10.1-324-క.
తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
గఱపించి నీ కుమారుఁడు
వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!
10.1-325-క.
నా కొడుకును నా కోడలు
నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గోక లెఱుంగక పాఱినఁ
గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!
భావము:
ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి. నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=325
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :