Monday, February 10, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 198

రాజీవసదృశలోచన

11-125-క.
రాజీవసదృశనయన! వి
రాజితసుగుణా! విదేహరాజవినుత! వి
భ్రాజితకీర్తి సుధావృత
రాజీవభవాండభాండ! ఘుకులతిలకా!
          రాజీవపుష్పాలకు సాటివచ్చే చక్కని కన్నులున్న వాడ! ప్రకాశించే సుగుణాలు గల వాడా! విదేహరాజు జనకునంతటి వానిచే పొగడబడిన వాడ! మిరుమిట్లు గొలిపే కీర్తితో ఆవరించబడిన బ్రహ్మాండభాండాలు గలవాడ! రఘువంశానికి తిలకం వలె శోభాకర మైన శ్రేష్ఠుడా! శ్రీరామా! నమస్కారం.
11-125-ka.
raajeevasadRSanayana! vi
raajitasuguNaa! vidaeharaajavinuta! vi
bhraajitakeerti sudhaavRta
raajeevabhavaaMDabhaaMDa! raghukulatilakaa!
          రాజీవ సదృశ నయన = శ్రీరామా {రాజీవ సదృశ నయనుడు - రాజీవ (పద్మముల) సదృశ (వంటి) నయన (కన్నులు కల వాడు), రాముడు}; విరాజిత సుగుణా = శ్రీరామా {విరాజిత సుగుణుడు - విరాజిత (ప్రకాశించెడి) సుగుణుడు (సుగుణాలు కలవాడు), రాముడు}; విదేహరాజ వినుత = శ్రీరామా {విదేహరాజ వినుత - విదేహ దేశపు రాజు (జనకుని)చే వినుత (స్తుతింపబడిన వాడు), రాముడు}; విభ్రాజిత కీర్తిసుధావృత రాజీవభవాండభాండ = శ్రీరామా {విభ్రాజిత కీర్తిసుధావృత రాజీవభవాండభాండ - విభ్రాజిత (ప్రకాశించెడి) కీర్తి అనెడి సుధ (అమృతము)చేత ఆవృత (ఆవరింపబడిన) రాజీవభవ అండభాండ (బ్రహ్మాండభాండము కల వాడు), రాముడు}; రఘుకుల తిలకా = శ్రీరామా {రఘుకుల తిలకుడు - రఘు కుల (వంశానికి) తిలకుడు (శోభాకరమైన వాడు), రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: