వీరభద్రుండు విహత విద్వేషి భద్రుఁ
డగుచుఁ దన వేయి చేతులు మొగిచి వినయ
మెసఁగ "నే నేమి చేయుదు? నెఱుఁగ నాకు
నానతి" మ్మన్న నతని కయ్యభవుఁ డనియె.
4-109-చ.
"గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్
బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయమంటివే
నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్?"
టీకా:
వీరభద్రుండు = వీరభద్రుడు; విహత = చంపబడిన; విద్వేషి = శత్రువులనుకూర్చుటవలన; భద్రుడు = క్షేమము కలిగించువాడు; అగుచున్ = అవుతూ; వేయి = వెయ్యి (1000); చేతులు = చేతులు; మొగిచి = ముడిచి; వినయుము = వినయము; ఎసగ = అతిశయించగ; నేను = నేను; ఏమి = ఏమి; చేయుదున్ = చేయవలెను; ఎఱుగన్ = తెలియునట్లు; నాకు = నాకు; ఆనతిమ్ము = ఆజ్ఞాపించుము; అన్న = అనగా; అతని = అతని; కినే = కి; ఆ = ఆ; అభవుడు = శివుడు; అనియె = పలికెను. గురు = మిక్కిలి; భుజ = బాహు; శౌర్య = బలమతిశయించినవాడ; భూరి = బహుమిక్కిలి; రణ = యుద్ధముచేయుటలో; కోవిద = నేర్పరి; మత్ = నా యొక్క; భట = సేనా; కోటి = సమూహము; ఎల్లన్ = అంతటకును; నీవు = నీవు; అరయ = పూని; వరూధినీ = సేనా; వరుడవు = నాయకుడవు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; యజ్ఞమున్ = యజ్ఞమున; కూడన్ = తో పాటు; దక్షునిన్ = దక్షని; పరువడిన్ = వెంటనే; త్రుంపుము = సంహరించుము; ఈవు = నీవు; అచటన్ = అక్కడ; బ్రాహ్మణతేజము = బ్రాహ్మణతేజము; అజేయము = జయింపశక్యముకానిది; అంటివేమి = అంటే; అరిదిని = దుర్లభముగ; మత్ = నా యొక్క; అంశ = అంశతో; సంభవుడవు = పుట్టినవాడవు; ఐ = అయ్యి; తగు = తగినవాడవు; నీకున్ = నీకు; అసాధ్యము = అసాధ్యము; ఎయ్యెడన్ = ఎక్కడిది.
భావము:
వీరభద్రుడు శత్రు సంహారాన్ని తలపెట్టినవాడై తన వేయి చేతులు మోడ్చి వినయంతో “నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి” అని అడిగాడు. అప్పు డతనితో శివుడు ఇలా అన్నాడు. “యుద్ధవిద్యా విశారదుడవైన భుజపరాక్రమశాలీ! నా ప్రమథగణాల కంతటికీ నీవు సేనానివై వెంటనే వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని సంహరించు. బ్రాహ్మణతేజం అజేయమని సందేహించకు. నా అంశతో జన్మించిన నీకు అసాధ్య మెక్కడిది?”
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=109: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment