Monday, November 30, 2020

శ్రీ కృష్ణ విజయము - 89

( కంస వధ )

10.1-1376-క.
తమగమున కెగురు యదు స
త్తమగణ్యునిఁ జూచి ఖడ్గధరుఁడై యెదిరెం
దమ గమివారలు వీరో
త్తమగణవిభుఁ డనఁగఁ గంసధరణీపతియున్.
10.1-1377-శా.
పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్ గేశబంధంబు లో
క క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లాకల్పాంతవేళాపత
న్నక్షత్రంబుల భంగి రాల రణసంరంభంబు డిందించి రం
గక్షోణిం బడఁద్రొబ్బెఁ గృష్ణుఁడు వెసం గంసున్ నృపోత్తంసునిన్.

భావము:
తానున్న గద్దెమీదకి ఎగిరి దూకుతున్న యాదవ మహావీరుడు శ్రీకృష్ణుడిని చూసి మథురను ఏలే కంసుడు ఖడ్గాన్ని చేపట్టి ఎదిరించాడు అతని పక్షంలోని వారంతా కంసుడు గొప్పవీరుడైన ప్రభువు అని ప్రశంసించారు. పక్షులకు ప్రభువైన గరుత్మంతుడు పామును ఎలా పట్టుకుంటాడో, అలా శ్రీకృష్ణుడు కంసుడి జుట్టుముడి పట్టుకున్నాడు. సభలోని జనులంతా భయభ్రాంతులు అయ్యారు. ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరి అతని కిరీటంలోని మణులు జలజల నేలరాలిపోయాయి. కంస మహారాజు యుద్ధ సన్నాహం అణగించి, యదువల్లభుడు మల్లరంగస్థలంమీదకి పడద్రోసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=164&padyam=1377

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 88

( చాణూర ముష్టికుల వధ )

10.1-1373-ఉ.
"వల్లవబాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగఁ ద్రొబ్బుఁ; డీ
గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టు; డుర్వికిం
దెల్లముగాఁగ నేడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ
డెల్లవిధంబులం; బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్."
10.1-1374-వ.
అని పలుకు సమయంబున.
10.1-1375-శా.
జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను
ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ లక్షించి పౌరప్రజా
సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థి యై
లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్.

భావము:

భావము:
“ఈ గొల్లపిల్లలను నగరద్వారం బైటకి పడిపోయేలా నెట్టేయండి. ఈ యాదవులను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేలా, ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఈ ఉగ్రసేనుడు నాకు తండ్రి కాడు. అన్నివిధాలా శత్రువుకు ఇష్టమైనవాడు. వాడిని కాపాడకండి.” ఇలా కంసుడు యాదవులను ముట్టడించమని అంటుండగా.కొండశిఖరాన తిరిగే జింకను చంపడానికి, పిక్కబలంతో కుప్పించి దూకే సింహకిశోరం లాగున, శ్రీకృష్ణుడు కంసుని సంహరించాలని తలచినవాడై గురి చూసి మంచె మీదికి యుద్ధోత్సాహంతో దూకాడు. కొలువులో ఉన్న ప్రజలు అందరూ తల్లడిల్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1373

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, November 29, 2020

శ్రీ కృష్ణ విజయము - 87

( చాణూర ముష్టికుల వధ )

10.1-1370-క.
"వల్లవబాలకు లని మన
మల్లవరులు పెనఁగి నేడు మడిసిరి వీరల్
బల్లిదులు; తలఁడు తలఁ" డని
చెల్లాచెదరైరి పాఱి చిక్కిన మల్లుల్.
10.1-1371-ఉ.
మల్లురఁ జంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శో
భిల్లఁగఁ బాదపద్మములఁ బెల్లుగ నందెలు మ్రోయ వచ్చు నా
వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు ల
ల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగఁ గంసుఁడు దక్క నందఱున్.
10.1-1372-వ.
అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె.

భావము:
కేవలం గోపాలబాలకులు అనుకుని వారితో యుద్ధం చేసి మన మల్లశ్రేష్ఠులు మరణించారు. ఈ రామకృష్ణులు చాలా బలవంతులు. “దూరంగా పొండి” అంటూ తక్కిన మల్లురు అందరూ చెల్లాచెదరై పారిపోయారు. గొల్లలరాజైన నందుడి నందనులు మల్లులను చంపి గొల్లలమధ్య సింహాలలా ప్రకాశిస్తూ, అందెలు మ్రోగుతున్న అడుగుదామరలతో అడుగులు వేస్తూ వస్తుంటే, ఒక్క కంసుడు తప్పించి బ్రాహ్మణులు మొదలైన వారు అందరూ రెప్పవాల్చక చూసి ప్రీతితో పొగడారు. అప్పుడు సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూసి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1371

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 86

( చాణూర ముష్టికుల వధ )

10.1-1366-ఆ.
త్రిప్పి నేలవైవ దిగ్గన రక్తంబు
వదనగహ్వరమున వఱదవాఱ
ముష్టికుండు ఘోరముష్టి సత్వము చెడి
గూలె గాలిఁ దరువు గూలునట్లు.
10.1-1367-వ.
మఱియును.
10.1-1368-క.
పాటవమునఁ బలుపిడికిట
సూటిం బడఁబొడిచె బలుఁడు శోభిత ఘన బా
హాటోప నృపకిరీటుం
గూటున్ వాచాటు నధిక ఘోర లలాటున్.
10.1-1369-వ.
అంత న ద్దనుజాంతకుండు చరణప్రహరణంబుల భిన్నమస్తకులం జేసి వాని చెలుల నంతకాంతికంబున కనిచిన.

భావము:
బలరాముడు అలా గిరగిరా త్రిప్పి నేలమీదకి దబ్బున పడవేయడంతో ముష్టికుడి గుహలాంటి నోటినుంచి రక్తం వరదలై పారింది. బలరాముడి ఘోరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ కోల్పోయి, పెనుగాలికి మహా వృక్షం కూలునట్లు, కూలిపోయాడు. ఇంకా గొప్ప భుజబలాటోపంతో రాజునకు ముఖ్యమైన వాడూ, పరమ వదరుబోతూ, మిక్కిలి భయంకరమైన నుదురు కలవాడూ అయిన కూటుడు అనే మల్లుడిని బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచాడు. అటుపిమ్మట, రాక్షసుల పాలిటి యముడైన బలరాముడు, వాడి మిత్రులైన తోసలుడు శలుడు అనే వారిని తన కాలితాపులతో తలలు పగలకొట్టి, యముడి దగ్గరకు పంపేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1368

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, November 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 85

( చాణూర ముష్టికుల వధ )

10.1-1363-క.
శౌరి నెఱిఁజొచ్చి కరములఁ
గ్రూరగతిం బట్టి త్రిప్పి కుంభిని వైచెన్
శూరుం గలహ గభీరున్
వీరుం జాణూరు ఘోరు వితతాకారున్.
10.1-1364-క.
శోణితము నోర నొలుకఁగఁ
జాణూరుం డట్లు కృష్ణ సంభ్రామణ సం
క్షీణుండై క్షోణిం బడి
ప్రాణంబులు విడిచెఁ గంసు ప్రాణము గలఁగన్.
10.1-1365-క.
బలభద్రుండును లోకులు
బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్
బలభేది మెచ్చఁ ద్రిప్పెను
బలవన్ముష్టికునిఁ గంసు బలములు బెగడన్.

భావము:
పరాక్రమవంతుడూ, యుద్ధమందు గంభీరుడూ, భీతిగొలిపేవాడూ, దొడ్డ దేహం కలవాడూ, వీరుడూ అయిన చాణూరుడిని కృష్ణుడు చొరవగా చొచ్చుకుపోయి కర్కశంగా వాడి చేతులు పట్టుకుని గిరగిర త్రిప్పి నేలపై పడదోసాడు. అలా కృష్ణుడిచేత గిరగిర త్రిప్పబడిన చాణూరుడు బలమంతా క్షీణించినవాడై నోటిలోనుండి రక్తం కారుతుండగా నేలమీద పడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోడంతో కంసుడి ప్రాణం కలతబారింది. “బలభద్రుడు నిజంగా బలంలో భద్రుడే” అంటూ లోకులు అంటూండగా; బలాసురుని సంహరించిన ఇంద్రుడు “మేలు మే” లని మెచ్చుకోగా; బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడైన ముష్టికుడిని పట్టుకుని గిరగిరా త్రిప్పాడు. అది చూసిన కంసుడి సేన బెదిరిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1365

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

శ్రీ కృష్ణ విజయము - 84

( చాణూర ముష్టికుల వధ )

10.1-1361-క.
ధృతిచెడి లోఁబడె మల్లుం
డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్
జితకరికిన్ ధృతగిరికిం
దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.
10.1-1362-క.
హరికిని లోఁబడి బెగడక
హరి యురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్
హరి కుసుమమాలికాహత
కరి భంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై.

భావము:
సాటిలేని సంసారసాగరాన్ని దాటడానికి నావ వంటివాడూ; శత్రుపురాలను ధ్వంస మొనర్చినవాడూ; కువలయాపీడ గజాన్నిఓడించినవాడూ; గోవర్ధనగిరిని ఎత్తినవాడూ; గొప్ప సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడూ అయిన శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యంచెడి లోబడిపోయాడు. విరోధి చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ, భయపడక అతడి రొమ్ముపై మహా భయంకరమైన పిడికిలిపోటు పొడిచాడు. పూదండచే కొడితే ఏనుగు లెక్కచెయ్యని విధంగా, వాడి పోటును లెక్కచేయక శ్రీహరి విజృంభించి ఆ పోరులో పరాక్రమం చూపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=163&padyam=1362

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, November 25, 2020

శ్రీ కృష్ణ విజయము - 83

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1357-క.
గోపాలకృష్ణుతోడను
గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలు రెంత ధన్యులొ
గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?
10.1-1358-క.
శ్రమజలకణసిక్తంబై
కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్
హిమజలకణసిక్తంబై
కమనీయం బగుచు నున్న కమలము భంగిన్.
10.1-1359-ఆ.
సభకుఁ బోవఁ జనదు; సభవారి దోషంబు
నెఱిఁగి యూరకున్ననెఱుఁగకున్న
నెఱిఁగి యుండియైన నిట్టట్టు పలికినఁ
బ్రాజ్ఞుఁ డైనఁ బొందుఁ బాపచయము."
10.1-1360-వ.
అని పెక్కండ్రు పెక్కువిధంబులం బలుకుచుండఁ దద్బాహు యుద్ధంబున.

భావము:
గోవులను మేపే సమయంలో గోపాలకృష్ణుడితో కలసిమెలసి తిరిగే ఆ గోపాలకు లెంత పుణ్యాత్ములో ఎంతటి ప్రభువులకైనా ఇంతటి గొప్ప అనుభవం దక్కదు కదా. మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం వలె కలువరేకుల వంటి కన్నులు కల కృష్ణుని ముఖకమలం చెమటబిందువులతో తడిసి ప్రకాశిస్తున్నది. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోనివారు చేసే దోషాలు తెలిసి ఉపేక్షించరాదు, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినా, దోషాలు తెలిసి కూడా న్యాయవిరుద్ధంగా పలుకరాదు. లేకపోతే, ఎంతటి పండితుడి కైనా ఆ పాపం పట్టుకు తీరుతుంది.” ఇలా ఎందరో పురస్త్రీలు రకరకాలుగా పలుకుతుండగా ఆ ముష్టి యుద్ధంలో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1359

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 82

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1355-సీ.
వేణునాళములమై వెలసిన మాధవుం-
  డధరామృతము లిచ్చి యాదరించుఁ
బింఛదామములమై పెరిగిన వెన్నుండు-
  మస్తకంబునఁ దాల్చి మైత్రి నెఱపుఁ
బీతాంబరములమై బెరిసిన గోవిందుఁ-
  డంసభాగమునఁ బాయక ధరించు
వైజయంతికలమై వ్రాలినఁ గమలాక్షుఁ;-
  డతి కుతూహలమున నఱుతఁ దాల్చుఁ
10.1-1355.1-తే.
దనరు బృందావనంబునఁ దరులమైనఁ
గృష్ణుఁ డానందమునఁ జేరి క్రీడ సల్పు
నెట్టి నోముల నైన ము న్నిట్టి విధము
లేల కామైతిమో యమ్మ! యింక నెట్లు?
10.1-1356-ఉ.
పాపపు బ్రహ్మ; గోపకుల పల్లెలలోన సృజింపరాదె; ము
న్నీ పురిలోపలన్ మనల నేల సృజించె? నటైన నిచ్చలుం
జేపడుఁ గాదె; యీ సుభగుఁ జెందెడి భాగ్యము సంతతంబు నీ
గోపకుమారుఁ బొంద మును గోపకుమారిక లేమి నోఁచిరో?

భావము:
మనము వేణువలమై ఉండి ఉంటే వేణుమాధవుడు కెమ్మోవిసుధలు ఇచ్చి మన్నించేవాడు; నెమలిఈకల దండలమై ఉండి ఉంటే నల్లనయ్య నెత్తిపై పెట్టుకుని నెయ్యం నెరపేవాడు; పచ్చని పట్టుబట్టలమై ఉండి ఉంటే ఈ వల్లవుడు భుజాలపై విడువక ధరించి ఉండే వాడు. వనమాలికలమై ఉండి ఉంటే వనమాలి కృష్ణుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన కైసేసి ఉండేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉండి ఉంటే కృష్ణుడు ఆనందముతో దరిచేరి క్రీడించేవాడు. ఓ యమ్మా! పూర్వజన్మలలో ఎంతటి కష్టమైన వ్రతాలనైనా ఆచరించి ఈలా కాలేకపోయాము కదా. హు!. . ఇపుడు ఇంకేమి చేయగలం. ఈ పాపిష్టి బ్రహ్మదేవుడు మునుపే మనలను ఆ వ్రేపల్లెలో పుట్టించి ఉండకూడదా. ఈ మధురలో ఎందుకు పుట్టించాడో, ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ అందగాడిని పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడేవి కదా. ఈ గోపశేఖరుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వజన్మలలో ఎలాంటి నోములు నోచారో!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1355

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 81

( పౌరకాంతల ముచ్చటలు )

10.1-1352-వ.
ఆ సమయంబునం బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి.
10.1-1353-ఉ.
"మంచి కుమారులం గుసుమ మంజు శరీరులఁ దెచ్చి చెల్లరే
యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులు నైన మల్లురం
గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే
లించుకలేదు; మాను మనఁ డిట్టి దురాత్ముని మున్ను వింటిమే?
10.1-1354-క.
చూచెదరు గాని సభికులు
నీ చిన్నికుమారకులకు నీ మల్లురకు
న్నో చెల్ల! యీడు గాదని
సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే?

భావము:
అలా బలరామకృష్ణులు మల్లులతో పోరాడుతున్న సమయంలో మధురలోని మగువలు గుంపులుగా చేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ తమలో తాము ఇలా ముచ్చటించుకున్నారు. “ఔరా! పువ్వులలా సుకుమారమైన శరీరాలు కల ఈ చక్కటి బాలురను రప్పించి, వజ్రాయుధ మంత సత్తా కలవారూ, పర్వతా లంత కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో ఏమాత్రం మంచితనం లేదు. ఈ రాజు పోరు ఆపమని అనడయ్యె. ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా కన్నామా? సభాసదులైనా చూస్తున్నారే తప్ప; ఈ పసిపిల్లలకూ, ఈ మల్లయోధులకూ జోడు కుదరదని చెప్పరు. ఇది అధర్మం. ఇది వారికీ వారి రాజుకూ శోకం కలిగించదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=162&padyam=1354

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 80

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1349-క.
బలభద్రుఁడు ముష్టికుఁడును
బలములు మెఱయంగఁ జేసి బాహాబాహిం
బ్రళయాగ్నుల క్రియఁ బోరిరి
వెలయఁగ బహువిధములైన విన్నాణములన్.
10.1-1350-వ.
ఇవ్విధంబున.
10.1-1351-క.
వల్లవులు పెనఁగి రున్నత
గల్లులతో భిన్నదిగిభకరవల్లులతో
మల్లురతో రిపుమానస
భల్లులతో భీతగోపపల్లులతోడన్.

భావము:
అనేక రకాల బలవిన్యాసాలతో బలరాముడు, ముష్టికుడు తమ తమ బలాలు చూపుతూ ప్రళయకాలం లోని అగ్నుల చందాన చేతులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు. ఈ విధంగా నిక్కిన చెక్కిళ్ళు కలవారూ, దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు కలవారూ, శత్రువుల మనస్సులకు బల్లెముల వంటివారూ, గోపకుల సమూహానికి భయము కల్గించేవారూ అయిన మల్ల యోధులతో గోపాలబాలకులైన బలరామకృష్ణులు పోరాడారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=161&padyam=1351

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 17, 2020

శ్రీ కృష్ణ విజయము - 79

( చాణూర ముష్టికులతో పోరు )

10.1-1348-వ.
ఇట్లగ్గలంబగు నగ్గలిక డగ్గఱిన మల్లునింగని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవీవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; నట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి యితరేతర హేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పర దీర్ఘనిర్ఘాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్య తుంగతరంగ తాడితంబు లగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టి ఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి గ్రద్దన నయ్యిద్దఱుం దిరుగు నెడ హరి చొచ్చి పేర్చి యార్చి జెట్టింబట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి తెరలక పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి గొబ్బున మేను వర్ధిల్ల నర్దాంగకంబున నుండి జానువుల నొత్తుచు నురవడింగరవడంబున నున్ననా దుర్నయుండును “బాల! మేలు మే”లని లీలం గాలు చొరనిచ్చి త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుంజని వెన్నెక్కి నిక్కిన న క్కంసభటుండు మదజలరేఖా బంధురం బగు గంధసింధురంబు చందంబునఁ పదంబునుఁ బదంబునం జాఁపి కరంబునుఁ గరంబున గ్రహించి సహించి వహించి నైపుణ్యంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక న ప్పద్మలోచనుండు కేడించి యేచి సమతలంబున వైచి ప్రచండం బగు వాని పిచండంబు వాగించి కాలఁధిక్కరించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసి సభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి రక్షించుకొనిన నా రక్షోవైరి వైరి కటిచేలంబు పట్టి యెత్తి యొత్తి నడుమ రాగెయిడి సందుబెట్టి నవ్విన, న వ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన, నిరోధంబుఁ బాసి తిరిగిన వసుదేవుపట్టి పట్టిసంబుఁ గొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబుపట్టి హుమ్మని నెమ్మొగంబునం గాలిడి మీఁదైనం గేళీ బాలకుండు కాలుగాల నివారించి మీఁదై నెగడియుండనీయక దుర్వారబలంబున విదలించిలేచి గృహీత పరిపంథి చరణుండయి విపక్షుని వక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడిచెడక విజృంభించి యంభోరాశి మథనంబునం దిరుగు శైలంబు పోలిక నేల జిఱజిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధి పరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె, న య్యెడ.

భావము:
ఇలా మితిమీరిన శౌర్యంతో సమీపించిన ఆ మల్లుడిని గోపాలప్రియుడు చూసాడు; క్రమంగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడు ఉల్లాసంగా భుజాలు అప్పళించాడు; ఆ శబ్దం భూనభోంతరాళాలు నిండిపోయింది; అతడు చాణూరమల్లుని ఎదుర్కొన్నాడు; వారిద్దరూ మహా పరాక్రమంతో పెద్ద చిన్న మల్లయోధుల పట్లు పట్టారు. ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు; రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒకదాని నొకటి పీడించుకున్నట్లుగా; రెండు మహా మేఘములు పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగా; ప్రళయకాలంలో రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగతరంగాలతో కొట్టుకున్నట్లుగా; వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గ్రుద్దుకున్నారు; తబ్బిబ్బు పడక ఇద్దరూ ఎదురు బెదురుగా చేరి వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు బొబ్బరిస్తూ చాణూర జెట్టిని పట్టిపడలాగాడు; కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం చూసి గోవిందుడు మెచ్చుకున్నాడు; చపలుడైన చాణూరుడు నొప్పెడుతున్నప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని దొర్లిపోయేలా త్రోసాడు; అంతట బలరాముని తమ్ముడైన కృష్ణుడు శరీరము ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వానిని ఒత్తాడు; వేగంగా కరవడ మనే ఒక మల్లబంధం భంగిమలో ఉన్నాడు; అప్పుడు దుర్నీతీపరుడైన మల్లుడు “డింభకా! మేలు మే” లని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుడిని పడద్రోసాడు; అంతట వెన్నుడు చెలరేగి వ్రేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుడి వీపుమీదకి ఎక్కి నిక్కాడు; ఆ కంస భృత్యుడు అయిన చాణూరుడు మదజలధారల చారికలతో నిండుగా ఉన్న మదపుటేనుగులా మాధవుడి పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుగా మల్లరంగం అంతా తిరుగుతూ అటూ ఇటూ కుదిలించి వేసాడు; కమలలోచనుడు దిట్టతనముతో దిటవు కోల్పోకుండా తొలగి, చెలరేగి, జెట్టిని మల్లరంగతలం మీద పడద్రోసి పెద్దదైన వాడి కడుపు మీద మోదాడు; తన కాలితో వాడి కాలిని మెలిపెట్టి డొక్కర మనే మల్లబంధ విశేషాన్ని చూపాడు. మంచి మల్లవిద్యాభ్యాసం పొంది ఉన్న చాణూరుడు సభలోనివారు తన్ను పొగుడుతుండగా కృష్ణుడిని వెనుకకు మరలించి, తటాలున తన కాలితో అడ్డగించి తనను తాను రక్షించుకున్నాడు; రాక్షసవిరోధి యగు కృష్ణుడు వాడి దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెయిడి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు; వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకుని, అడ్డకత్తి చేబూని అదలించాడు; చాణూరుడు చెలరేగి గెంతి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హూంకరించి ముఖాన కాలుపెట్టి మీదుమిగిలాడు; లీలామానుషబాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి, వాడి విజృంభణము అణచి, అడ్డుకొనరాని బలిమితో విదిలించుకుని లేచాడు; శత్రువు పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాడి వక్షంపైన పొడిచాడు; వాడు పోడిమిచెడక చెలరేగాడు; సాగరమథనవేళ సముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ, కృష్ణుణ్ణి తన్నాడు; వెన్నుడు కుప్పించి పైకెగిరి వాడిపైకి దూకాడు; కృష్ణుడి పాదాలు వాడి పాదాల సంధిబంధాలను తాకయి; వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=160&padyam=1348

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :




శ్రీ కృష్ణ విజయము - 78

( చాణూరునితో సంభాషణ )

10.1-1347-సీ.
రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి-
  శిరమున సన్నపు శిఖ వెలుంగ
నాశామదేభేంద్ర హస్తసన్నిభములై-
  బాహుదండంబులు భయదములుగ
లయసమయాంతకోల్లసిత దంష్ట్రల భంగిఁ-
  జాఁగిన కోఱ మీసములు మెఱయ
నల్లని తెగఁగల నడకొండ చాడ్పున-
  నాభీల నీలదేహంబు వెలయఁ
10.1-1347.1-ఆ.
జరణహతుల ధరణి సంచలింపఁగ నభో
మండలంబు నిండ మల్ల చఱచి
శౌరి దెసకు నడచెఁ జాణూర మల్లుండు
పౌరలోకహృదయభల్లుఁ డగుచు.

భావము:
గగనమండలం నిండేలా భుజాలు చరిచిన చాణూర మల్లుడు, కోపమనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగ మాదిరిగా అతని తలపై పిలకజుట్టు ప్రకాశిస్తుండగా; దిగ్గజముల తొండాలకు సమానమైన పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తుండగా; ప్రళయకాలం లోని యమధర్మరాజు పదునైన కోరల వలె పొడవైన కోరమీసాలు మెరుస్తుండగా; నల్లని నిడుపైన నడకొండలాగ భయంకరమైన నల్లని దేహం పెల్లుబుకుతుండగా; అడుగుల తాకిడికి నేల అదురి పోతుండగా; చూస్తున్న పట్టణ ప్రజల హృదయాలకు ఆ దృశ్యం బల్లెంలా తగులుతుండగా చాణూరమల్లుడు కృష్ణుడి వేపు నడిచాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1347

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, November 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 77

( చాణూరునితో సంభాషణ )

10.1-1345-సీ.
మహిమతో నుండగ మథురాపురము గాని-
  పొలుపార వైకుంఠపురము గాదు
గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని-
  సంసార రహితుల సభయుఁ గాదు
ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని-
  నారదు వీణాస్వనంబు గాదు
చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని-
  రమతోడి ప్రణయ విగ్రహము గాదు
10.1-1345.1-తే.
వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు
మొఱఁగిపో ముని మనముల మూల గాదు
సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు
శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."
10.1-1346-వ.
అని పలికి.

భావము:
వైభవోపేతంగా ఉందామనుకుంటున్నావేమో ఇది విలసిల్లే వైకుంఠం కాదు మధురానగరం; దర్పంతో తిరగడానికి ఇది సన్నాసుల సభ కాదు కంసమహారాజు కొలువుకూటమి; చక్కగావిందాం అనుకోకు. ఇది నారదుడి వీణా నాదము కాదు నా భుజాస్ఫాలన శబ్దం; పరిహాసాలు ఆడటానికి ఇది లక్ష్మీదేవి తోటి ప్రణయకలహము కాదు మల్ల యోధులతో రణరంగం; యధేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంతుల వీధి కాదు; దాగి ఉండటానికి ఇది మునుల మనఃకుహరం కాదు; అతిశయించి వెళ్ళడానికి ఇది భక్తులసంగతి కాదు; గుర్తుంచుకో కృష్ణా! నా ముందు నుంచీ ఇక నీవెక్కడకీ వెళ్ళలేవు.” చాణూరుడు ఇలా కృష్ణుడితో పలికి. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1345

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 76

( చాణూరునితో సంభాషణ )

10.1-1343-సీ.
చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు-
  నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు-
  మనుజసింహుఁడ నని మలయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు-
  బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి-
  శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;
10.1-1343.1-ఆ.
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
ధరఁ బ్రబుద్ధుఁడ నని దఱుమరాదు;
కలికితనము చూపి గర్వింపఁగారాదు;
తరముగాదు; కృష్ణ! తలఁగు తలఁగు.
10.1-1344-వ.
అదిగాక నీవు శ్రీహరి నంటేని.

భావము:
ఓ కృష్ణా! పౌరుషానికి పోయి నా దగ్గరకి వచ్చేక ఇక వేషాలేసి నాటకాలాడి తప్పించుకు పోడానికి అవకాశం ఉండదు జాగ్రత్త. తర్వాత (మత్స్యావతారంలో లా చేపలా వేషం కట్టి) సముద్రంలోకి పోడానికీ కుదరదు. (కూర్మావతారంలో మంథర పర్వతానికి కింద నిలబడి ఆధారంగా ఉన్నా నని తాబేలు వేషం కట్టి) కొండల దన్ను తీసుకోడానికీ అవ్వదు. (వరహావతారంలో భూమిని ధరించి దాని కిందున్నా కదా అని పంది వేషం కట్టి) తప్పించుకుపోయి భూమి కిందకి దూరడానికీ వీలవదు. (నరసింహావతారం ఎత్తిన వాడిని కదా అని) సింహంలాంటి మగాణ్ణి అన్ని విఱ్ఱవీగడానికీ కుదరదు. (వామనావతారంలో చెయ్యి చాచడం అలవాటే అనుకోకు) దగ్గరకు వస్తే పడదోసేస్తా. ఇక చెయ్యి చాచడానికి కూడ సందుదొరకదు. (త్రివిక్రమావతారం ఎత్తి పెరిగా కదా అని) నా ఎదురుగా పెచ్చుమీరడమూ అలవికాదు. (పరశురామావాతారంలో రాజులను చంపేసా అనుకోకు) నన్ను దాటి రాజుని హింసించడ మన్నది సాధ్యం కాదు. (రామావతారంలో అడవులకు పోయా కదా అని) అవసరమైతే అరణ్యంల్లో దాక్కుంటా అనుకోకు, గాలించి మరీ పట్టుకుంటా. (బలరామావతారం ఎత్తిన) ప్రబలమైన ఆకారం కలవాడను నేనే అని విఱ్ఱవీగడానికీ వీలుండదు. (బుద్ధావతారం ఎత్తిన వాడిని) పుడమిలో నేనే ప్రబుద్ధుణ్ణి అని బెదిరించి తరిమేద్దాం అనీ (కల్కి అవతారం ఎత్తుతా కదా అని) కపటంతో జయించేస్తా అని గర్వించటమూ వీలుకాదు సుమా. నాతో యుద్ధం చేయడం నీ తరంగాదులే, పో కృష్ణా! పారిపో. అలాకాదని, నీవు ఆదినారాయణుడను అంటావేమో; అలా అయితే విను. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1343

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, November 12, 2020

శ్రీ కృష్ణ విజయము - 75

( చాణూరునితో సంభాషణ )

10.1-1341-శా.
స్థాణున్ మెచ్చఁడు; బ్రహ్మఁ గైకొనఁడు; విష్వక్సేను నవ్వున్; జగ
త్ప్రాణున్ రమ్మనఁ డీడుగాఁ డని; మహా బాహాబలప్రౌఢి న
క్షీణుం; డాజికి నెల్లి నేఁ డనఁడు; వైచిత్రిన్ వినోదించు న
చ్చాణూరుం డొక గోపబాలు పనికిన్ శక్తుండు గాకుండునే?
10.1-1342-క.
ప్రల్లద మేటికి గోపక!
బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా
చల్లడము క్రింద దూఱని
మల్లురు లే రెందు ధరణిమండలమందున్.

భావము:
ఈ చాణూరుడు ఈశ్వరుడినే మెచ్చుకోడు; బ్రహ్మదేవుడిని కూడ లెక్కచేయడు; విష్వక్సేనుడినైనా గేలిచేస్తాడు; తనకు సాటిరాడని వాయుదేవుడిని సైతం రణరంగానికి రమ్మని పిలవడు; అధికతరమైన భుజబలాతిరేకం తరగనివాడు; యుద్ధానికి రేపుమాపు అనని వాడు; చిత్రవిచిత్రంగా అలవోకగా కుస్తీలు పట్టేవాడు; ఇలాంటి జగజెట్టి అయిన చాణూరుడు ఒక గొల్ల కుఱ్ఱాడి పనిపట్టడానికి చాలడా? గోవులను మేపుకునే కుఱ్ఱాడా! ప్రగల్భాలెందుకు? నేను మహా బలవంతుడిని. లోకంలో బాగా ప్రసిద్ధి గాంచిన వాడిని. ఓడిపోయి నా లంగోటా క్రింద దూరని జట్టీలు ఈ భూమండలంలో ఎక్కడా లేరు సుమా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1342

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 74

( చాణూరునితో సంభాషణ )

10.1-1338-క.
నీ తోడుత నేఁ బెనఁగెదఁ
బ్రీతిన్ ముష్టికునితోడఁ బెనగెడి బలుఁ డు
గ్రాతత మల్లాహవమున
భూతలనాథునికి మెచ్చు పుట్టింతు సభన్."
10.1-1339-వ.
అనిన విని రోషించి చాణూరుం డిట్లనియె.
10.1-1340-శా.
"నాతోఁ బోరఁగ నెంతవాఁడ? విసిరో! నాపాటియే నీవు? వి
ఖ్యాతుండం; గులజుండ; సద్గుణుఁడ; సత్కర్మస్వభావుండ; నీ
కేతాదృగ్విభవంబు లెల్లఁ గలవే; యీ వీటఁ బోరాడుటల్
వ్రేతల్ చూడఁగఁ గుప్పిగంతు లిడుటే? వీక్షింపు గోపార్భకా!

భావము:
నీతో నేనూ, ముష్టికుడితో మా అన్న బలరాముడూ ఉత్సాహంగా కుస్తీపడతాము. భయంకర మల్లయుద్ధంతో భూలోకానికి ప్రభువైన కంసుడికి మెప్పు కలిగిస్తాము.” కృష్ణుడి మాటలు వినిన చాణూరుడు ఇలా అన్నాడు. “ఔరా! గొల్లకుఱ్ఱాడా! నాతో కుస్తీకి నీవెంతవాడివి? నీవు నాకు సమానుడవి అవుతావా? నేను ప్రసిద్ధుడిని; సత్కులంలో పుట్టినవాడిని; సత్కర్మలు ఆచరించే స్వభావం కలవాడిని; నీకు ఇలాంటి గొప్పతనముందా? ఈ రాచనగరిలో పోరాడటం అంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయటం కాదు. బాగా ఆలోచించుకో.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1340

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 10, 2020

శ్రీ కృష్ణ విజయము - 73

( చాణూరునితో సంభాషణ )

10.1-1335-క.
జనములు నేర్చిన విద్యలు
జననాథునికొఱకుఁ గాదె? జననాథుఁడు నీ
జనములు మెచ్చఁగ యుద్ధం
బున మనముం గొంత ప్రొద్దు పుత్తమె? కృష్ణా!"
10.1-1336-వ.
అనిన విని హరి యిట్లనియె.
10.1-1337-ఉ.
"సాములు లేవు; పిన్నలము; సత్వము గల్దనరాదు; మల్ల సం
గ్రామ విశారదుల్ గులిశ కర్కశదేహులు మీరు; మీకడన్
నేము చరించు టెట్లు? ధరణీశుని వేడ్కలు చేయువారముం
గాము; వినోదముల్ సలుపఁ గాదనవచ్చునె యొక్కమాటికిన్.

భావము:
ఓయీ కృష్ణా! జనులు విద్యలు నేర్చుకోవడం మహారాజు మెప్పు కోసమే కదా! ప్రభువూ, ఈ ప్రజలూ మెచ్చుకొనేలా మనం మల్లయుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామేం?” వాడు అలా అనగా వినిన కృష్ణుడు ఇలా అన్నాడు. “మాకు సాములు తెలియవు. మేము చిన్నవాళ్ళం. సత్తా ఉందని చెప్పలేము. మీరేమో కుస్తీపట్లలో నిష్ణాతులు. వజ్రాయుధం లాంటి కరుకైన శరీరాలు కలవారు. ఇలాంటి మీతో మేము ఎలా తలపడాలి. మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కాము కానీ, ఆడదామని ఆహ్వానిస్తే ఎప్పుడైనా కాదని అనరాదు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1337

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 72

( చాణూరునితో సంభాషణ )

10.1-1332-వ.
అని పలుకుచు సకలజనులును జూచుచుండ రామకృష్ణులకుఁ జాణూరుండు యిట్లనియె.
10.1-1333-మ.
"వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచుం
బెనఁగన్ మిక్కిలి నేర్చినా రనుచు నీ పృథ్వీజనుల్ చెప్ప మా
మనుజేంద్రుం డిట మిమ్ముఁ జీరఁ బనిచెన్ మల్లాహవక్రీడకుం;
జనదే కొంత పరాక్రమింప మనకున్ సభ్యుల్ విలోకింపఁగన్.
10.1-1334-మ.
జవసత్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ
ప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే?
పవివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో?
నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా!

భావము:
పౌరులు అందరూ రామకృష్ణులను చూస్తూ ఇలా అనుకుంటుండగా, చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు." అడవిదారు లమ్మట గొల్లకుఱ్ఱాళ్ళతో కలసి దూడలు మేపుతూ కుస్తీపోటీలలో చాలా నేర్పుగడించా రని ఈ రాజ్యంలో ప్రజలు చెప్పుకుంటూంటే వినిన మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాడు. ఇప్పుడు మనం మన మన పరాక్రమాలను సభాసదులు చూస్తూండగా కొంచెం ప్రదర్శించడం సముచితం. ఓ గొల్లపిల్లాడా! నీకు జవసత్త్వాలు బాగా ఉన్నయా? బాగా సాము నేర్చావా? శరీరం గట్టిదేరిందేనా? మహారాజు మిమ్మల్ని మెచ్చుకోవాలా? మల్ల గదాదండం అంటే ఇష్టమేనా? నా పిడికిటిపోటంటే ఏమిటో తెలుసా? ఇది పిడుగు లాంటిది లేదా యముని కాలదండం వంటిది లేదా ముక్కంటి కంటిమంట అనుకో నా పిడికిలిగ్రుద్దు వెన్నముద్ద కాదు తినటానికి. అర్ధమయిందా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1334

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, November 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 71

( మల్లావనీ ప్రవేశము )


10.1-1330-క.
వసుదేవు నివాసంబున
వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో
ల్లసనమునఁ బుట్టినారఁట
పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్.
10.1-1331-సీ.
చంపె రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁగూల్చెఁ-
  బడ ద్రొబ్బె మద్దుల; బకునిఁ జీఱె;
నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె-
  గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందుపఱిచెఁ;
గాళియు మర్దించె; గహనానలముఁ ద్రావెఁ-
  గేశి నంతకుపురి క్రేవ కనిచె;
మయుపుత్రుఁ బరిమర్చె; మఱియు దానవ భటు-
  ల హరించి గోపకులంబుఁగాచె;
10.1-1331.1-తే.
గోపకాంతల మనముల కోర్కిదీర్చె;
నీ సరోరుహలోచనుండీ శుభాంగుఁ
డీ మహామహుఁడీ దిగ్గజేంద్ర మడఁచె;
మనుజమాత్రుఁడె తలపోయ మాధవుండు."

భావము:
“వీరు విష్ణుదేవుడి తేజోవిలాసంతో భూలోకాన్ని కాపాడుట కోసం, వసుదేవుడి ఇంట్లో పుట్టారట. పరబ్రహ్మ స్వరూపు లయిన వీరిని పసిపాపలు అనడం తగదు” అనుకున్నారు. నళినముల వంటి నయనములు కల వాడూ, మంగళకర మైన అంగసౌష్టవము కలవాడూ, గొప్ప తేజస్సు కలవాడూ. లక్ష్మిదేవికి పతి అయినవాడూ అయిన ఈ శ్రీకష్ణుడు తరచి చూస్తే సామాన్య మానవుడు కాదు. పూతన రక్కసిని పట్టి చంపాడు; సుడిగాలి రూపుడు తృణావర్తుడిని హతమార్చాడు. మద్ది చెట్లను పడగొట్టాడు; బకాసురుడిని సంహరించాడు; అఘుడనే అసురుణ్ణి అంతం చేసాడు; విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు; గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి గర్వం అణచాడు; నాగరాజు కాళీయుడిని మర్థించాడు; కార్చిచ్చు త్రాగాడు; కేశి అనే దానవుడిని యమపురికి పంపాడు; మయుని కొడుకు వ్యోమాసురుడిని సంహరించాడు; ఇంకా ఎందరో రాక్షస వీరులను నిర్మూలించి, గోపకులను కాపాడాడు; వ్రేతల మనసులలోని కోరికలను తీర్చాడు; దిగ్గజం లాంటి కువలయాపీడ కరీంద్రమును కడతేర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1331

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 70

( మల్లావనీ ప్రవేశము )

10.1-1327-క.
చచ్చిన కుంభీంద్రంబును
వచ్చిన బలమాధవులను వరుసం గని తా
నొచ్చిన చిత్తముతోడుతఁ
జెచ్చెరఁ గడు వెఱచె భోజసింహుం డధిపా.
10.1-1328-ఉ.
ధీరుల వస్త్ర మాల్య మణి దీప్త విభూషణధారులన్ నటా
కారుల సర్వలోక శుభకారుల మానవ మానినీ మనో
హారుల రంగభూతల విహారుల గోపకుమారులన్ మహా
వీరులఁ జూచి చూచి తనివిం దుదిముట్టక లోకు లందఱున్.
10.1-1329-ఉ.
సన్నుత రామకృష్ణముఖ చంద్రమయూఖ సుధారసంబులం
గన్నులఁ ద్రావు చందమునఁ గాంచుచు జిహ్వల నంటి చూచు లీ
ల న్నుతి చేయుచుం గరములం బరిరంభము చేయు భంగి న
త్యున్నతిఁ జూపుచుం దగిలి యొండొరుతోడ రహస్యభాషలన్.


భావము:
ఓ రాజా! చచ్చిన కరి కువలయాపీడమునూ, వచ్చిన రామకృష్ణులనూ చూసిన భోజకులాగ్రజుడైన కంసుడి మనసు బాగా నొచ్చుకుంది. అతను మనసులో ఎంతగానో భయపడ్డాడు. ధీరులూ, వస్త్రములూ పూలదండలూ రత్నాలతో ప్రకాశిస్తున్న నగలు ధరించినవారూ, నాట్యాలు చేసేవారి వలె ఉన్నవారూ, సకల జగాలకు క్షేమం కలిగించే వారూ, మగవారి మనసులు, మగువుల మనసులూ ఆకర్షించేవారూ, మహావీరులూ అయిన ఆ గోపకుమారులు మల్లరంగంలో విహరిస్తుంటే జనాలు అందరూ ఎంత చూసినా తనివితీరక మాటిమాటికీ చూడసాగారు. అందమైన రామకృష్ణుల ముఖచంద్రబింబాల నుండి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగుతున్నారా అన్నట్లు చూస్తూ; నాలుకలతో చప్పరించి చవిచూస్తున్నారా అన్నట్లు స్తుతిస్తూ; చేతులతో కౌగిలించుకుంటున్నారా అన్నట్లు మున్ముందుకు వాలుతూ; అక్కడి ప్రజలు అందరూ ఒకరితో ఒకరు గుసగుసలుగా ఇలా మాట్లాడుకోసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1328

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, November 4, 2020

శ్రీ కృష్ణ విజయము - 69

( మల్లావనీ ప్రవేశము )

10.1-1325-సీ.
మహితరౌద్రంబున మల్లుర కశనియై-
  నరుల కద్భుతముగ నాథుఁ డగుచు
శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై-
  నిజమృత్యువై కంసునికి భయముగ
మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై-
  తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు
ఖలులకు విరసంబుగా దండియై గోప-
  కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు
10.1-1325.1-ఆ.
బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై
శాంత మొనర యోగి జనుల కెల్లఁ
బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో
మాధవుండు రంగమధ్య మందు.
10.1-1326-వ.
అప్పుడు.

భావము:
మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు. అలా బలరామకృష్ణులు ఏనుగు దంతాలతో మల్లరంగం ప్రవేశించిన సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1325

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 68

( మల్లావనీ ప్రవేశము )

10.1-1322-ఉ.
కాలం ద్రొక్కి సలీలుఁడై నగవుతోఁ గంఠీరవేంద్రాకృతిం
గేలన్ భీషణ దంతముల్ పెఱికి సంక్షీణంబుగా మొత్తి గో
పాలగ్రామణి వీరమౌళిమణియై ప్రాణంబులం బాపె నా
శైలేంద్రాభముఁ బ్రాణలోభము నుఁదంచత్సారగంధేభమున్.
10.1-1323-వ.
మఱియు దంతిదంత తాడనంబుల దంతావళపాలకుల హరించి తత్ప్రదేశంబుఁ బాసి.
10.1-1324-మ.
కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్
నెరయన్ గోపకు లంతనంత మెలయన్ నిత్యాహవస్థేము లా
హరిరాముల్ చనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితామర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్.
                                  
భావము:
గోపాలశేఖరుడూ వీరశిరోరత్నమూ అయిన శ్రీకృష్ణుడు ఒక మహా సింహం మాదిరి, మహా పర్వతంతో సమానమైనదీ ప్రాణాలపై భయంకలదీ అయిన ఆ మత్త గజాన్ని, సవిలాసంగా నవ్వుతూ కాలితో త్రొక్కిపెట్టి, చేతితో భయంకరమైన దాని దంతాలు ఊడబెరికి, కృశించి నశించేలా బాది ప్రాణాలు తీసాడు.తరువాత ఆ ఏనుగు దంతాలతోనే దాని మావటిలను మట్టుపెట్టి, ఆ చోటు వదలి కదనరంగంలో మడమ త్రిప్పక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగుదంతాలు తమ భుజాల మీద మెరుస్తుండగా; స్వేదబిందువులు ముఖము నిండా కమ్ముకోగా; గోపాలకులు చుట్టూ చేరి వస్తుండగా; బయలుదేరి వచ్చి మల్లరంగాన్ని చూసారు. అది మహా భయంకర మైన ఆడంబరంతో దేవతల, మానవుల హృదయాలను కలవరపెడుతూ ఉంది.       

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1324

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, November 2, 2020

శ్రీ కృష్ణ విజయము - 67

( కువలయాపీడముతో బోరుట )

10.1-1321-వ.
మఱియు, న య్యనేకపం బనేకపపాలక ప్రేరితంబై, మహావాత సంఘాత సముద్ధూతంబగు విలయకాల కీలికేళిని బిట్టు మిట్టిపడి, మృత్యుదేవత యెత్తునం, గాలు పోలిక, శమను గమనిక నెదిరి మదసలిల పరిమళ లుబ్ధ పరిభ్రమదదభ్ర భ్రమర గాయక ఝంకృతు లహుంకృతి సొంపు సంపాదింపం, గులకుంభినీధర గుహాకుంభ గుంభనంబుగ ఘీంకరించి, రోషభీషణ శేషభోగిభోగ భయంకరంబగు కరంబున శౌరిం జీరి, చీరికిం గొనక, పట్టఁ నందుపట్టి యట్టిట్టు గెంటి, విధుంతుద వదన గహ్వరంబువలన విడివడి యుఱుకు తరణి కరణి దర్పించి, కుప్పించి, పాదమధ్యంబునకు నసాధ్యుండై దూఁటి, దాఁటి మాటుపడినం సింధురంబు గ్రోధబంధురంబై మహార్ణవమధ్య మంథాయమాన మంథరమహీధరంబు కైవడి జిఱజిఱం దిరిగి కానక భయానకంబై కాలి వెరవునం గని, పొంగి, చెంగటం బ్రళయదండిదండ ప్రశస్తంబగు హస్తంబు వంచి వంచించి చుట్టిపట్టి పడవేయం గమకించినం జలింపక తెంపున హరి కరి పిఱింది కుఱికి మహారాహు వాలవల్లి కాకర్షణోదీర్ణుం డగు సుపర్ణు తెఱంగున నెగిరి శుండాలంబు వాలంబు లీలం గేల నొడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసన ప్రమాణ దూరంబున జిఱజిఱం ద్రిప్పి వైవ, న వ్వారణంబు దుర్నివారణంబై రణంబున కోహటింపక సవ్యాపసవ్య పరిభ్రమణంబుల నవక్రంబై కవిసిన నపసవ్యసవ్యక్రమణంబులఁ దప్పించి రొప్పి కుప్పించి యెదుర్కొనినఁ గర్కశుండై మేచకాచలతుంగ శృంగ నిభంబగు కుంభికుంభంబు చక్కటి వ్రక్కలై చెక్కులెగయ దురంత కల్పాంత జీమూత ప్రభూత నిర్ఘాత నిష్ఠురంబగు ముష్టి సారించి యూఁచి పొడిచినం దద్వికీర్ణపూర్ణ రక్తసిక్త మౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగ రక్త తారకాచ్ఛన్నం బగు మిన్ను చెన్నల వరింప నిలువరింపక మ్రొగ్గి మోఁకరిలి మ్రొగ్గక దిగ్గన న గ్గజంబు లేచి చూచి త్రోచి నడచి, సంహారసమయ సముద్ర సంఘాత సంభూత సముత్తుంగ భంగ సంఘటితం బగు కులాచలంబుక్రియఁ గ్రమ్మఱ న మ్మహాభుజుని భుజాదండంబువలన ఘట్టితంబై, కట్టలుక ముట్టి నెట్టి డీకొని ముమ్మరమ్ముగం గొమ్ములం జిమ్మిన న మ్మేటి చేసూటి మెఱసి హస్తాహస్తి సంగరంబునఁ గరంబొప్పి దప్పింబడ నొప్పించిన నకుంఠిత కాలకంఠ కఠోర భల్లభగ్నం బగు పురంబు పగిది జలధిం జటుల ఝంఝానిల వికలంబగు కలంబు కైవడి న మ్మదకలభంబు బలంబు దక్కి చిక్కి స్రుక్కిపడి, లోభికరంబునుంబోలె దానసలిలధారావిరహితంబై, విరహి తలంపునుం బోలె నిరంతర చిత్తజాతజనక నిగ్రహంబై, గ్రహణకాలంబును బోలెఁ బరాధీనఖరకరంబై, ఖరకరోదయంబునుం బోలె భిన్నపుష్కరంబై, పుష్కరవైరి విలసనంబునుం బోలె నభాసిత పద్మకంబై యున్న సమయంబున.

భావము:
అంతే కాకుండా ఇంకా చాలా మంది మావటులు చేరి ఆ ఏనుగు కువలయాపీడమును పురికొల్పారు. ఆ మదగజం త్రుళ్లిపడుతూ, పెనుగాలులకు పైకెగసిన ప్రళయకాలం లోని అగ్నిజ్వాలల వలె, మృత్యుదేవత మాదిరి, కాలపురుషుని కైవడి, యముని తీరున కృష్ణుడిని ఎదుర్కొంది; తన మదజల వాసన మీది ఆశతో చుట్టూ తిరుగుతున్న తుమ్మెదలనే గాయకుల ఝుంకారంతో ఆ గజం హూంకరించింది; అది కులపర్వతాల గుహల వంటి కుంభాలను తన ఘీంకారంతో పూరించింది; ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుని పడగ వలె భయంగొలిపే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అప్పుడు అసాధ్యుడైన హరి అటు ఇటు గింజుకుని రాహువు నోట్లోంచి తప్పించుకుని వెలికురికే భాస్కరుడి వలె; చెంగున ఎగిరి దాని కాళ్ళ నడుమ దూరి దాగుకొన్నాడు. కృష్ణుడు కనిపించక పోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగర మధ్యంలో పరిభ్రమించే మందరగిరి లాగ, అది గిరగిర తిరుగాడింది; వాసన పసికట్టి కృష్ణుడున్న చోటు తెలుసుకుని ఉప్పొంగి పోయింది; ప్రళయకాలంలోని యమదండం లాంటి ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మాక్షుని వంచించి చుట్టిపట్టి పడవేద్దామని ప్రయత్నించింది; మాధవుడు చలింపక తెంపుతో దాని వెనుకవైపునకు ఉరికాడు. రాహువు తోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు తోకను చేతితో ఒడిసిపట్టుకొని, మించిన పరాక్రమంతో వందమూరల దూరానికి దానిని గిరగిర త్రిప్పి విసరికొట్టాడు. ఆ మత్తేభం అడ్డుకోలేని అవక్రపరాక్రమంతో, పోరాడటానికి వెనుదీయక కుడిఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమప్రక్కకు, ఆ ఏనుగు ఎడమ వైపుకు తిరిగినపుడు తాను కుడి వైపుకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు. అతడు కాఠిన్యం వహించి దాని పైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాల నుండి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చిపెట్టి దాని కుంభస్థలాన్ని గ్రుద్దాడు. ఎత్తయిన అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్కచెక్కలై ఎగిరిపడింది. ఆ కుంభస్థలం నుంచి నెత్తుటితో తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజకెంజాయలో ఎఱ్ఱటి నక్షత్రాలతో కప్పబడిన ఆకాశం అందాన్ని ధరణికి సంతరించాయి. ఆ ఏనుగు అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకుని వెంటనే లేచింది. అటు ఇటు చూసి, ముందుకు దూకింది. ప్రళయకాలంలో సముద్రాల సముత్తం తరంగాలచే కొట్టబడిన కులపర్వతం వలె అది మళ్ళీ భుజబలసమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన క్రోధంతో కువలయాపీడం గోవిందుడిని ఒక్కుమ్మడిగా తన కొమ్ములతో చిమ్మింది. నందనందనుడు హస్తలాఘవం చూపి బాహబాహి యుద్ధంలో బాగా విజృంభించి దానిని తల్లడిల్ల చేసాడు. అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెముచే భగ్నమైన పురంలా; సముద్రంలో తీవ్రమైన ఝంఝూమారుతం వల్ల పాడైన ఓడలా శక్తి కోల్పోయింది; బక్కచిక్కి స్రుక్కిపోయింది; ఎన్నడూ దానాలు ధారపోయని పిసినారి చెయ్యి వలె, అది మదజలధారలు లేనిది అయింది; ఎడతెగని మదనుని పోరుగల వియోగి హృదయంలా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయింది; పరాధీనుడైన ప్రభాకరుడు కల గ్రహణవేళ వలె ఎండిన తొండము కలది అయింది; పూచిన తామరలు కల సూర్యోదయం లాగా చీలిన తొండపుకొన గలది అయింది; ప్రకాశింపని పద్మాలు కల చంద్రప్రకాశం వలె వెలవెల పోయింది. ఆ సమయంలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1321

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, November 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 66

( కువలయాపీడముతో బోరుట ) 

10.1-1319-మ.
మించిన కొప్పుఁ జక్కనిడి మేలనఁ బచ్చనిచీర కాసె బం
ధించి లలాటకుంతలతతిన్ మరలించుచు సంగరక్రియా
చుంచుతఁ బేర్చి బాలకుఁడు చూచు జనంబులు దన్ను బాపురే!
యంచు నుతింప డగ్గఱియె హస్తజితాగము గంధనాగమున్.
10.1-1320-క.
అంజక బాలకుఁ డనియునుఁ
గొంజక దయమాలి రాజకుంజర! యంతన్
గుంజరమును డీకొలిపెనుఁ
గుంజరపాలకుఁడు గోపకుంజరుమీఁదన్.

భావము:
కన్నయ్య తన చిక్కటి జుట్టుముడిని గట్టిగా బిగించుకున్నాడు. మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకున్నాడు. నుదుట వ్రేలాడుతున్న ముంగురులను పైకి త్రోసుకుని పోరాటానికి అనువైన సిగచుట్టాడు. చూస్తున్న జనాలు బాలుడైన ఆ శ్రీకృష్ణుడిని “అయ్యబాబోయ్!” అంటూ మెచ్చి పొగడుతుండగా, తొండంతో కొండలను పిండిచేసే ఆ మదగజం దగ్గరకు వెళ్ళాడు. ఓ రాజశేఖరా! కృష్ణుడు హెచ్చరించినా వెఱవక, ఆ మావటివాడు బాలుడని సంకోచ, దయాదాక్షిణ్యాలు లేకుండా, ఏనుగును “డీకొట్ట” మని గోపాలశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి మీదకు పురికొల్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=156&padyam=1320

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 65

( కరిపాలకునితో సంభాషణ )

10.1-1316-వ.
కని తత్కరిపాలకశ్రేష్ఠుండైన యంబష్ఠునికి మేఘనాదగంభీర భాషణంబుల రిపుభీషణుం డగు హరి యిట్లనియె.
10.1-1317-శా.
"ఓరీ! కుంజరపాల! మా దెసకు నీ యుద్యన్మదేభేంద్రముం
బ్రేరేఁపం బనిలేదు; త్రిప్పు మరలం బ్రేరేఁపినన్ నిన్ను గం
భీరోగ్రాశనితుల్య ముష్టిహతులన్ భేదించి నే డంతకుం
జేరంబుత్తు మహత్తరద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్."
10.1-1318-వ.
అని పలికి.

భావము:
అరివీర భయంకరుడైన శ్రీకృష్ణుడు ఆ మదించిన ఏనుగును చూసి, మేఘగర్జన వలె గంభీరమైన కంఠంతో దాని మావటివాళ్ళ నాయకుడితో ఇలా అన్నాడు. “ఓరీ మావటీ! మా వేపుకు ఈ మత్తగజాన్ని ఎందుకు ఉసిగొల్పుతావు. వెనుకకు మరలించు. వినకుండా డీకొట్టమని పోరుకు ఉసికొల్పావంటే, నీ మదపుటేనుగును, నిన్ను కలిపి గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడికిలిపోటులతో పొడిచి పొడిచి యముని పాలికి ఇపుడే పంపడం తథ్యం సుమా.” ఇలా ఆ మావటిని హెచ్చరించి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=155&padyam=1317

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :