ధన్యున్
10.1-1705-శా.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్గోరరు? కోరదే
మును రమాకాంతాలలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్?
మదపుటేనుగుల
లాంటి దుష్టులైన రాజుల పాలిటి సింహము వంటి ఓ శ్రీకృష్ణ ప్రభూ! నీవు
కృతార్థుడవు; లోకంలో అందరి మనస్సులను రంజిపజేసే వాడవు; ఉత్తమ వంశము, విజ్ఞానము,
సౌందర్యం, జవ్వనం, మంచితనం, సంపద, బలం, పరాక్రమం, కారుణ్యములతో అలరారుతుంటావు.
అలాంటి నిన్ను కన్యలు ఎవరైనా వరించకుండా ఉండగలరా? నే ఒక్కర్తెనా నిన్ను మోహించింది? నా ఒక్కర్తెకేనా
వలపు అన్నది పుట్టింది? ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీమహాలక్ష్మి అలనాడే నిన్ను వరించ లేదా?
అంటు రుక్మిణి పంపిన రహస్య సందేశాలు అన్ని శ్రీకృష్ణునికి
విప్రుడు విన్నవిస్తున్నాడు. గొప్పదనాన్ని వర్ణించడానికి శార్దూల విక్రీడిత వృత్తం
ఎన్నుకోడంలో ఛందో సార్థక్యం, న్య కారాన్ని ప్రాసగా ప్రయోగించటంలో, పద్యం నడకలో
శబ్ద సంయోజకం శైలి, వర్ణించటంలో ఉత్తమతమత్వాన్ని సూచించటానికి వాడిన నిన్ను ఎవరు
కాంక్షించరు అనే చమత్కారంలో, నేను అత్యుత్తమాన్ని కోరతాను నేనేం తక్కువ కాదు అనే అణుకువతో
కూడిన రాజసం సూచనలో వర్ణన విశిష్ఠత పాత్రౌచిత్యం ఈ పద్యానికి చక్కటి సౌందర్యాన్ని
యిచ్చాయి.
10.1-1705-Saa.
dhanyun
lOkamanObhiraamu@M gula vidyaa roopa taaruNya sau
janya Sree
bala daana Saurya karuNaa saMSObhitun ninnu nae
kanya
lgOraru? kOradae munu ramaakaaMtaalalaamaMbu raa
janyaanaekapasiMha!
naa valananae janmiMchenae mOhamul.
ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విఙ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = మిక్కలి వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; ఏ = ఏ; కన్యల్ = కన్యలుమాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువులనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment