Friday, May 11, 2018

శ్రీ కృష్ణ లీలలు - 6

10.1-296-వ.
మఱియును.
10.1-297-సీ.
తనువున నంటిన ధరణీపరాగంబు; 
పూసిన నెఱిభూతి పూఁత గాఁగ; 
ముందల వెలుగొందు ముక్తాలలామంబు; 
తొగలసంగడికాని తునుక గాఁగ; 
ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు; 
కాముని గెల్చిన కన్ను గాఁగఁ; 
గంఠమాలికలోని ఘననీల రత్నంబు; 
కమనీయ మగు మెడకప్పు గాఁగ;
10.1-297.1-ఆ.
హారవల్లు లురగహారవల్లులు గాఁగ; 
బాలలీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.


భావము:
అంతే కాకుండా... ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరి హరులకు భేదం లేదు ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే. దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాలపేరుతో ఉంగరాలజుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి మూడవకన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీల మణి, ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది, మెళ్ళోవేసిన హారాలు సర్పహారాలుగా కనబడుతున్నాయి. అలా చిన్ని కృష్ణుడు శివునిలా కనబడుతున్నాడు. ఆ కాలపు వీరశైవ వీరవైష్ణవ భేదాలను పరిహరించిన విప్లవ కవి, ప్రజాకవి మన బమ్మెర పోతనామాత్యుల వారు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: