Thursday, August 10, 2017

శ్రీ కృష్ణ జననం - 19

10.1-69-క.
గురుతరముగఁ దన కడుపునఁ
సరసిజగర్భాండభాండ చయములు గల యా
హరి దేవకి కడుపున భూ
భరణార్ధము వృద్ధిఁబొందె బాలార్కు క్రియన్.
10.1-70-వ.
అంత.
10.1-71-సీ.
విమతులమోములు వెలవెలఁ బాఱంగ; 
విమలాస్యమోము వెల్వెలకఁ బాఱె; 
మలయు వైరులకీర్తి మాసి నల్లనగాఁగ; 
నాతిచూచుకములు నల్లనయ్యె; 
దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట; 
లేమ యారున రోమలేఖ మెఱసె; 
నరి మానసముల కాహారవాంఛలు దప్ప; 
వనజాక్షి కాహారవాంఛ దప్పె;
10.1-71.1-తే.
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర
జడత వాటిల్లె శత్రులు జడను పడఁగ; 
మన్ను రుచియయ్యెఁ బగతురు మన్ను చొరఁగ; 
వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁబొంద.

భావము:
ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయసూర్యునిలాగ వృద్దిపొందాడు. అలా భగవదవతారాన్ని దేవకీదేవి గర్భంలో దాచుకున్న ఆ సమయంలో... దేవకీదేవికి గర్భవతులైన స్తీలకు ఉండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖము తెల్లపడుతుండగా, దుర్మార్గుల ముఖాలు వెలవెలపోడం మొదలయింది. ఆమె చనుమొనలు నల్లపడుతుండగా, శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైంది. ఆమె పొత్తికడుపుపై నూగారు మెరుస్తుండగా, దుష్టుల ఇండ్లలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా, శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానివేసింది. ఆమెకు బద్ధకము కలుగుతూంటే, శత్రువులకు తెలియని అలసట మొదలైంది. శత్రువులు మట్టికరసే స్థితి వస్తూ ఉన్నట్లు, ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువ అయింది. ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధిచెందసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=71

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: