Wednesday, August 2, 2017

శ్రీ కృష్ణ జననం - 9

10.1-42-క.
లలనకుఁ బుట్టిన కొమరుని
వలనం దెగె దనుచు గగనవాణి పలికె నం 
చలిగెద వేని మృగాక్షికిఁ
గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్.
10.1-43-వ.
అని యిట్లు పలికిన విని కంసుడు కంపితావతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబుఁ గైకొని కొందలమందు చెలియలి మందలవిడిచి చనియె; వసుదేవుండును బ్రదుకుమందలఁ గంటి ననుచు సుందరియుం దానును మందిరంబునకుం బోయి డెందంబున నానందంబు నొందియుండె; నంతఁ గొంత కాలంబు చనిన సమయంబున.
10.1-44-క.
విడువక కంసుని యెగ్గులఁ
బడి దేవకి నిఖిలదేవభావము దన కే
ర్పడ నేఁట నొకని లెక్కను
గొడుకుల నెనమండ్ర నొక్క కూతుం గనియెన్.

భావము:
“ఈమెకు పుట్టిన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు. దేవకికి పుట్టిన కొడుకులు అందరినీ నీకు తెచ్చి ఇస్తాను. వారిని నువ్వు చంపుదువుగాని.” వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు తలూపుతూ సంతోషించాడు. భయపడుతున్న చెల్లెలి కొప్పును విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ వసుదేవుడు, అతని భార్య దేవకీదేవి తమ మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. కంసుడి చేత ఎడతెగని బాధలుపడుతూ దేవకీదేవి అందరు దేవతల భావము తాను పొంది ఏడాదికి ఒకరు చొప్పున ఎనిమిదిమంది కొడుకులను ఒక కూతురును కన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=44

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: