Wednesday, December 16, 2020

శ్రీ కృష్ణ విజయము - 101

( నందుని వ్రేపల్లెకు పంపుట )

10.1-1405-ఉ.
ఇక్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము చేసి వత్తు మే
మక్కడికిన్; మదీయులకు నందఱికిన్ వినుపింపు మయ్య యే
మెక్కడ నున్న మాకు మది నెన్నఁడు పాయవు మీ వ్రజంబులో
మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్."
10.1-1406-వ.
అని పలికి వస్త్రభూషణాదు లొసంగి సాదరంబుగం గౌఁగిలించుకొని గోవిందుం డనిచిన నందుండు ప్రణయవిహ్వలుండై బాష్పజలపూరితలోచనుం డగుచు వల్లవులుం దానును వ్రేపల్లెకుం జనియె; నంత

భావము:
మేము ఇక్కడ మధురలో ఉన్న మన చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడకి వ్రేపల్లెకు వస్తాము. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతోనూ, దయతోనూ మాకు చేసిన ఉపచారాలు, మేము ఎక్కడున్నా మా మనసుల నుండి ఎన్నటికినీ దూరము కావు.” ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటిని ఇచ్చి, ఆదరంతో కౌఁగిలించుకుని, సాగనంపాడు. నందుడి మనసు అనురాగాతిశయంతో చలించింది. కన్నీళ్ళతో నిండిన కన్నులు కలవాడై, గొల్లపెద్దలతో కలిసి వ్రేపల్లెకు బయలుదేరి వెళ్ళాడు. అనంతరం. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=168&padyam=1405

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: