Saturday, May 27, 2017

దక్ష యాగము - 45:


4-110-వ.
అని కుపిత చిత్తుండై యాజ్ఞాపించిన "నట్లకాక" యని.
4-111-చ.
అనఘుఁడు రుద్రుఁ జేరి ముదమారఁ బ్రదక్షిణ మాచరించి వీ
డ్కొని యనివార్య వేగమునఁ గుంభిని గ్రక్కదలన్ ఝళంఝళ
ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయఁగ భీషణప్రభల్
దనరఁ గృతాంత కాంతకశితస్ఫుట శూలముఁ బూని చెచ్చెరన్.

టీకా:
అని = అని; కుపిత = కోపించిన; చిత్తుండు = చిత్తము కలవాడు; ఐ = అయ్యి; ఆజ్ఞాపించినన్ = ఆజ్ఞాపించగా; అట్లకాక = అలానేయగుగాక; అని = అని.అనఘుడు = పుణ్యుడు; రుద్రున్ = రుద్రుని; చేరి = చేరి; ముదమార = సంతోషపూర్వకముగ; ప్రదక్షిణము = ప్రదక్షిణ {ప్రదక్షిణ - కుడివైపుగా (సవ్యముగ) చుట్టును తిరుగుట}; ఆచరించి = చేసి; వీడ్కొని = సెలవుతీసుకొని; అనివార్య = వారింపరాని; వేగమునన్ = వేగముతో; కుంభిని = భూమి; క్రక్ = మిక్కిలి; కదలన్ = కదిలిపోగా; ఝళంఝళ = ఝళంఝళ యనెడి; ద్వని = చప్పుడు; మణినూపురంబులు = మణులు తాపడము చేసిన అందెలు; పదంబులన్ = అడుగులతో; మ్రోయగ = మోగుతుండగ; భీషణ = భయంకరమైన; ప్రభల్ = కాంతులు; తనరన్ = అతిశయించగ; కృతాంతక = యముని సైతం; అంతక = అంతముచేయునట్టి; శిత = వాడితనము; స్పుట = స్పష్టమగుచున్న; శూలమున్ = శూలమును; పూని = ధరించి; చెచ్చెరన్ = అతివేగముగ.

భావము:
అని కోపంతో ఆజ్ఞాపించగా అలాగే అని... పుణ్యాత్ముడైన వీరభద్రుడు శివుని సమీపించి ప్రదక్షిణం చేసి అతని సెలవు తీసుకొని అడ్డులేని మహావేగంతో భూమి అదిరిపోతుండగా, పాదాలకు తొడిగిన మణులు తాపిన అందెలు ఝళంఝళమంటూ మ్రోగుతుండగా, యముణ్ణి సైతం అంతం చేయగల్గిన వాడిశూలాన్ని ధరించి వెంటనే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=111

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: