Wednesday, May 24, 2017

దక్ష యాగము - 42:


4-105-శా.
ఆద్యుం డుగ్రుఁడు నీలకంఠుఁ డిభదైత్యారాతి దష్టోష్ఠుఁడై
మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమప్రక్రియన్ నవ్వుచున్
విద్యుద్వహ్ని శిఖాసముచ్ఛయరుచిన్ వెల్గొందు చంచజ్జటన్
సద్యః క్రోధముతోడఁ బుచ్చివయిచెన్ క్ష్మాచక్ర మధ్యంబునన్.
4-106-వ.
ఇట్లు పెఱికి వైచిన రుద్రని జట యందు.

టీకా:
ఆద్యుండు = శివుడు {ఆద్యుండు - మొదటివాడు, శంకరుడు}; ఉగ్రుడు = శివుడు {ఉగ్రుడు - భయంకరుడు, శంకరుడు}; నీలకంఠుడు = శివుడు {నీలకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శంకరుడు}; ఇభదైత్యారాతి = శివుడు {ఇభదైత్యారాతి - ఇభ (గజ) దైత్య (అసురుని) సంహరించినవాడు, శంకరుడు}; దష్ట = కరచిన; ఓష్ఠుడు = పెదవి కలవాడు; ఐ = అయ్యి; మాధ్యత్ = మధించిన; భూరి = బాగాపెద్ద; మృగ = జంతువులలో; ఇంద్ర = శ్రేష్టుని (సింహపు); ఘోషమునన్ = గర్జనముల; భీమ = భయంకర; ప్రక్రియన్ = విధముగ; నవ్వుచున్ = నవ్వుతూ; విద్యుత్ = మెఱపుల; వహ్ని = నిప్పు; శిఖా = మంటల; సముచ్ఛయ = గుంపుల; రుచిన్ = వలె; వెల్గొందు = ప్రకాశిస్తున్న; చంచత్ = చలిస్తున్న; జటన్ = శిరోజముల జటను; సద్యత్ = అప్పటికప్పుడు పుట్టిన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; పుచ్చి = పెఱకి; వయిచెన్ = వైచెను, విసిరెను; క్ష్మాచక్ర = భూమి, నేల; మధ్యంబునన్ = మధ్యలో. ఇట్లు = ఈవిధముగ; పెఱికి = పీకి; వైచినని = పడవేయగ; రుద్రుని = శివుని; జట = జట; అందు = నుండి.

భావము:
ఆదిదేవుడు, ఉగ్ర రూపుడు, నీలగ్రీవుడు, గజాసుర సంహారి అయిన శివుడు పెదవి కరచుకొని, మదించిన సింహంవలె గర్జించి, భయంకరంగా నవ్వుతూ మెరుపువలె అగ్నిజ్వాల వలె ప్రకాశించే జటను మహాకోపంతో పెరికి భూమిపైన విసరికొట్టాడు. ఈ విధంగా పెరికివేసిన జటనుండి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=105

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: