Wednesday, May 16, 2018

శ్రీకృష్ణ లీలలు - 11

10.1-306-వ.
మఱియు నా కుమారశేఖరుండు కపట శైశవంబున దొంగజాడలం గ్రీడింప గోపిక లోపికలు లేక యశోదకడకు వచ్చి యిట్లనిరి.
10.1-307-క.
“బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

భావము:
ఇంకను ఆ మాయామాణవబాలకుడు శ్రీకృష్ణుడు మాయా శైశవ లీలలలో క్రీడిస్తుంటే, గోకులంలోని గోపికలు ఓపికలు లేక, తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుని అల్లరి చెప్పుకోసాగారు. కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=307

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: