Tuesday, May 15, 2018

శ్రీ కృష్ణ లీలలు - 10

10.1-304-వ.
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.
10.1-305-సీ.
"గోవల్లభుఁడ నేను; గోవులు మీ" రని; 
వడి ఱంకె వైచుచు వంగి యాడు; 
"రాజు నే; భటులు మీరలు రండురం" డని; 
ప్రాభవంబునఁ బెక్కు పనులుపనుచు; 
"నేఁదస్కరుండ; మీరింటివా" రని నిద్ర; 
పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు; 
"నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు"; 
లని చెలంగుచు నాటలాడఁ బెట్టు;
10.1-305.1-తే.
మూల లుఱుకును; డాఁగిలిమూఁత లాడు; 
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు; 
జార చోరుల జాడలఁ జాల నిగుడు; 
శౌరి బాలురతో నాడు సమయమందు. 


భావము:
మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు. “నేను ఆబోతును, మీరందరు ఆవులు” అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజును, “మీరు అందరు నా భటులు” అంటు, అధికారం చూపుతు వాళ్ళతో ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. “నేను దొంగను మీరు గృహస్థులు” అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. “మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వం చేసే సూత్రధారుడను” “నేను తోలుబొమ్మ లాడించే వాడిని, మీరు రకరకాల పాత్రల ధరించే తోలు బొమ్మలు” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. తిరుగుబోతులా, దొంగలా రకరకాల పోకిళ్ళు పోతాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: