Tuesday, May 16, 2017

దక్ష యాగము - 34:

4-90-చ.
నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ దిరస్కరించు న
క్కలుషుని జిహ్వఁ గోయఁ దగుఁ; గా కటు చేయఁగ నోపఁడేని దాఁ
బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్
బలువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు ధర్మవర్తనుల్.
4-91-వ.
అది గావున.
4-92-మ.
జనుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైన యన్నంబు స
య్యన వెళ్ళించి పవిత్రుఁడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్
ఘను నిందించిన నీ తనూభవ యనం గా నోర్వ, నీ హేయ భా
జన మైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధిఁ బాటిల్లెదన్.

టీకా:
నెలకొని = స్థిరమైన; ధర్మపాలన = ధర్మపరిపాలన చేయువాని; వినిర్ములున్ = మిక్కిలి నిర్మలమైనవాని; భర్గున్ = శివుని; తిరస్కరించు = తెగడునట్టి; ఆ = ఆ; కలుషునిన్ = పాపి యొక్క; జిహ్వన్ = నాలుకను; కోయన్ = కోసివేయుట; తగున్ = సరియైనపని; కాక = కాకుండగ; అటు = అలా; చేయగన్ = చేయుటకు; ఓపడు = శక్తిలేనివాడు; ఏని = అయితే; తాన్ = తనే; పొలియుట = మరణించుట; ఒప్పు = తగినపని; రెంటికిన్ = రెండింటికిని; ప్రభుత్వము = సామర్థ్యము; చాలమిన్ = సరిపోకపోయినచో; కర్ణ = చెవుల; రంధ్రముల్ = కన్నములను; బలువుగన్ = బలముగ; మూసికొంచున్ = మూసికొంటూ; చనన్ = వెళ్ళిపోవుట; పాడి = నీతి; అటన్ = అని; అందురు = అంటారు; ధర్మ = ధర్మము ప్రకారము; వర్తనుల్ = ప్రవర్తించువారు. అదిగావున = అందుచేత. జనుడు = మనిషి; అజ్ఞానమునన్ = అజ్ఞానముచేత; భుజించిన = తినినటువంటి; జుగుప్సంబు = అసహ్యకరము; ఐన = అయిన; అన్నంబు = అన్నము; సయ్యన = వెంటనే; వెళ్ళించి = కక్కివేసి; పవిత్రుడు = శుద్ధుడు; ఐన = అయిన; గతిన్ = విధముగ; దుష్టాత్ముండవు = దుష్టస్వభావముకలవాడవు; ఐ = అయ్యి; ఈశ్వరున్ = శివుని; ఘనున్ = గొప్పవానిని; నిందించిన = దూషించిన; నీ = నీ యొక్క; తనూభవన్ = పుత్రికను {తనూభవ - తనువు (దేహము)న భవ పుట్టినది, పుత్రిక}; అనంగాన్ = అనుటకు; ఓర్వన్ = భరించలేను; ఈ = ఈ; హేయ = ఏవగింపులకు; భాజనము = స్థానము; ఐనట్టి = అయినట్టి; శరీరమున్ = దేహమును; విడిచి = విడిచిపెట్టి; భాస్వత్ = అగ్ని; శుద్ధిన్ = శుద్ధిని; పాటిల్లెదన్ = కలిగించుకొనెదను.

భావము:
ధర్మపాలన చేత పవిత్రుడైన శివుణ్ణి తిరస్కరించే పాపాత్ముని నాలుక కోసివేయాలి. అలా చేయలేనప్పుడు చావడం మంచిది. రెండూ చేతకాని పక్షంలో చెవులను మూసికొని అక్కడినుండి వెళ్ళిపోవడం న్యాయమని ధర్మజ్ఞులు చెప్తారు. అందువల్ల... తెలియక తిన్న దుష్టాన్నాన్ని మానవుడు కక్కి పవిత్రుడైనట్లు దుష్టుడవై ఈవిధంగా గొప్పవాడైన ఈశ్వరుని నిందించిన నీకు కుమార్తెను అనిపించుకొనడం నాకు ఇష్టం లేదు. నీవల్ల ప్రాప్తమైన ఈ పాడు శరీరాన్ని విడిచి పవిత్రురాలను అవుతాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=92

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: