Tuesday, February 4, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 192

నరుమాటల్

1-221-మ.
రుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
రు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
భూపాయువు లెల్లఁ జూపులన శుంత్కేళి వంచించు నీ
మేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
          ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మాంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.
అత్యద్భుతము, ప్రసిద్ధము, ప్రభావవంతము ఐన  భీష్మస్తుతిలోని పద్యం ఇది. భీష్ముడు స్వచ్చందమరణుడు. అంపశయ్యమీద ఉన్నాడు. అదిగో ఉత్తరాయణం వచ్చింది ఏకాదశి రోజు. నరుడు నారయణుడు కూడ వచ్చేరు. ధర్మరాజు చూడడానికి వచ్చేడు. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించి తనకు ఇది తగిన సమయం అని గ్రహించిన వాడై కాలగతుడు అయ్యాడు. ఇక్కడ కృష్ణుడు కాలస్వరూపుడుగా వర్ణించబడ్డాడు. సర్వనియామకుడు కనుక పరమేశ్వరుడు, వాసుదేవుడు కనుక హృత్పద్మంలో స్థిరంగా పద్మాసనాసీనుడు. యుద్ధం ఆరంభం కాబోతోంది. కౌరవ పాండవ సైన్యాల మధ్యకి నడిపించేవాడు నరుని తీసుకెళ్ళాడు. కాలపురుషుడు కాటేసేశాడు నరుడు చేయాల్సిన పని చేయడమే తరవాయి తరతమ భేదాలు లేవు వీళ్ళందరు ఎలాగు చచ్చిపోయిన వారే అని సూచింప బడింది. ఒకడు వస్తువు ధరచెల్లించి కొన్నాడు. దానిని కొట్లోనో ఉంచి పిమ్మట తీసుకు వెళ్లాడు. ఈ వ్యవధానంలో కూడ అది అమ్ముడు పోయినవస్తువే కదా. భీష్ముడు అప్పుడే నిర్ణయించుకున్నాడు అన్నా ఆ సమయానికి ఈ రెంటి నడుమ నున్న కాలస్వరూపుడు అక్కడ సిద్ధంగా ఉండటమే భీష్ముని గొప్పదనానికి గీటురాయి.
1-221-ma.
narumaaTal vini navvutO nubhayasaenaamadhyamakshONilO
baru leekshiMpa rathaMbu nilpi parabhoopaalaavaLiM joopuchuM
barabhoopaayuvu lella@M joopulana SuMbhatkaeLi vaMchiMchu nee
paramaeSuMDu veluMguchuMDeDunu hRtpadmaasanaaseenu@MDai.
          నరు = అర్జునుని; మాటల్ = మాటలను; విని = విన్న వాడై; నవ్వు = నవ్వు; తోన్ = తూ; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యమ = మధ్యన ఉన్న; క్షోణి = ప్రదేశము; లోన్ = లో; పరులు = శత్రువులు; ఈక్షింపన్ = చూచుచుండగ; రథంబున్ = రథమును; నిల్పి = నిలబెట్టి; పర = శత్రువు లైన; భూపాల = రాజుల యొక్క; ఆవళిన్ = సమూహమును; చూపుచున్ = చూపెడుతూ; పర = శత్రువు లైన; భూప = రాజుల యొక్క; ఆయువులు = ప్రాణములు; ఎల్లన్ = అన్నిటిని; చూపులన = చూపులతోనే; శుంభత్ = మెరయుచున్న; కేళి = విలాసముతో; వంచించున్ = లాగికొను; = ; పరమేశుండు = పరమమైన ఈశుండు / హరి; వెలుంగుచు = ప్రకాశిస్తూ; ఉండెడును = ఉండుగాక; హృత్ = హృదయ మనే; పద్మ = పద్మమును; ఆసనా = ఆసనముగ; ఆసీనుఁడు = స్వీకరించినవాడు; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: