10.1-1411-వ.
చని మహావైభవరాశియైన కాశిం జేరి తత్తీరంబున నవంతీపుర నివాసియు సకలవిద్యావిలాసియు నైన సాందీపుం డను బుధవర్యునిఁ గని యధోచితంబుగ దర్శించి, శుద్ధభావవర్తనంబుల భక్తి సేయుచునుండ, వారలవలన సంతుష్టుండై.
10.1-1412-శా.
వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ
న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి
ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా
భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.
భావము:
రామకృష్ణులు గొప్ప వైభవములకు కాణాచి అయిన కాశీపట్టణం చేరారు. అక్కడ ఉన్న అవంతీపట్టణ నివాసి, సమస్త విద్యలకూ గని వంటి వాడూ అయిన సాందీపనీ అనే పండితోత్తముడిని సముచిత రీతిని సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో సత్ప్రవర్తనతో ప్రగాఢమైన భక్తితో ఆయనను సేవించారు. ఆచార్యులు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించారు. బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషించిన మనసుతో రామకృష్ణులకు నాలుగు వేదములు మరియు శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను ఆరు వేదాంగములు, ధనుర్వేదము, తంత్రము, మనుశాస్త్రాది సకల ధర్మశాస్త్రాలు, చక్కటి న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైనవాటిని తేటతెల్లంగా బోధించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1412
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment