Friday, February 21, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 206

పరగన్

1-161-.
రఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం
ణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్త్రాకృతి నున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేశముం
రుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే?
          ఇంతకుముందు గురువర్యులు ద్రోణాచార్యులవారి సన్నధిలోనే మా మగవాళ్ళు అందరు బాణాలు ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన యుద్ధవిద్యలు సమస్తం అభ్యసించారు. అశ్వత్థామా! నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడవు కదా. అలాంటి నీకు హృదయంలో ఏమాత్రం ఇసుమంతైనా కనికరం అన్నది లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని సంహరించటం న్యాయమా చెప్పు నాయనా!


 అని ద్రౌపది అశ్వత్థామను ప్రశ్నిస్తోంది. ద్రౌపది చూపిన సంయమనం ఎంతో గొప్పది. గురువులు విద్యతో పాటు నీతినియమాలు చెప్తారు. ఉపసంహారం తెలియకుండా అస్త్రశస్త్రాలను ప్రయోగిచటం నీతి కాదు. అతని తండ్రి ఆచార్య ద్రోణుడు, తల్లి కృపి ఆచార్య కృపుని చెల్లెలు. అతను నీతిని ఉల్లంఘంచి తన కొడకులను క్రూరంగా చంపాడు. అర్జునునిపై బ్రహ్మాస్త్రం వేసాడు. అయినా తమ గురువుల వంశాలకి చెందిన వాడు. అతని తల్లి కృపి కూడ తనలాంటి మాతృమూర్తే అని ఇవన్నీ అంతటి దుఃఖంలోను స్మరించి స్పందించింది. అది ఆమె వ్యక్తిత్వ ఔన్నత్యం.
 1-161-ma.
para@Mgan maa magavaara laMdaRunu mun baaNaprayOgOpasaM
haraNaadyaayudhavidyalanniyunu drONaachaaryuchae nabhyasiM
chiri puttraakRti nunna drONuDavu, nee chittaMbulO laeSamuM
garuNaasaMgamu laeka Sishyasutulan khaMDiMpa@Mgaa@M baaDiyae.
          పరఁగన్ = ప్రసిద్ధముగా; మా = మా యొక్క; మగవారలు = భర్తలు; అందఱును = అందరును; మున్ = పూర్వము; బాణ = బాణములను; ప్రయోగ = ప్రయోగించుట; ఉపసంహరణ = మరల్చుట; ఆది = మొదలగు; ఆయుధ = అస్త్ర; విద్యలు = విద్యలు; అన్నియును = అన్నీ; ద్రోణ = ద్రోణుడు అను; ఆచార్యు = గురువు; చేన్ = వలన; అభ్యసించిరి = నేర్చుకొంటిరి; పుత్త్ర = పుత్రని యొక్క; ఆకృతిన్ = రూపముతో; ఉన్న = ఉన్నటువంటి; ద్రోణుడవు = ద్రోణుడవు; నీ = నీ; చిత్తంబు = మనసు; లోన్ = లో; లేశమున్ = కొంచము కూడా / పిసరంతైన; కరుణ = దయ యొక్క; సంగము = స్పర్శ; లేక = లేకుండగా; శిష్య = శిష్యుల యొక్క; సుతులన్ = పుత్రులను; ఖండింపఁగాన్ = సంహరింపగా; పాడియే = న్యాయమా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: