Sunday, April 30, 2017

దక్షయాగము - 18:

4-61-క.
ఆ యజ్ఞముఁ గనుగొనఁగా
నా యనుజులు భక్తిఁ బ్రాణనాథుల తోడం
బాయక వత్తురు; మనముం
బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్.
4-62-క.
జనకుని మఖమున కర్థిం
జని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁ గడుం
దనరిన భూషణములఁ గై
కొన వేడ్క జనించె నీశ! కుజనవినాశా!

టీకా:
ఆ = ఆ; యజ్ఞమున్ = యాగమును; కనుగొనగాన్ = చూడవలెనని; నా = నా యొక్క; అనుజులు = సహోదరులు; భక్తిన్ = భక్తితో; ప్రాణనాథుల = భర్తల; తోడన్ = తోటి; పాయక = తప్పక; వత్తురు = వస్తారు; మనమున్ = మనముకూడ; పోయినన్ = వెళ్ళినచో; నేన్ = నేను; వారిన్ = వారిని; అచటన్ = అక్కడ; పొడగనగల్గున్ = చూడగలను.  జనకుని = తండ్రి; మఖమున్ = యాగమున; కున్ = కు; అర్థిన్ = కోరి; చని = వెళ్ళి; నీ = నీ; తోడన్ = తోటి; పారిబర్హ = పారిబర్హమని; సంజ్ఞికతన్ = పేరుతో; కడున్ = మిక్కిలి; తనరిన = అతిశయించిన; భూషణములన్ = ఆభరణములను; కైకొన్ = తీసుకొనవలెనని; వేడ్క = వేడుక, సరదా; జనించెన్ = పుట్టినది; ఈశా = శివా {ఈశుడు - ఈశత్వము కలవాడు, ప్రభువు, శివుడు}; కుజనవినాశ = శివా {కుజనవినశుడు - కుజనులను (దుష్టులను) వినాశ (నాశనము చేయువాడు), శివుడు}.

భావము:
ఆ యజ్ఞాన్ని చూడడానికి నా తోబుట్టువులంతా తమ తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనమూ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళనందరినీ చూచే అవకాశం నాకు కలుగుతుంది. శంకరా! దుష్టజన నాశంకరా! నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనబడే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=62


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: