Monday, May 14, 2018

శ్రీకృష్ణ లీలలు - 9

10.1-302-ఉ.
చప్పుడు చేయకుండు మని జంకె యొనర్చిన నల్గిపోవఁగా
నప్పుడు బార చాఁచి తన యర్మిలి విందులు వచ్చి రంచు న
వ్వొప్పఁగఁ జీరు తల్లి దెస కొత్తిలి కృష్ణుఁడు రంతు జేయుచు
న్నెప్పటియట్ల చన్గుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయఁగన్.
10.1-303-క.
వల్లవగృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి, యెఱుఁగని భంగిం
దల్లిఁ గదిసి చిట్టాడుచు,
నల్లనఁ జను "బువ్వఁ బెట్టు మవ్వా!" యనుచున్.

భావము:
ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. తల్లి యశోద అల్లరి చేయవద్దని బెదిరిస్తే, కొంటె కృష్ణుడు కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. అది చూసి “నా కన్నతండ్రి! రా ప్రియ చెలికాళ్ళు వచ్చారు” అంటు చేతులు చాపి పిలవగానే పరిగెత్తుకుంటు తల్లి దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ పరుగెడుతుంటే, మొలతాడుకు కట్టిన చిరుగంట ఘల్లుఘల్లున మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది. గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. "అమ్మా బువ్వ పెట్టు" అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=40&padyam=303

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: