి పాదుకల ముందట నిడికొని, యెడనెడ సాష్టాంగదండప్రణామంబులు చేయుచు, మెల్లమెల్లన డాసి, రామచంద్రుని పాదంబులు దన నొసలం గదియించి, తచ్చరణరేణువులు దుడిచి, శిరంబునం జల్లికొని, తనివి చనక, మఱియు నప్పదకమలంబు లక్కున మోపి కొనుచు, సంతసంపుఁ గన్నీటం గడిగి, క్షేమంబు లరయుచుండె; నంత సీతాలక్ష్మణ సహితుండయి విభుండును, దన కెదురువచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి, తక్కినవారలచేత మన్ననలు పొంది, వారల మన్నించెను; అయ్యవసరంబున.
9-318-చ.
నృపవర! పెక్కునాళ్ళఁగొలె నిన్ గనకుండిన యట్టి నేఁడు మా
తపములుపండె నిందఱము ధన్యులమైతి మటంచుఁ బుట్టముల్
చపలతఁ ద్రిప్పి పువ్వుల వసంతములాడుచుఁ బాడుచున్ గత
త్రపులయి యాడుచుం బ్రజలు దద్దయుఁ బండుగ జేసి రెల్లెడన్.

భావము:
అలా అన్నకు ఎదురు వచ్చిన భరతుడు, పాదుకలను ఎదురుగా ఉంచుకుంటూ, అడగడుక్కి సాష్టాంగనమస్కారాలు చేస్తూ మెల్లగా దగ్గరకు వచ్చి శ్రీరాముడి పాదాలు తన నుదుట చేర్చుకొన్నాడు. పాదధూళి తలపై జల్లుకొని తృప్తి చెందక, ఆ పాదాలను తన వక్షానికి చేర్చుకొని, ఆనంద భాష్పాలతో కడిగాడు. క్షేమసమాచారాలు అడిగాడు. అంతట సీతాలక్ష్మణు సమేతుడైన శ్రీరాముడు వచ్చిన విప్రులకు నమస్కారంచేసాడు. మిగిలిన వారి మర్యాదలు స్వీకరించి ఆదరించాడు. ప్రతిచోటా ప్రజలందరు పైబట్టలు గాలిలోతిప్పుతూ, పూల వసంతాలు ఆడుతు, పాడుతు, “మహారాజ! శ్రీరామ! అనేక రోజుల నుండి నిన్ను చూడకలేకపోయాం. ఇవాళ్టికి మా తపస్సులు ఫలించాయి. భాగ్యవంతులం అయ్యాము.” అని అంటూ గొప్పగా పండుగలు చేసుకొన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=317

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::