Friday, December 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 102

( రామకృష్ణుల ఉపనయనము )

10.1-1407-క.
గర్గాది భూసురోత్తమ
వర్గముచే నుపనయనము వసుదేవుఁడు స
న్మార్గంబునఁ జేయించెను
నిర్గర్వచరిత్రులకును నిజ పుత్రులకున్.
10.1-1408-క.
ద్విజరాజ వంశవర్యులు
ద్విజరాజ ముఖాంబుజోపదిష్టవ్రతులై
ద్విజరాజత్వము నొందిరి
ద్విజరాజాదిక జనంబు దీవింపంగన్.

భావము:
వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర కల తన పుత్రులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. చంద్రవంశజులలో అగ్రగణ్యులై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖకమలాల నుండి ఉపనయన మంత్రాల ఉపదేశములు పొందారు. విప్రులు, రాజులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైనవారూ దీవెనలీయగా ద్విజత్వం అందుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=169&padyam=1408

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: