Friday, January 31, 2020

దక్ష యాగము - 22


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-85-క.
జనకుం డవమానించుట
యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే
సిన పూజల నందక శో
భన మరసిన మాఱుమాట పలుకక యుండెన్.
4-86-వ.
ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరు నందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపంబైన తిరస్కారంబును, నరుద్ర భాగంబైన య జ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు చేయంబూనిన తెఱంగున నుద్రేకించి 'రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగు దక్షుని వధియింతు' మనుచు లేచిన భూతగణంబుల నివారించి రోషవ్యక్తభాషణంబుల నిట్లనియె; "లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుండైన యీశ్వరునకుఁ బ్రియాప్రియలును నధికులును లేరు; అట్టి సకల కారణుండును నిర్మత్సరుండును నైన రుద్రు నందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలం బాచరించు? నదియునుం గాక మిముబోఁటి వారలు పరులవలని గుణంబు లందు దుర్గుణంబులన యాపాదింతురు; మఱియుం గొందఱు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబుల యందు దోషంబుల నాపాదింపరు; కొందఱు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబుల నైన గుణంబులుగా ననుగ్రహింతురు; మఱియుం గొందఱుత్తమోత్తములు పరుల యందు దోషంబుల నాపాదింపక తుచ్ఛగుణంబులు గలిగినను సద్గుణంబులుగాఁ గైకొందురు; అట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి గల్పించితి” వని; వెండియు నిట్లను “మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్తప్రభావులై జడ స్వభావంబుగల దేహంబునాత్మ యని పల్కు కుజను లగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గాదు: అదియు వారి కనుచితం బగు” నని వెండియు నిట్లనియె.

భావము:
తండ్రి అవమానించడంతో తోబుట్టువులు చేసిన గౌరవాన్ని సతీదేవి అందుకొనక, వారికి బదులు చెప్పలేక పోయింది. ఈ విధంగా సతీదేవి తన తండ్రి ఆదరాన్ని పొందనిదై, తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా తిరస్కరించడాన్ని, శివునికి భాగం కల్పించకుండా జరుపుతున్న యజ్ఞాన్ని చూసి, తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకాన్ని పొంది, శివుని ద్వేషించి క్రతువు చేస్తున్నానని గర్వపడుతున్న దక్షుణ్ణి హతమారుస్తామని లేచిన ప్రమథగణాలను నివారించి, రోషావేశంతో ఇలా అన్నది. “లోకంలోని ప్రాణులందరికీ ఇష్టమైన శివునకు ఇష్టమైనవారు అనీ, ఇష్టం లేనివారు అనీ ఎవరూ లేరు. అతనికంటె అధికులు లేరు. సకల విశ్వానికి కారణమైన ఈశ్వరునకు ఎవరియందూ ద్వేషము లేదు. అలాంటి రుద్రుని నీవు తప్ప లోకంలో ఇంకెవరు ద్వేషిస్తారు? అంతేకాక నీవంటివాళ్ళు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదిస్తారు. కొందరు మధ్యస్థులు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదించరు. కొందరు సత్పురుషులు ఇతరుల దోషాలనైనా గుణాలుగా గ్రహిస్తారు. ఇంకా కొందరు ఉత్తమోత్తములు ఇతరులలో దోషాలను ఆరోపించక వారి నీచగుణాలను సైతం సద్గుణాలుగా స్వీకరిస్తారు. అటువంటి మహాత్ములలో నీవు పాపబుద్ధిని కలిగించావు.” అని చెప్పి ఇంకా ఇలా అన్నది. “మహాత్ముల పాదధూళిముందు వెలవెలబోయిన తేజస్సు కలిగి, జడపదార్థమైన దేహాన్నే ఆత్మ అని వాదించే దుర్జనులు సజ్జనులను నిందించడంలో ఆశ్చర్యం లేదు. అది వారి తగినదే” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=86

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Thursday, January 30, 2020

దక్ష యాగము - 21


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-81-చ.
మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.
4-82-వ.
ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన.
4-83-క.
చనుదెంచిన యమ్మగువను
జననియు సోదరులుఁ దక్క సభఁ గల జను లె
ల్లను దక్షువలని భయమున
ననయము నపు డాదరింపరైరి మహాత్మా!
4-84-క.
నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ
బరిరంభణ మాచరింపఁ బరితోషాశ్రుల్
దొరఁగఁగ డగ్గుత్తికతో
సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్.

భావము:
సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది. ఇదంతా చూస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించగా విదురా! వచ్చిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. సభలో ఉన్న తక్కినవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు. తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గదస్వరంతో కుశలప్రశ్నలు వేయగా, సతీదేవి అప్పుడు...


http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=84

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 20


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-77-సీ.
సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః;
ఖస్వాంత యగుచు నంగములు వడఁక
నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు;
గండభాగంబులఁ గడలుకొనఁగ
నున్నత స్తనమండలోపరిహారముల్;
వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
నతిశోకరో షాకులాత్యంత దోదూయ;
మానమై హృదయంబు మలఁగుచుండ
4-77.1-తే.
మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు
నాత్మదేహంబు సగ మిచ్చి నట్టి భవుని
విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె
జనకుఁ జూచెడు వేడుక సందడింప.
4-78-వ.
ఇట్లతి శీఘ్రగమనంబున.
4-79-సీ.
మానిని చనుచుండ మణిమన్మదాది స;
హస్ర సంఖ్యాత రుద్రానుచరులు
యక్షులు నిర్భయులై వృషభేంద్రుని;
మున్నిడు కొనుచు నమ్ముదిత దాల్చు
కందుకాంబుజ శారికా తాళవృంత ద;
ర్పణ ధవళాతపత్రప్రసూన
మాలికా సౌవర్ణమణివిభూషణ ఘన;
సార కస్తూరికా చందనాది
4-79.1-తే.
వస్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి
శంఖ దుందుభి వేణు నిస్వనము లొప్ప
మానితంబైన వృషభేంద్రయానఁ జేసి
యజ్ఞభూమార్గులై యర్థి నరిగియరిగి.
4-80-వ.
ముందట.


భావము:
తన బంధువులను చూడాలనే కుతూహలం సఫలం కాకపోవడం వల్ల సతీదేవి మనస్సులో దుఃఖం పొంగి పొరలింది. అవయవాలు కంపించాయి. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జాలువారాయి. వక్షస్థలం మీది హారాలు నిట్టూర్పుల వేడికి కందిపోయాయి. శోకంతో కోపాతిరేకంతో సతీదేవి మనస్సు చలించి కలత చెందింది. ఆ కోపంలో ఆమె వివేకం కోల్పోయింది. తనతో సరిసమానుడు లేని స్వామిని, తన శరీరంలో సగమిచ్చిన తన స్వామిని, పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి తండ్రిని చూడాలనే కుతూహలం అతిశయించగా ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది. ఈ విధంగా మిక్కిలి వేగముగా ప్రయాణం చేసి...
సతీదేవి వెళ్తుండగా మణిమంతుడు మొదలైన వేలకొలది ప్రమథులు, యక్షులు నందీశ్వరుని ముందు పెట్టుకొని బయలుదేరారు. ఆమెకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు, నగారాలు, పిల్లనగ్రోవులు మ్రోగిస్తూ యజ్ఞం జరిగే ప్రదేశంవైపు ప్రయాణం చేసి ఎదురుగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=79

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, January 28, 2020

దక్ష యాగము - 19


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-74-వ.
అది యెట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజఁబడయమికి నతనికి నీకు విరోధంబునకు హేతు వెట్టి దని యంటివేని.
4-75-మ.
నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల సత్కీర్తిఁ గొం
దఱు కామించి యశక్తులై మనములన్ దందహ్యమానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముం డీశ్వరుం డైన యా
హరితో బద్ద విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.
4-76-వ.
అదియునుం గాక, నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు; రదియ ప్రాజ్ఞ లయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయుక్తం బని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురు; గాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు; కాన యేనును వాసుదేవ శబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతఃకరణంబు నందు నావరణ విరహింతుడు నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించుచుండుదు; ఇట్ల నపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబు నందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డైన నతఁడును దదనువర్తు లయిన వారలును జూడఁ దగరు; కావున మద్వచనాతిక్రమంబునం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ బడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే;” యని పలికి మఱియు నభవుండు, పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభం బగు ననియు; నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; అంత.


భావము:
అది ఎలా? నీ సంబంధం చేత నాకు గౌరవం లభించక పోవడానికి, నీకూ అతనికి విరోధం కలగడానికి కారణమేమిటి?’ అని నీవు అడిగితే అహంకారం, పాపం లేని సజ్జనులు పొందే కీర్తిని తాముకూడా పొందాలని కోరుకొని కొందరు అసమర్థులై మనసులో కుతకుత ఉడికిపోయి, భగవంతుడైన హరితో వైరం పెంచుకొన్న రాక్షసులవలె ఆ సజ్జనులపై అసూయ పెంచుకుంటారు. అంతే కాక ‘నీవు ఆయనను చూచి లేచి ఎదురు వెళ్ళలేదు. అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు’ అని నీవు అనవచ్చు. లోకంలో సామాన్యజనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ప్రాజ్ఞులైనవారు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని ఆయనను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారం మొదలైనవి చేస్తారు. అంతేకాని, దేహాభిమానం కల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను భగవంతుడు, కేవల సత్త్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తూ ఉంటాను. ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించాడు. అందువల్ల దక్షుడు నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు చూడదగనివారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరిగి తీరుతుంది. లోకంలో బంధువులచేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా!” అని చెప్పి శంకరుడు సతీదేవిని పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డుపడితే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుందని తన మనస్సులో భావించి, ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=76

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Monday, January 27, 2020

దక్ష యాగము - 18


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-71-ఆ.
కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు
నార్యు లేగ, వా రనాదరమున
బొమలు ముడిపడంగ భూరి రోషాక్షులై
చూతు; రదియుఁ గాక సుదతి! వినుము.
4-72-చ.
సమద రిపుప్రయుక్త పటుసాయక జర్జరితాంగుఁ డయ్యు దుః
ఖమును దొఱంగి నిద్రఁగనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో!
యుమ! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాఁటఁ జి
త్తమున నహర్నిశంబుఁ బరితాపము నొంది కృశించు నెప్పుడున్.
4-73-క.
విను లోకోత్కృష్టుఁడు ద
క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుతవై
నను నా సంబంధంబున
జనకునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ!


భావము:
కుటిల స్వభావం కల దుర్జనుల గృహాలకు సుజనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ దుష్టులు కనుబొమలు చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరిమి ఉరిమి చూస్తారు. సతీ! అంతేకాదు, విను. బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాలచేత శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి వ్యక్తి ఎలాగో నిద్రపోతాడు కాని క్రుంగి కృశించిపోడు. సతీ! దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలు గుండెల్లో లోతుగా నాటుకొని మాటిమాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృశింపజేస్తాయి. తరుణీ! విను. లోకాలన్నిటికీ గొప్పవాడైన దక్షునికి తన కుమార్తె లందరిలోనూ నీవు మిక్కిలి ప్రియమైన కూతురువైనా నా సంబంధం వల్ల నీ తండ్రి నిన్ను గౌరవించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=73

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 17


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-69-సీ.
"కల్యాణి నీ మాట గడు నొప్పు; బంధువుల్;
పిలువకుండినను సంప్రీతిఁ జనుదు
రంటి; విదియు లెస్స యైనను దేహాభి;
మాన మదము ననమర్షమునను
గడఁగి యారోపిత ఘన కోపదృష్టులు;
గారేనిఁ బోఁదగుఁ గాని వినుము
వినుత విద్యా తపోవిత్త వయో రూప;
కులములు సుజనులకును గుణంబు;
4-69.1-తే.
లివియ కుజనులయెడ దోషహేతుకంబు
లై వివేకంబు చెఱుచు; మహాత్ములైన
వారి మాహాత్మ్యమాత్మ గర్వమునఁ జేసి
జడులు పొడగానఁ జాలరు జలజనేత్ర!
4-70-క.
విను; మట్టి కుటిలు లగు దు
ర్జనుల గృహంబులకు బంధుసరణిని బోవం
జనదు; వినీతుల కది గడు
ననుచిత మైనట్ల యుండు; నది యెట్లనినన్.


భావము:
“దేవీ! నీ మాటలు ఎంతో యుక్తంగా ఉన్నాయి. బంధువులు పిలువకపోయినా ప్రాజ్ఞులైనవారు ప్రీతితో వెళ్తారని నీవు చెప్పింది కూడా బాగుంది. దేహాభిమానం వల్ల కలిగిన మందం చేతనూ, ఆగ్రహావేశం చేతనూ వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కాని నీ తండ్రి సరసుడు కాడు. విను. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం అనేవి మంచివారికి సుగుణాలే కాని చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోషకారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మాక్షీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరు. సతీ! విను. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని. అది ఎలాగంటే...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=70

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, January 26, 2020

దక్ష యాగము - 16


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-66-క.
అనఘా! విను లోకంబుల
జనకుని గేహమునఁ గలుగు సకల సుఖంబుల్
తనయలు చని సంప్రీతిం
గనుఁగొన కే రీతి నిలుచుఁ గాయము లభవా!
4-67-క.
అనయముఁ బిలువక యుండం
జన ననుచిత మంటివేని జనక గురు సుహృ
జ్జననాయక గేహములకుఁ
జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!"
4-68-వ.
అని మఱియు నిట్లనియె “దేవా! నా యందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబు నందర్ధంబున ధరియింపంబడితి; నట్టి నన్ను ననుగ్రహింపవలయు” నని ప్రార్థించిన మందస్మితవదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబు లైన కుహక వాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె.


భావము:
మహాత్మా! విను. లోకంలో తండ్రి యింట జరిగే శుభకార్యాలను చూడటానికి వెళ్ళకుండా ఏ కుమార్తెల ప్రాణాలు నిలుస్తాయి? అభవా! పిలువకుండా వెళ్ళడం తగదని మీరు అనవచ్చు. తండ్రి, గురువు, మిత్రులు, రాజు మొదలైనవారి యిండ్లకు పిలువకపోయినా సజ్జనులైనవారు వెళ్తారు కదా! అని చెప్పి సతీదేవి మళ్ళీ ఇలా అన్నది “దేవా! నా పట్ల ప్రసన్నబుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నీవు. జ్ఞానవంతుడవైన నీచేత అర్ధశరీరాన్ని పొందినదానను. అటువంటి నన్ను అనుగ్రహించు” అని ప్రార్థించగా శివుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను పలికిన బాణాలవంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సతీదేవితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=67

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

దక్ష యాగము - 15


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-62-క.
జనకుని మఖమున కర్థిం
జని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁ గడుం
దనరిన భూషణములఁ గై
కొన వేడ్క జనించె నీశ! కుజనవినాశా!
4-63-క.
నాతోడను స్నేహము గల
మాతను దత్సోదరీ సమాజము ఋషి సం
ఘాతకృత మఖసమంచిత
కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్.
4-64-వ.
అదియునుం గాక; దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితం బగుటం జేసి నీకు నాశ్చర్యకరంబు గాదు; ఐనను భవదీయ తత్త్వం బెఱుంగఁ జాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁ గనుంగొన నిచ్చగించితి" నని వెండియు నిట్లనియె.


భావము:
శంకరా! దుష్టజన నాశంకరా! నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనబడే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుట్టింది. వ్యోమకేశా! నాపై అనురాగం కల తల్లినీ, అక్కచెల్లెండ్రను, ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞానికి చెందిన ధ్వజాన్ని చూడాలని వేడుక పడుతున్నాను. దేవా! అంతేకాక సత్త్వరజస్తమో గుణాత్మకమై మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచం మీ మాయచేత సృజింపబడింది కనుక మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా మీ తత్త్వాన్ని తెలిసికొనలేక స్త్రీ స్వభావంతో, స్వార్థంతో నా పుట్టిల్లు చూడాలని ఇష్టపడుతున్నాను.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=63

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 24, 2020

దక్ష యాగము - 14


( ఈశ్వర దక్షుల విరోధం )

4-59-క.
సతి దన పతి యగు నా పశు
పతిఁ జూచి సముత్సుకతను భాషించె;"ప్రజా
పతి మీ మామ మఖము సు
వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;
4-60-క.
కావున నయ్యజ్ఞమునకు
నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో!
దేవ! మన మిప్పు డచటికిఁ
బోవలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా!
4-61-క.
ఆ యజ్ఞముఁ గనుగొనఁగా
నా యనుజలు భక్తిఁ బ్రాణనాథుల తోడం
బాయక వత్తురు; మనముం
బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్.


భావము:
అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట! కనుక ఆ యజ్ఞాన్ని చూదాలనే వేడుకతో అదుగో ఆ దెవతలంతా గుంపులుగా వెళ్తున్నారు. స్వామీ! మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనే కోరిక నాకు కలుగుతున్నది. ఆ యజ్ఞాన్ని చూడడానికి నా చెల్లెళ్ళు అందరు, తమ తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనమూ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళనందరినీ చూచే అవకాశం నాకు కలుగుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=61

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 13


( ఈశ్వర దక్షుల విరోధం )

4-56-తే.
దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ
సదనమున నుండి జనకుని సవనమహిమ
గగన చరులు నుతింప నా కలకలంబు
విని కుతూహలిని యయి విన్వీథిఁ జూడ.
4-57-వ.
అయ్యవసరంబునఁ దదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును జనుచుండి; రా సమయంబున.
4-58-సీ.
తనరారు నవరత్న తాటంక రోచులు;
చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ;
మహనీయ తపనీయమయ పదకద్యుతు;
లంసభాగంబుల నావరింప;
నంచిత చీనిచీనాంబర ప్రభలతో;
మేఖలాకాంతులు మేలమాడఁ;
జంచల సారంగ చారు విలోచన;
ప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ;
4-58.1-తే.
మించు వేడుక భర్తృసమేత లగుచు
మానితంబుగ దివ్య విమానయాన
లగుచు నాకాశపథమున నరుగుచున్న
ఖచర గంధర్వ కిన్నరాంగనలఁ జూచి.


భావము:
దక్షుని కూతురైన సతీదేవి తన ఇంటిలో ఉన్నదై తండ్రి చేస్తున్న యజ్ఞవైభవాన్ని దేవతలు పొగడుతుండగా ఆ కలకలాన్ని విని ఆకాశంవైపు చూడగా అప్పుడు ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో అన్నిదిక్కులవారు వెళ్తున్నారు. ఆ సమయంలో నవరత్నాలు తాపిన చెవికమ్మల కాంతులు అద్దాలవంటి చెక్కిళ్ళపై పడుతుండగా, మేలిమి బంగారు పతకాల కాంతులు భుజాలపై వ్యాపించగా, చీని చీనాంబరాల కాంతులు మొలనూళ్ళ కాంతులతో కలిసి మెరుస్తుండగా, లేడికన్నుల వెలుగులు నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగా ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్యవిమానాలను అధిరోహించి దేవతాస్త్రీలు ఆకాశంలో వెళ్తుండగా సతీదేవి చూచి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=58

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, January 23, 2020

దక్ష యాగము - 12


( ఈశ్వర దక్షుల విరోధం )

4-54-వ.
“అంత శ్వశురుండగు దక్షునకు జామాత యైన భర్గునకు నన్యోన్య విరోధంబు పెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగె; నంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వ విరోధంబునను బరమేష్ఠి కృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబు ననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయ సవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకం బైన మఖంబు చేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున.
4-55-చ.
కర మనురక్తి నమ్మఖముఁ గన్గొను వేడుక తొంగలింపఁగాఁ
బరమమునిప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై
పరువడి వచ్చి యందఱు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేఁ
బొరిఁబొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్.


భావము:
అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలాకాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికారగర్వంచేత, పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి, రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేసాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా ఆ యజ్ఞాన్ని చూడాలని వేడుకతో మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు సదస్యులుగా వచ్చి, దక్షుణ్ణి దీవించారు. అతడు చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=55

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 11


( ఈశ్వర దక్షుల విరోధం )

4-52-వ.
ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గల వారలగుటం జేసి నాశంబు నొందరైరి; అట్టి యెడ విమనస్కుం డగుచు ననుచర సమేతుం డై భవుండు చనియె నంత.
4-53-సీ.
అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుఁ;
డగు హరి సంపూజ్యుఁడై వెలుంగు
నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున స;
హస్ర వత్సరములు నజుఁ డొనర్చెఁ
గరమొప్ప నమర గంగాయమునా సంగ;
మావనిఁ గలుగు ప్రయాగ యందు
నవభృథస్నానంబు లతిభక్తిఁ గావించి;
గతకల్మషాత్ములై ఘనత కెక్కి
4-53.1-తే.
తగ నిజాశ్రమభూములఁ దలఁచి వార
లందఱును వేడ్కతోఁ జని రనుచు" విదురు
నకును మైత్రేయుఁ డను మునినాయకుండు
నెఱుఁగ వినిపించి వెండియు నిట్టు లనియె.


భావము:
ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకున్నారు. దైవానుగ్రహంవల్ల వారు నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయుడై శివుడు అనుచరులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. పుణ్యాత్మా! సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు వేయి సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు” అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=53

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, January 22, 2020

దక్ష యాగము - 10


( ఈశ్వర దక్షుల విరోధం )

4-50-తే.
"వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు
వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు
నట్టి సచ్ఛాస్త్ర పరిపంథు లైన వారు
నవనిఁ బాషండు లయ్యెద" రని శపించె.
4-51-సీ.
"సకల వర్ణాశ్రమాచార హేతువు, లోక;
మునకు మంగళమార్గమును, సనాత
నముఁ, బూర్వఋషిసమ్మతము, జనార్దనమూల;
మును, నిత్యమును, శుద్ధమును, శివంబు,
నార్యపథానుగం బగు వేదమును విప్ర;
గణము నిందించిన కారణమున
నే శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుఁ;
డై భూతపతి దైవ మగుచు నుండు
4-51.1-తే.
నందు మీరలు భస్మజటాస్థిధార
ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
లై నశింతురు పాషండు లగుచు" ననుచు
శాప మొనరించె నా ద్విజసత్తముండు.


భావము:
ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో, ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులు అగుదురు గాక! సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువునుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్నీ బ్రాహ్మణులనూ నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మధ్యమ పూజ్యు డగుగాక! శివవ్రతులు భస్మాన్నీ, జడలనూ, ఎముకలనూ ధరిస్తారు గాక! మూర్ఖులై శుచిత్వం లేనివారై పాషండులై నశింతురు గాక!” అని భృగుమహర్షి శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=49

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 9


( ఈశ్వర దక్షుల విరోధం )

4-48-మ.
"అనయంబుం దన మానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబు గాఁ
గని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవాఁరు సంసరణకర్మారంభుఁలై నిచ్చలున్
జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.
4-49-వ.
అదియునుం గాక యీ హరద్వేషులైన ద్విజు లర్థవాద బహుళంబు లైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తు లగుదురు; మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాది పోషణంబుకొఱకు ధరియింపఁ బడిన విద్యా తపోవ్రతంబులు గలవారలై ధన దేహేంద్రియంబుల యందుఁ బ్రీతిం బొంది యాచకులై విహరింతురు;” అని నందికేశ్వరుండు బ్రాహ్మణజనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపి యింపం బూని యిట్లనియె.


భావము:
“ఎల్లప్పుడు అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడ్తూ చస్తూ మళ్ళీ పుడ్తూ ఉందురు గాక! అంతేకాక శివుని ద్వేషించే ఇందలి బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాలవల్ల కల్లుకైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగినవి, తినదగనివి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను పొట్టకోసమే అవలంబిస్తారు. ధనంమీద, దేహంమీద, ఇంద్రియాలమీద ఆదరాభిమానాలు కలవారై యాచకులై సంచరిస్తారు” అని నందికేశ్వరుడు అచ్చటి బ్రాహ్మణులను శపించాడు. నంది శాపవాక్కులు విని భృగుమహర్షి తిరిగి ఇలా శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=49

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, January 21, 2020

దక్ష యాగము - 8


( ఈశ్వర దక్షుల విరోధం )

4-47-వ.
ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు వినిందితంబు లగుం గాని యాథార్థ్యంబున వాస్తవంబు లగుచు భగవంతుండగు రుద్రునందు నిందితంబులు గాక స్తుతి రూపంబున నొప్పెఁ; దదనంతరంబ రుద్రునకు శాపం బిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే 'నకృత్యం' బని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; అంత గిరిశానుచరాగ్రేసరుం డగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిఁ బల్కిన యనర్హ వాక్యంబులును విని కోపారుణితలోచనుండై యిట్లను “నీ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలఁచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై యపరాధంబుఁ గావించె; ఇట్టి మూఢాత్ముండు దత్త్వ విముఖుం డగు; మఱియుం గూటధర్మంబు లయిన నివాసంబుల గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుండై యర్థవాదంబు లైన వేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులు గాఁ దలఁచుచు బుద్దిచేత నాత్మతత్త్వంబు మఱచి వర్తించుచుఁ బశుప్రాయుండై స్త్రీకాముండు నగు; నిదియునుం గాక దక్షుం డచిరకాలంబున మేషముఖుం డగు" నని మఱియు.


భావము:
ఈ విధంగా దక్షుడు పలికిన నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచినా మరొక అర్థంలో వాస్తవాలై, సముచితాలై పూజ్యుడైన శివునికి పొగడ్తలే అయ్యాయి. ఆ తరువాత శివుని శపించిన దక్షుణ్ణి చూచి సభ్యులు “నీవు చేసినది చెడ్డపని” అని అడ్డుకోగా, దక్షుడు ఆగ్రహోదగ్రుడై తన గృహానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివుని సేవకులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుని నిందించడం, శపించడం విని కోపంతో కన్నులెఱ్ఱవారగా ఇలా అన్నాడు “ఈ దక్షుడు తన మర్త్యశరీరం గొప్పది అని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతుడై ఉన్న దేవదేవునికి అపరాధం చేశాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్త్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచసుఖాలపై కోర్కెలు పెంచుకున్నాడు. వేదాలలోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహమునే ఆత్మగా భావిస్తాడు. అందుచేత వీడు సత్యమైన ఆత్మతత్త్వాన్ని విస్మరించి పశువుతో సమానమౌతాడు. వీడు స్త్రీలోలుడై చెడిపోతాడు. అంతేకాదు, ఈ దక్షుడు తొందరలోనే గొర్రెతలవాడు అగుగాక” అని ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=47

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 7


( ఈశ్వర దక్షుల విరోధం )

4-44-వ.
ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి.”
4-45-క.
అని యిట్టులు ప్రతికూల వ
చనములు దక్షుండు పలికి శపియింతును శ
ర్వుని నని జలములు గొని కర
మున నిలిపి యిటులనె రోషమున ననఘాత్మా!
4-46-క.
"ఇతఁ డింద్రోపేంద్ర పరీ
వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే
వతలం గూడఁగ మహిత ని
యతిఁ బొందక యుండుఁగాక యని శపియించెన్."


భావము:
"ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను" అని ఈ విధంగా దక్షుడు నిందించి “శంకరుని శపిస్తాను” అంటూ శాపజలాలను చేతిలో తీసికొని రోషంతో ఇలా అన్నాడు.
“ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=46

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, January 16, 2020

దక్ష యాగము - 6


( ఈశ్వర దక్షుల విరోధం )
*** నిందా స్తుతి ***

4-43-సీ.
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన;
హీనుఁడు మర్యాదలేని వాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం;
బరుఁడు భూతప్రేత పరివృతుండు
దామస ప్రమథ భూతములకు నాథుండు;
భూతిలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట;
హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని
4-43.1-తే.
కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.
భావము:
దక్షుడు శివుని ఇలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు); మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు); నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు); మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు); పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు); నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు); భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి); తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు); ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు); అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు); మదించి తిరుగువారికి, పిచ్చి వారికి నాయకుడు (ఉన్మదులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు;). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు);. ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు); శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు); జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు); శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు); అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం); ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=43

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

దక్ష యాగము - 5

(ఈశ్వర దక్షుల విరోధం)

4-41-తే.
"వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని హు
తాశనాది సురోత్తములార! మోహ
మత్సరోక్తులు గావు నా మాట" లనుచు
వారి కందఱ కా పురవైరిఁ జూపి.
4-42-సీ.
"పరికింప నితఁడు దిక్పాలయశోహాని;
కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి;
తం బయ్యె; నెన్న గతత్రపుండు
మహితసావిత్రీ సమానను సాధ్వి న;
స్మత్తనూజను మృగశాబనేత్ర
సకల భూమీసుర జన సమక్షమున మ;
ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ
4-42.1-తే.
జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ
దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి
నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న
నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.
భావము:
“దేవతలారా! మునులారా! మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు” అని వారందరికీ శివుని చూపించి “ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=42

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, January 12, 2020

దక్ష యాగము - 4


(ఈశ్వర దక్షుల విరోధం)

4-39-క.
చనుదెంచిన యా దక్షుఁడు
వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్
తన కిచ్చిన పూజలు గై
కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్.
4-40-తే.
తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ
నాసనము దిగనట్టి పురారివలను
గన్నుఁ గొనలను విస్ఫులింగములు సెదరఁ
జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ.

భావము:
వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా గద్దె దిగని శివునివైపు తన కంటికొనలనుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో (ఇలా అన్నాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=40


: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, January 11, 2020

దక్ష యాగము - 3


(ఈశ్వర దక్షుల విరోధం)

4-37-క.
అని యడిగిన నవ్విదురునిఁ
గనుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్
"విను మనఘ! తొల్లి బ్రహ్మలు
జన నుతముగఁ జేయునట్టి సత్రముఁ జూడన్.
4-38-చ.
సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు
క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న
త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా
దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.
భావము:
అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి... శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోనివారందరూ లేచి నిలబడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=38

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, January 10, 2020

దక్ష యాగము - 2


(ఈశ్వర దక్షుల విరోధం)

4-36-సీ.
"చతురాత్మ! దుహితృవత్సలుఁడైన దక్షుండు;
దన కూఁతు సతి ననాదరము చేసి
యనయంబు నఖిలచరాచర గురుఁడు ని;
ర్వైరుండు శాంతవిగ్రహుఁడు ఘనుఁడు
జగముల కెల్లను జర్చింప దేవుండు;
నంచితాత్మారాముఁ డలఘుమూర్తి
శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి;
భవునందు విద్వేషపడుట కేమి
4-36.1-తే.
కారణము? సతి దా నేమి కారణమున
విడువరానట్టి ప్రాణముల్ విడిచె? మఱియు
శ్వశుర జామాతృ విద్వేష సరణి నాకుఁ
దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!"

భావము:
“చతురస్వభావం కలవాడా! సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=36

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, January 9, 2020

దక్ష యాగము - 1

(ఈశ్వర దక్షుల విరోధం)

4-35-సీ.
దక్షప్రజాపతి తనయ యా భవుని భా;
ర్యయు ననఁ దగు సతి యను లతాంగి
సతతంబుఁ బతిభక్తి సలుపు చుండియుఁ దనూ;
జాతలాభము నందఁ జాలదయ్యె;
భర్గుని దెసఁ జాలఁ బ్రతికూలుఁ డైనట్టి;
తమ తండ్రిమీఁది రోషమునఁ జేసి
వలనేది తా ముగ్ధవలె నిజయోగ మా;
ర్గంబున నాత్మదేహంబు విడిచె;"
4-35.1-తే.
నని మునీంద్రుఁడు వినిపింప నమ్మహాత్ముఁ
డైన విదురుండు మనమున నద్భుతంబు
గదురఁ దత్కథ విన వేడ్క గడలుకొనఁగ
మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు.

భావము:
దక్షప్రజాపతి కూతురు, పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రిమీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.” అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశ్నించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=35

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :