10.1-1401-వ.
తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు, వృష్ణి, భోజ, మరు, దశార్హ, కకురాంధక ప్రముఖు లగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియమించె; ని వ్విధంబున.
10.1-1402-క.
మధుసూదన సత్కరుణా
మధురాలోకన విముక్త మానస భయులై
మధురవచనములఁ దారును
మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!
భావము:
అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కంసుడి భయం వలన ఇతర దేశాలలో బాధలు పడుతున్న తన జ్ఞాతులూ చుట్టాలూ అయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కుకురులు, అంధకులు మొదలైన వారిని అందరినీ పిలిపించాడు. వారి మనసులు తృప్తిచెందేలా వారికి ధనాదికాలు బహూకరించి, వారి వారి గృహాలలో నివసించం డని నియోగించాడు. ఈ విధంగా మధుసూదనుడు కృష్ణుడి యొక్క మిక్కిలి కరుణాపూరితమైన మధురాతిమధురమైన కటాక్షవీక్షణాలతో మనసులోని భీతి తొలగినవారై తీయ తీయని సల్లాపాలతో వారూ మథురాపురి పురప్రజలు కలసి మెలసి జీవించారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=167&padyam=1402
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment