Friday, December 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 103

( రామకృష్ణుల ఉపనయనము )

10.1-1409-వ.
ఉపనయ నానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో హిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబు లందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై.
10.1-1410-శా.
ఉర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త
త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్
సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్
గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.

భావము:
ఉపనయనము జరిగిన పిమ్మట, వసుదేవుడు విప్రులకు దక్షిణల సహితంగా ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేసాడు. ఇంతకు మునుపు రామకృష్ణులు జననకాలంలో తాను మనస్సులో దానం చేసినట్లు చేసిన సంకల్పం ప్రకారం, ఇప్పుడు ప్రత్యక్షంగా గోవులను ఇచ్చాడు. కోరిన వారికి కోరినట్లు సమస్త వస్తువులూ సమర్పించాడు. ఈ విధంగా బలరామకృష్ణులు బ్రహ్మచర్యవ్రతం అవలంబించి. భూలోకంలో మానవులు ఎవరైనా సరే గురువు నుండి ఉపదేశం పొందితే తప్ప ఏ విద్య అనుష్ఠానం మొదలుపెట్ట రాదు సుమా, అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తము నెరిగిన వారైనప్పటికినీ జగద్గురువులు అయినప్పటికీ; పరిపూర్ణులు అయినప్పటికీ; బలరామకృష్ణులు ఆచార్యుడి కోసం అన్వేషిస్తూ బయలుదేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=169&padyam=1410

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: