Sunday, May 28, 2017

దక్ష యాగము - 46:


4-112-చ.
సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహత ధూత ధూళి ధూ
సరిత కుబేరదిక్తటము సభ్యులు దక్షుఁడుఁ జూచి "యెట్టి భీ
కర తమ" మం చనం "దమముగాదు, రజఃపటలం" బటంచు ని
వ్వెఱపడి పల్కి రాత్మల వివేకవిహీనతఁ బొంది వెండియున్.
4-113-సీ.
'ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? ;
విలయ సమీరమా? పొలయ దిపుడు;
ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్ర;
శాసనుఁ డిపుడు రాజ్యంబు చేయఁ
జోర సంఘములకో రారాదు; మఱి గోగ;
ణాళి రాకకు సమయంబు గాదు;
కావున నిప్పుడు కల్పావసానంబు;
గాఁబోలుఁ; గా దటు గాక యున్న
4-113.1-తే.
నిట్టి యౌత్పాతిక రజ మెందేనిఁ గలదె?'
యనుచు మనముల భయమంది రచటి జనులు
సురలు దక్షుఁడు; నంతఁ బ్రసూతి ముఖ్యు
లయిన భూసురకాంత లిట్లనిరి మఱియు.

టీకా:
సరభస = తొందరపడుతున్న; వృత్తిన్ = విధముగ; అట్లు = ఆవిధముగ; అరుగు = వెళుతున్న; సైన్య = సన్యము యొక్క; పదా = అడుగుల; హత = తాకిడిచే; ధూత = ఎగురకొట్టబడిన; ధూళి = దుమ్మువలన; ధూసరిత = దుమ్ముకొట్టుకుపోయిన; కుబేరదిక్తటము = ఉత్తర దిక్కును {కుబేరదిక్తటము – ఉత్తరపు (దిక్పాలకుడు కుబేరుని దిక్కు) దిక్కు (దిక్కు తటము), ఉత్తరపు దిక్కు}; సభ్యులు = దక్షయజ్ఞ సభలోని వారు; దక్షుఁడున్ = దక్షుడూ; చూచి = చూసి; ఎట్టి = ఎంతటి; భీకర = భయంకరమైన; తమము = కారుచీకటో; అంచు = అని; అనన్ = అనుకొనగా; తమము = కారుచీకటి; కాదు = కాదు; రజఃపటలంబు = ధూళిసమూహము; అటన్ = అని; అంచున్ = అంటూ; నివ్వెఱపడి = భయపడిపోయి; పల్కిరి = అనుకున్నారు; ఆత్మలన్ = మనసులలో; వివేకవిహీనతఁబొంది = వివేకం కోల్పోయి; వెండియున్ = మరల. ఈ = ఈ; ధూళి = ధూళియొక్క; పుట్టుట = జనించుట; కున్ = కు; ఎయ్యది = ఏది; హేతువో = కారణమో; విలయ = ప్రళయమునకు చెందిన; సమీరమా = వాయువులా; పొలయదు = సమీపించదు; ఇపుడు = ఇప్పుడు; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; ధరాపతి = రాజుగ; మహిత = అత్యంత; ఉగ్ర = గట్టిగ; శాసనుడు = పాలించువాడు; ఇపుడు = ఇప్పుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయన్ = చేస్తుండగ; చోర = దొంగల; సంఘముల్ = గుంపుల; కో = కు ఐతే; రారాదు = వచ్చుటకు వీలులేదు; మఱి = మరి; గో = గోవుల; గణాళి = గణముల సమూహములు; రాక = వచ్చుట; కున్ = కు; సమయంబున్ = సమయము; కాదు = కాదు; కావున = అందుచేత; ఇప్పుడు = ఇప్పుడు; కల్ప = కాలకల్పము; అవసానంబున్ = అంతము; కాబోలు = అవ్వచ్చు; అటు = అలా; కాక = కాకుండగ; ఉన్న = ఉంటే. ఇట్టి = ఇటువంటి; ఔత్పాదిక = జనించిన; రజము = ధూళి; ఎందేని = ఎక్కడేనా; కలదే = ఉందా ఏమి; అనుచున్ = అంటూ; మనముల్ = మనసులలో; భయమున్ = భయమును; అందిరి = చెందిరి; అచటి = అక్కడి; జనులు = మానవులు; సురలు = దేవతలు; దక్షుడు = దక్షుడు; అంతన్ = అంతట; ప్రసూతి = ప్రసూతి; ముఖ్యులు = మొదలైన ప్రముఖులు; అయిన = అయిన; భూసుర = బ్రాహ్మణ {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కాంతలు = స్త్రీలు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; మఱియు = ఇంక.

భావము:
మహావేగంగా వస్తున్న వీరభద్రుని సైన్యం కాళ్ళ తొక్కిళ్ళచేత రేగిన ధూళికి కమ్మిన ఉత్తరపు దిక్కును, యజ్ఞశాలలోని సభ్యులూ, దక్షుడూ చూసారు; “అబ్బా! ఎంత భయంకరమైన కారుచీకటో” అని అనుకున్నారు; మళ్ళీ “కారుచీకటి కాదు, రేగిన దుమ్ము” అనుకుంటూ భయపడ్డారు; వివేకం కోల్పోయారు; ఇంకా ఇలా అనుకోసాగారు. “ఈ దుమ్ము పుట్టడానికి కారణమేమిటి? ప్రళయ వాయువులా? కాని ఇది ప్రళయకాలం కాదు. చండశాసనుడైన ప్రాచీనబర్హి రాజ్యం చేస్తున్నందున దొంగలగుంపు వచ్చే అవకాశం లేదు. ఆవుల మంద వచ్చే సాయంకాల సమయం కాదు. ఇది కల్పాంతమే కావచ్చు. కాకుంటే ఉత్పాతాన్ని సూచించే ఇంతటి ధూళి ఎలా వస్తుంది?” అని అక్కడి జనులు, దేవతలు, దక్షుడు తమ మనస్సులలో భయపడ్డారు. అప్పుడు ప్రసూతి మొదలైన బ్రాహ్మణస్త్రీలు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=113

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: