Sunday, August 6, 2017

శ్రీ కృష్ణ జననం - 13

10.1-52-సీ.
ఒకనాఁడు నారదుం డొయ్యన కంసుని; 
యింటికిఁ జనుదెంచి యేకతమున
"మందలోపలనున్న నందాదులును, వారి; 
భార్యలుఁ బుత్రులు బాంధవులును
దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁ; 
డాదిగాఁగల సర్వ యాదవులును, 
సురలుగాని, నిజంబు నరులు గా రని చెప్పి; 
కంసుండ! నీవు రక్కసుడ వనియు
10.1-52.1-ఆ.
దేవమయుడు చక్రి దేవకీదేవికిఁ
బుత్రుఁడై జనించి భూతలంబు
చెఱుపఁ బుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ
జంపు" ననుచుఁ జెప్పి చనియె దివికి.
10.1-53-క.
నారదు మాటలు విని పె
ల్లారాటముఁ బొంది యదువు లనిమిషు లనియున్
నారాయణకరఖడ్గవి
దారితుఁ డగు కాలనేమి దా ననియు మదిన్.

భావము:
ఒకనాడు నారదమహర్షి కంసుడి ఇంటికి విచ్చేశాడు. కంసుడితో ఏకాంతంగా “రాజాకంస! వ్రేపల్లెలో ఉన్న నందుడూ మొదలగువారూ, వారి భార్యలూ, బంధువులూ, దేవకి మొదలైన స్తీలూ, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవమాత్రులు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడుచేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు.” అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=6&padyam=52

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: