కంటిగంటి
3-146-మత్త.
కంటిఁ గంటి భవాబ్ది దాటఁగ గంటి నాశ్రితరక్షకుం
గంటి యోగిజనంబు డెందము గంటిఁ జుట్టముఁ గంటి ము
క్కంటికిం గనరాని యొక్కటిఁ గంటిఁ దామరకంటిఁ జే
కొంటి ముక్తివిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్.
ఆహా! దర్శించాను; సందర్శించాను; సంసారసాగరాన్ని
తరించాను; ఆశ్రితులను రక్షించే ఆ సర్వరక్షకుని దర్శించాను; మహాయోగుల
ఆత్మబంధువును సందర్శించాను; మూడు కన్నులున్న మహేశ్వరునికి కూడ అంతుపట్టని అద్వితీయుని కనుగొన్నాను; పద్మాక్షుడు గోవిందుని
చేరాను; ముక్తిమార్గాన్ని చేరుకున్నాను; పరమానందాన్ని
అందుకున్నాను.
శ్రీకృష్ణనిర్యాణ ఘట్టంలో ఒక చెట్టుమొదట్లో ఆసీనుడైన స్వామిని
కనుగొన్న ఉద్ధవుని ఉద్వేగం ఇది. ఈ మత్తకోకిల పద్యంలో ఉద్దవుడనే కోకిల
కృష్ణదర్శనంతో మత్తెక్కి పారవశ్యంతో కూజితాలు చేస్తున్నాడు.
3-146-matta.
kaMTi@M gaMTi
bhavaabdi daaTa@Mga gaMTi naaSritarakshakuM
gaMTi
yOgijanaMbu DeMdamu gaMTi@M juTTamu@M gaMTi mu
kkaMTikiM
ganaraani yokkaTi@M gaMTi@M daamarakaMTi@M jae
koMTi muktividhaanamuM
dalakoMTi saukhyamu laMdagan.
కంటిగంటి = చూసేను చూసేను; భవ = సంసారము అను; అబ్దిన్ = సాగరమును; దాటగన్ = దాటు విధానమును; కంటి = చూసితిని; ఆశ్రితరక్షకున్ = కృష్ణుని {ఆశ్రిత రక్షకుడు
– ఆశ్రయించిన వారిని
రక్షించు వాడు, కృష్ణుడు}; కంటి = చూసితిని; యోగిజనంబు డెందమున్ = కృష్ణుని {యోగిజనంబు డెందము - యోగుల మనసులో ఉండు వాడు, విష్ణువు}; కంటి = చూసేను; చుట్టమున్ = బంధువును; కంటి = చూసేను; ముక్కంటికిం గనరాని యొక్కటిన్ = కృష్ణుని {ముక్కంటికిం గనరాని
యొక్కటి - శివునికి కూడ చూచుటకురాని ఏకేశ్వరుడు, విష్ణువు}; కంటి = చూసేను; తామర కంటిన్ = కృష్ణుని {తామర కంటి - పద్మములవంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు}; చేకొంటి = చేపట్టేను; ముక్తి విధానమున్ = కృష్ణుని {ముక్తి విధానము
– ముక్తిని చేరు
మార్గము, విష్ణువు}; తలకొంటి = చేరుకొన్నాను; సౌఖ్యములు = సౌఖ్యములు; అందగన్ = పొందగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~