Friday, May 11, 2018

శ్రీకృష్ణ లీలలు - 5

10.1-294-క.
అవ్వల నెఱుఁగక మువ్వురి
కవ్వల వెలుఁగొందు పరముఁ డర్భకుఁడై యా
యవ్వలకు సంతసంబుగ
నవ్వా! యవ్వా! యనంగ నల్లన నేర్చెన్.
10.1-295-క.
అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్నుమిన్ను నలమిన బాలుం
డడుగిడఁ దొడఁగెను శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడు గవనిఁబడన్.

భావము:
బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే శ్రీమన్నారాయణుడు జన్మలు లేని వాడు గనుక తనకు అమ్మ అంటు ఎవరు లేరు. జగత్తు అంతటికి తనే అమ్మ. అంతటి పరమపురుషుడు యశోదమ్మ కొడుకై గోపెమ్మలు అందరికి ఆనందం కలిగేలా అమ్మా అమ్మా అనటం నేర్చాడు. 
సర్వకారణమై నిష్కారణమై వెలుగు పరబ్రహ్మము ఆత్మావైపుత్రానామాసీత్ అని శ్రుతి కనుక జగత్తునకు మాతృస్థానమైన తానే పుత్రరూపమై జన్మించి అమ్మా అమ్మా అనసాగాడు. అవ్వ అవ్వ అని వేసిన పంచకంచే మాతృత్వ విలువ చెప్పబడుతోందా? ఆదిపరాశక్తితో అబేధం చెప్పబడుతోందా?“సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్” అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు. అలా వేయి అడుగులు కలిగిన వాడు. ఇక్కడ వేయి, సహస్రం అంటే అనంతమని గ్రహించదగును. వామనావతారుడై బలిచక్రవర్తి నుండి మూడడుగుల భూమి యాచించి, రెండు అడుగులలో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు. అట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణబాలకుడై తప్పటడుగులు వేయ నారంభించాడు. ఆయన అడుగులు వేయటం చూసి దుష్టులు కాళ్ళు కీళ్ళు జారిపోయి అధమ బుద్దులు, సణుగుళ్ళు వదిలేసి క్రింద నేలపై పడి అణగిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=39&padyam=295

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: