Saturday, February 22, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 207

మ్రింగెడివాడు

8-241-క.
మ్రింగెడి వాఁడు విభుఁ డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత ది నమ్మినదో?
          ఆమె సర్వమంగళ కదా మరి. అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.
ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన’, లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని,  శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.
8-241-ka.
mriMgeDi vaa@MDu vibhuM Dani
mriMgeDidi garaLa maniyu mae lani prajakun
mriMgu mane sarvamaMgaLa
maMgaLasootraMbu neMta madi namminadO?
          మ్రింగెడి = మింగుతున్న; వాడు = అతను; విభుండు = భర్త; అని = అని; మ్రింగెడిది = మింగేది; గరళమున్ = విషము; అనియున్ = అని తెలిసి కూడ; మేలు = మంచి కలుగుతుంది; అని = అని; ప్రజ = లోకుల; కున్ = కు; మ్రింగుము = తినుము; అనెన్ = అనెను; సర్వమంగళ = ఉమాదేవి {సర్వమంగళ - సర్వులకు మంగళము కలిగించునది, పార్వతి}; మంగళసూత్రంబున్ = తాళిబొట్టును; ఎంతన్ = ఎంతగా; మదిన్ = మనసు నందు; నమ్మినదో = నమ్మెనో కదా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: