Friday, May 4, 2018

శ్రీకృష్ణ లీలలు - 3

10.1-291-సీ.
తల లెత్తి మెల్లనఁ దడవి యాడెడు వేళ; 
పన్నగాధీశులపగిదిఁ దాల్తు; 
రంగసమ్మృష్ట పంకాంగరాగంబుల; 
నేనుగుగున్నల నెత్తువత్తు; 
రసమంబులైన జవాతిరేకమ్ముల; 
సింగంపుఁగొదమల సిరి వహింతు; 
రాననంబుల కాంతు లంతకంతకు నెక్కు; 
బాలార్క చంద్రుల పగిదిఁ దోతు;
10.1-291.1-తే.
రెలమిఁ దల్లుల చన్నుఁబా లెల్లఁ ద్రావి
పరమయోగోద్భవామృత పానలీల
సోలి యెఱుగని యోగుల సొంపు గందు
రా కుమారులు జనమనోహారు లగుచు. 
10.1-291/1-వ. 
అందు.


భావము:
అలా బలభద్ర కృష్ణులు బాల్యక్రీడలలో నేలపై ప్రాకుతు మెల్లగా తలలెత్తి ఆడుకుంటు ఉంటే, ఆదిశేషుడు వంటి సర్పరాజులు పడగెత్తి ఆడుతున్నట్లు కనిపిస్తారు. ఆటల్లో ఒంటినిండ మట్టి అంటినప్పుడు ఏనుగు గున్నలలా గోచరిస్తారు. కుప్పిగంతులు వేసేటప్పుడు సాటేలేని జవసత్వాలతో సింహం పిల్లలులా కనిపిస్తారు. రోజు రోజుకి వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతు ఉదయిస్తున్న సూర్య చంద్రులు లాగ కనబడతారు. తల్లుల చనుబాలన్నీ త్రాగి నిద్ర కూరుకు వస్తుంటే, చక్కటి యోగసాధనతో కలిగిన అనుభవం అనే అమృతాన్ని ఆస్వాదిస్తున్న యోగీశ్వరుల వలె గోచరిస్తున్నారు, వారి లీలలు వీక్షిస్తున్న వ్రేపల్లెవాసులకు తన్మయత్వం కలుగుతోంది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=39&padyam=291


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments: