Wednesday, May 2, 2018

శ్రీ కృష్ణ లీలలు - 1

10.1-289-సీ.
జానుభాగముల హస్తములు వీడ్వడఁ జేసి; 
నిగుడు చల్లనఁ బోదు రింత నంత
నవ్వల పయ్యెద లంది జవ్వాడుదు; 
రాల క్రేపుల తోఁక లలమి పట్టి
విడువ నేరక వాని వెనువెంట జరుగుదు; 
రప్పంకముల దుడు కడర జొత్తు
రెత్తి చన్నిచ్చుచో నిరుదెసఁ బాలిండ్లు; 
చేతులఁ బుడుకుచుఁ జేఁపు గలుగ
10.1-289.1-తే.
దూటుదురు గ్రుక్క గ్రుక్కకు దోర మగుచు
నాడుదురు ముద్దుపలుకు లవ్యక్తములుగఁ
గరము లంఘ్రులు నల్లార్చి కదలుపుదురు
రామకృష్ణులు శైశవరతులఁ దగిలి.


భావము:
బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పసితనంలో క్రమంగా బాల్యక్రీడలతో గోకులంలో అందరకు సంతోషం కలిగిస్తున్నారు. మోకాళ్ళపై చేతులు వూని పట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు. తూలుతారు మళ్ళా నిలబడతారు. అటునిటు నడుస్తారు. లేగ ఆవుదూడల తోకలు పట్టుకొంటారు, అవి పరుగెడుతుంటే, ఆ తోకలు వదలిపెట్టలేక వాటి వెనుక జరుగుతు ఉంటారు. తల్లులు పాలు ఇస్తుంటే రెండు చేతులతోను పాలిండ్లు రెండు తడుముతు గుక్కగుక్కకు చేపుకు వచ్చేలా పాలు త్రాగుతుంటారు. వచ్చీరాని ముద్దుమాటలు పలుకుతారు. చేతులు కాళ్ళు కదుపుతు పసిక్రీడలలో నాట్యాలు ఆడేవారు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: