Saturday, May 19, 2018

శ్రీకృష్ణ లీలలు - 13

10.1-310-మత్త.
పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ!
10.1-311-క.
ఆడం జని వీరల పెరు
గోడక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!

భావము:
ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు. లత వలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=311

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: