Thursday, August 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 4

10.1-434-వ.
వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి
10.1-435-చ.
"ఇది యొక మంచిలేగ; వినుఁ డెంతయు నొప్పెడి" నంచు దాని త
త్పదములు తోఁకయున్ బిగియఁబట్టి చెలంగి వెలంగ మ్రానితోఁ
జదియఁగ నొక్క పెట్టుగొని చంపెఁ గుమారుఁడు లేఁగరక్కసుం
గుదులుకొనంగ బాలకులు గోయని యార్వ నఖర్వ లీలతోన్.

భావము:
ఆ వత్సాసురుడి విషయం ఎరిగిన కృష్ణుడు బలరాముడుకి చెప్పి. కృష్ణుడు “ఆహా ఈ దూడ ఎంత మంచిదో చూసారా; ఎంత చక్కగా ఉందో చూడండి” అంటూ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు. గభాలున దాని కాళ్ళు తోక పట్టుకుని పైకెత్తి పెద్దపెట్టున వెలగచెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడి అయిపోయింది. ఈ విధంగా దూడరూపంలో వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు గిలగిల కొట్టుకుని చచ్చి పోయాడు. గోపాలకులు ఆనందంతో ఒక్కపెట్టున పెద్దగా కేకలు వేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=435

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 3

10.1-432-వ.
అంత నొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపం దలంచి.
10.1-433-క.
క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ 
గ్రేపులలో నిదియె మంచి క్రేపనఁగఁ గడుం
జూపట్టి భక్త సంగతిఁ 
గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్.


భావము:
ఒకరోజు బలరామకృష్ణులు యమునానదీతీరాన గోపాలకులతో కలసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు. వాడు దూడలలో దూడ రూపం దాల్చి వాటితో కలసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ; ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అన్నట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలె సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగసాగాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, August 26, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 2

10.1-429-వ.
ఇట్లు బృందావనంబు చెంది, కొంత కాలంబునకు రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడుకొని వేడుక లూదుకొన దూడలఁ గాచుచు.
10.1-430-సీ.
వేణువు లూఁదుచు వివిధ రూపములతో; 
గంతులు వైతురు గౌతుకమున; 
గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని; 
పరవృషభము లని ప్రతిభటింతు; 
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జలు; 
మొఱయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి; 
వేటు లాడుదురు ప్రావీణ్య మొప్ప;
10.1-430.1-తే.
వన్య జంతు చయంబుల వానివాని
పదురు పదురుచు వంచించి పట్టఁబోదు; 
రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు; 
రా కుమారులు బాల్యవిహారు లగుచు.

భావము:
ఇలా బృందావనం చేరిన కొన్నాళ్ళ పిమ్మట, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలసి ఆనందంగా దూడలను కాయసాగారు.
ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గెంతులు వేయసాగారు; పెద్దపెద్ద కంబళ్ళతో వృషభాలరూపాలు తయారుచేసి, వాటిని శత్రు వృషభాలు అని వాటితో యుద్ధం చేయసాగారు; గుడ్డలతో బొమ్మలుచేసి వాటిని గట్టిగా తన్నుతుండేవారు, అలా కాలిగజ్జెలు ఘల్లుఘల్లు మంటూ మ్రోగసాగాయి; పందాలు వేసుకుని మరీ పండ్లగుత్తులను రాళ్ళతో కొడుతూ ఉంటారు; అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువులు దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు. తామరపూల కొలనులలో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇలా ఆ రాకుమారులు గోపబాలకులై బాల్యక్రీడలలో చరించసాగారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=61&padyam=430

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 24, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 1

10.1-427-వ.
అప్పుడు రోహిణీయశోద లేక రథంబునఁ బరిపూర్ణమనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకుఁ బ్రమోదంబు నొందుచుండి; రిట్లు గోపకులు బృందావనంబు జొచ్చి యం దర్ధచంద్రాకారంబుగ శకట సందోహంబు నిలిపి మందలు విడియించి వసియించిరి.
10.1-428-క.
చెందిరి బలమాధవు లభి
నందించుచుఁ బరమ పావనము సంచిత కా
ళిందీ సంజీవనమున్
బృందావనమున్ మునీంద్రబృందావనమున్.


భావము:
రోహిణీ దేవి, యశోదాదేవి ఎంతో సంతృప్తితో ఒకే బండిలో కూర్చున్నారు. బలరామకృష్ణులను ఎదుట కూర్చోపెట్టుకుని, వారి ఆటపాటలతో ఆనందిస్తూ ప్రయాణం సాగించారు. ఈ విధంగా గోకులంలోని ప్రజలు అందరూ బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. అలాగే ఇండ్లను కూడా కట్టుకుని అక్కడ నివసించారు. ఇలా బలరామకృష్ణులు సంతోషంతో పరమ పావనమైన బృందావనంలో ప్రవేశించారు. ఆ బృందావనం కాళింది నదికి ప్రాణాలు పోసినట్లుగా ఉంది. అది మునీంద్రులు అందరినీ రక్షించేది.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Thursday, August 23, 2018

శ్రీకృష్ణ లీలలు - 74

10.1-421-క.
భిక్షులు వచ్చెద రేడ్చిన; 
భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద; రని చెప్పిన
భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా!
10.1-422-వ.
ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ గపటబాలలీలల వినోదింప, బృహద్వనంబున నందాదు లైన గోపవృద్ధులు మహోత్పాతంబు లగుటయు, వానివలన బాలుం డుత్తరించుటయుఁ జూచి యేకాంతంబున నొక్కనాడు విచారింప నుపనందుం డను వృద్ధగోపకుండు తన యెఱుక మెఱసి యిట్లనియె.

భావము:
ఓ మహారాజా! యశోదాదేవి “ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకు వెళ్ళి కొడతారు జాగ్రత్త” అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు. ఇలా చిన్ని కృష్ణుడు కపటబాలలీలలు చూపుతూ క్రీడిస్తూ గోపికలను, గోపాలురను, అందరిని వినోదింపజేస్తున్నాడు. ఒకరోజు నందుడూ, ఇతర గోపాలక పెద్దలూ వ్రేపల్లె దగ్గరి పెద్ద తోటలో సమావేశం అయ్యారు. అప్పటివరకు జరిగిన భయంకరమైన ఉత్పాతాలూ, వాటినుంచి కృష్ణుడు తప్పించుకోటం మున్నగు విషయాలు చర్చించారు. వారిలో ఉపనందుడు అనే వృద్ధగోపాలుడు బుద్ధిలో దైవసంకల్పం వలన ఒక ఆలోచన మెరిసింది, అతడు యాదవులందరం కలిసి బృందావనం వెళదాం అని అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=58&padyam=421

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 73

10.1-419-క.
చుంచొదువుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదువ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
10.1-420-క.
సెలగోల పట్టుకొని జల
కలశములో నీడఁ జూచి కలశయుతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికి జెప్పెన్.


భావము:
ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలు చూపుటందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి. చిన్నికన్నయ్య ఒకరోజు సెలగోల చేతిలో పట్టుకొని, గిన్నెలోని నీళ్ళలోకి చూసాడు. తన ప్రతిబింబం కనబడింది. ఆ గిన్నెపట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా! ఇదిగో చూడు! ఒక పిల్లాడు సెలగోల పట్టుకొని నన్ను కొట్టటానికి వస్తున్నాడు” అన్నాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, August 22, 2018

శ్రీకృష్ణ లీలలు - 72

10.1-418-శా.
పాడున్ మందుని భంగి; గోపవనితల్ పాణిధ్వనుల్ సేయఁగా
నాడున్ జంత్రముకైవడిం; బరవశుండై హస్తముల్ త్రిప్పుచుం; 
జూడన్ నేరని వాని భంగి జనులం జూచున్; నగున్; బాలురం
గూడున్ బెద్దలపంపు చేయఁజను; డాగున్; మట్టిఁ జిట్టాడుచున్.

భావము:
అమాయకపు పిల్లాడిలా పాటలు పాడుతాడు, గోపికాస్త్రీలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే, పరవశుడై కీలుబొమ్మలా చేతులు తిప్పుతూ నాట్యాలు చేస్తాడు. చూడటం తెలియవానిలా జనుల వంక పలకరింపుగా చూస్తాడు. నవ్వుతాడు, తోటి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెప్తే బుద్ధిమంతునిలా చేస్తాడు. తలుపుచాటున దాక్కుంటాడు. మట్టిలో ఆడతాడు.
నందాదుల మనసులు మళ్ళించటానికి ఇలా ప్రవర్తించాడు చిన్నికన్నయ్య.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=57&padyam=418

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 71

10.1-416-క.
"నందుని కొమరుఁడు వినుఁ డీ
సందున మును దూఱి ఱోలు సరి యడ్డముగా
ముందటి కీడ్చిన మద్దులు 
గ్రందుకొనం గూలె; జనులఁ గంటి మిరువురన్."
10.1-417-వ.
అని యిట్లు పలికిన బాలకాలాపంబులు విని మిథ్యారూపంబు లని కొందఱనిరి; కొందఱు నానావిధంబుల సందేహించిరి; అంత నందుండు వికసిత వదనారవిందుం డగుచుఁ బట్టి కట్లు విడిచెను; నట్టి యెడఁ దన తెఱం గెవ్వరు నెఱుంగకుండవలె నని ఠవరకుమారుండు.


భావము:
“నందుని కొడుకు అయినట్టి కృష్ణుడు ఈ చెట్ల సందులలోనుంచి ముందు తాను దూరాడు. వెనుక నున్న ఱోలు ఏమో అడ్డంతిరిగింది. గట్టిగా లాగాడు. అంతే! మద్ది చెట్లు ఫెళఫెళ మంటూ కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు.” ఇట్లా యాదవ బాలురు చెప్పగా, కొందరు అబద్ధాలాడుతున్నారు అన్నారు. మరి కొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కుమారుడు బ్రతికి బయటపడి నందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి కృష్ణునికి కట్టిన త్రాళ్ళు విప్పాడు. ఆ సమయంలో ఈ విషయం నుండి గోపకుల మనస్సులు మళ్ళించటానికి, లీలా వినోది, కపట మానవ బాలకుడు అయిన కృష్ణుడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Friday, August 17, 2018

శ్రీకృష్ణ లీలలు - 70

10.1-414-తే.
పిడుగు పడదు; గాక పెనుగాలి విసరదు; 
ఖండితంబు లగుట గానరాదు; 
బాలుఁ డితఁడు; పట్టి పడఁ ద్రోయఁజాలఁడు; 
తరువు లేల గూలె ధరణిమీఁద
10.1-415-వ.
అని పెక్కండ్రు పెక్కువిధంబుల నుత్పాతంబులు గావలయు నని శంకింప నక్కడ నున్న బాలకు లిట్లనిరి.

భావము:
అసలు ఈ మహా వృక్షాలు ఎలా పడిపోయాయి? పిడుగు పడింది లేదు. పోనీ పెద్దగాలి వీచిందా అంటే అదిలేదు. ఎవరు నరికిన సూచనలు ఏమి లేవు. కూకటి వేళ్ళతో సహా కూలిపోయాయి. ఈ పిల్లాడు ఏమైనా పడగొట్టాడు అనుకుందా మంటే మరీ ఇంత పసిపిల్లాడు అంత పెద్ద చెట్లను పడ తొయ్యటం అసాధ్యం కదా! మరి అయితే ఈ చెట్లు ఎలా కూలిపోయినట్లు?" అలా పదిమందీ పదిరకాలుగా అపశకునమేమో అనుకుంటూ ఉండగా, అక్కడ ఆడుకుంటున్న గోపకుల అబ్బాయిలు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=57&padyam=414

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 69

10.1-412-వ.
అని యీశ్వరుండు మీరు “మీ నెలవులకుం బొం” డని యానతిచ్చిన, మహాప్రసాదం బని వలగొని పెక్కు మ్రొక్కులిడి, నలకూబర మణిగ్రీవు లుత్తర భాగంబున కరిగి రంత; నందాదు లైన గోపాలకులు నిర్మూలంబులై పడిన సాలంబుల చప్పుడు పిడుగు చప్పు డని శంకించి వచ్చి చూచి.
10.1-413-క.
"ఈ పాదపములు గూలఁగ
నీ పాపఁ డులూఖలమున నిటు బద్ధుండై
యే పగిది బ్రతికెఁ? గంటిరె; 
వాపోవఁడు; వెఱవఁ; డెట్టివాఁడో యితఁడున్.


భావము:
ఇలా చెప్పి, “ఇక మీరు మీ లోకాలకు పోవచ్చును” అని కృష్ణుడు అనుజ్ఞ ఇచ్చాడు. యక్షులు “మహాప్రసాదం” అంటూ ప్రదక్షిణలు చేసి, అనేక విధాలుగా మ్రొక్కి, సెలవు తీసుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. ఇంతలో నందుడు మొదలైన గోపకులు చప్పుడు విని, పిడుగు పడిందేమో అని భయపడి వచ్చి కృష్ణబాలునీ, పడిన మద్దిచెట్లనూ చూసారు. “అయ్యో! ఇంత పెద్ద చెట్లు ఇలా కూలిపోతే, ఇలా రోటికి కట్టివేయబడి ఉన్న ఈ చంటిపిల్లాడు ఎలా బ్రతికి ఉన్నాడో? చూశారా! ఏడవనూ లేదు, భయపడనూ లేదు. ఏం పిల్లాడురా బాబూ వీడు?



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, August 15, 2018

శ్రీకృష్ణ లీలలు - 68

10.1-410-క.
తమతమ ధర్మముఁ దప్పక
సములై నను నమ్మి తిరుగు సభ్యులకును బం
ధము ననుఁ జూచిన విరియును
గమలాప్తుఁడు పొడమ విరియు ఘనతమము క్రియన్.
10.1-411-క.
కారుణ్యమానసుం డగు
నారదువచనమునఁ జేసి ననుఁ బొడఁగనుటన్
మీరు ప్రబుద్ధుల రైతిరి
చేరెన్ నామీఁది తలఁపు సిద్ధము మీకున్."

భావము:
“తమతమ ధర్మాలను తప్పకుండా అందరి ఎడల సమత్వంతో ప్రవర్తిస్తూ, నన్ను నమ్మి మెలగుతుండే వారు సజ్జనులు. సూర్యుడు ఉదయించటంతోనే దట్టమైన చీకట్లు తొలగినట్లు; అలాంటివారికి నన్ను చూడగానే బంధాలు విడిపోయి, మోక్షం లభిస్తుంది. నారదమహర్షి దయాస్వభావి. వారు ఇచ్చిన శాపం కారణంగా మీరు నన్ను చూడగలిగారు. మీరు సుజ్ఞానులు అయ్యారు. ఈనాటి నుండీ మీకు నామీద భక్తి చేకూరుతుంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=57&padyam=411

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 67

10.1-408-శా.
నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్నీరేజపత్రేక్షణా!
10.1-409-వ.
అని యిట్లు కీర్తించిన గుహ్యకులం జూచి నగుచు నులూఖల బద్ధుండైన హరి యిట్లనియె.


భావము:
ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన ఱోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకులకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు. ఇలా స్తుతిస్తున్న యక్షులు నలకూబర, మణిగ్రీవులతో రోటికి కట్టబడి ఉన్న కృష్ణమూర్తి చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, August 14, 2018

శ్రీకృష్ణ లీలలు - 66

10.1-406-క.
భువనములు చేయఁ గావఁగ
నవతీర్ణుఁడ వైతి కాదె యఖిలేశ్వర! యో
గివరేణ్య! విశ్వమంగళ! 
కవిసన్నుత! వాసుదేవ! కల్యాణనిధీ!
10.1-407-ఉపేం.
తపస్వివాక్యంబులు దప్ప వయ్యెన్; 
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!


భావము:
ఓ వాసుదేవా! శ్రీకృష్ణా! ఈ లోకాలను అన్నింటినీ సృష్టించడానికీ, రక్షించడానికీ అవతరించావు గదా! నీవు ఈ సమస్తానికి ఈశ్వరుడవు. యోగులు అందరూ నిన్ను దైవంగా వరించారు. నీవు ఈ సృష్టికి శుభాలు చేకూర్చుతావు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుడుతూ ఉన్నాయి. ఓ కృష్ణపరమాత్మా! నారదమునీంద్రుల వారు మహాతపస్వి. వారి మాటలు వట్టిపోకుండా అలాగే జరిగింది. వారి శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్నేళ్ళ నుండీ నిన్ను చూడాలనే తపించాము. ఇప్పటికి ఫలించింది. నీవు భక్తులకు పరమ మిత్రుడవు. మమ్ములను నీ శరణాగత భక్తులుగా మన్నించి అనుగ్రహించు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలలు - 65

10.1-405-సీ.
ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి; 
ప్రాణంబులకు నధిపతివి నీవ; 
ప్రకృతియుఁ బ్రకృతిసంభవమహత్తును నీవ; 
వీని కన్నిటికిని విభుఁడ వీవ; 
ప్రాకృతగుణవికారములఁ బొందక పూర్వ; 
సిద్దుఁడ వగు నిన్నుఁ జింత జేయ
గుణయుతుం డోపునే? గుణహీన! నీ యంద; 
కల గుణంబుల నీవ కప్పఁబడుదు;
10.1-405.1-తే.
మొదల నెవ్వని యవతారములు శరీరు
లందు సరిదొడ్డు లేని వీర్యముల దనువు
లడర జన్మించి వారల యందుఁ జిక్క; 
వట్టి పరమేశ! మ్రొక్కెద మయ్య! నీకు.


భావము:
సకల జీవరాశులకు, పంచభూతములు, చతుర్దశదశ ఇంద్రియములు, అహంకారము, పంచప్రాణములు సమస్తమునకు అధిపతివి; ప్రకృతీ నీవే, దానినుండి పుట్టిన మహత్తూ నీవే; అయినా వీటికి వేటికినీ అందకుండా అన్నిటిపైన ఉండే అధిపతివి నీవే; ప్రకృతి గుణాలు, నీలో ఏమార్పును కలిగించలేవు. నీలోంచే అవి పుట్టుకు వస్తాయి. సృష్టికి పూర్వంనుండి స్వయం ప్రకాశము కలవాడవు. ఇక గుణాలతో ఆవరింపబడినవాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు? నీకు ఏ గుణాలూ లేవు; నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి; వాటిచేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు; శరీరం ధరించిన వీరెవ్వరూ నీ అవతార వైభవాలకి సాటిరారు; నీ రూపాలు వేరు, వీళ్ళరూపాలు వేరు; ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు; కనుక వీళ్ళకి అంతుపట్టవు. అటువంటి పరమపురుష! నీకు నమస్కారం చేస్తున్నాము.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలలు - 64:

10.1-403-వ.
ఇట్లు నిర్మూలంబు లై పడిన సాలంబులలోనుండి కీలికీలలు వెల్వడు పోలిక నెక్కుడు తేజంబున దిక్కులు పిక్కటిల్లం బ్రసిద్ధు లైన సిద్ధు లిద్దఱు వెడలివచ్చి ప్రబుద్ధులై భక్తలోకపాలకుండైన బాలకునకు మ్రొక్కి లేచి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి.
10.1-404-క.
బాలుఁడవె నీవు? పరుఁడ వ
నాలంబుఁడ వధికయోగి వాద్యుడవు తను
స్థూలాకృతి యగు విశ్వము
నీ లీలారూప మండ్రు నిపుణులు కృష్ణా!

భావము:
అలా మొదలంటా కూలిన ఆ జంట మద్ది చెట్లలోనుండి, అగ్నిజ్వాలలు వెలువడినట్లు ఇద్దరు యక్షులు నిద్రమేల్కొన్నట్లు లేచి, దిక్కులు నిండిన తేజస్సులతో ప్రత్యక్ష మయ్యారు. భక్తులందరినీ రక్షించే కృష్ణబాలకునికి వికసించిన జ్ఞానంతో తలవంచి నమస్కారాలు చేసారు. చేతులు జోడించి అతనితో ఇలా అన్నారు. "శ్రీకృష్ణా! నీవు సామాన్య మానవ బాలుడవా? కాదు కాదు. పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కరలేని వాడవు. మహాయోగివి. అన్నిటికీ మొదటివాడవు. అత్యంత సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకూ ఈ విశ్వమంతా నీ రూపమే అని వివేకులు అంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=57&padyam=404

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, August 12, 2018

శ్రీకృష్ణ లీలలు - 63

10.1-401-వ.
చని యా యూర్జిత మహాబలుండు నిజోదరదామ సమాకృష్యమాణ తిర్యగ్భవదులూఖలుండై యా రెండు మ్రాకుల నడుమం జొచ్చి ముందటికి నిగుడుచు.
10.1-402-క.
బాలుఁడు ఱో లడ్డము దివ
మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా
భీలధ్వనిఁ గూలెను శా
పాలస్యవివర్జనములు యమళార్జునముల్

భావము:
దృఢమైన బలము కల ఆ కృష్ణబాలకుడు, తన పొట్టకు కట్టిన త్రాటిని బలంగా ఊపాడు, ఱోలు అడ్డంతిరిగిపోయింది. అతడు చెరచెరా మద్దిచెట్లు రెంటి మధ్యనుండి దూరి ఱోలును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన ఱోలుని లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=56&padyam=402

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 10, 2018

శ్రీకృష్ణ లీలలు - 62

10.1-399-వ.
అని యిట్లు పలికి నారదుండు నారాయణాశ్రమంబునకుం జనియె వారిరువురు సంగడిమద్దు లైరి, పరమభాగవతుండైన నారదు మాటలు వీటింబుచ్చక పాటించి.
10.1-400-క.
ముద్దుల తక్కరిబిడ్డఁడు
మద్దులఁ గూల్పంగ దలఁచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికిఁ 
గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడకం జనియెన్.


భావము:
ఇలా శాపమూ విమోచనమూ చెప్పి, నారదుడు నారయణాశ్రమానికి వెళ్ళిపోయాడు: వాళ్ళిద్దరు జంట మద్ది చెట్లుగా భూలోకంలో పక్కపక్కన పడిఉన్నారు, నారదమహర్షి పరమభాగవతోత్తముడు కనుక శ్రీకృష్ణపరమాత్మ ఆయన మాటలను పాటించదలచాడు. ఆ టక్కులమారి ముద్దుకృష్టుడు ఆ రెండు మద్దిచెట్లను కూల్చాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మద్దిచెట్ల జంట దగ్గరకు అమాతంగా ఱోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :