10.1-60-క.
నానావిధ సంపదలకుఁ
దానకమై సర్వకామదాయిని వగు నిన్
మానవులు భక్తిఁ గొలుతురు
కానికలును బలులు నిచ్చి కల్యాణమయీ!
10.1-61-వ.
మఱియు నిన్ను మానవులు దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి యీశాన శారద యంబిక యను పదునాలుగు నామంబులం గొనియాడుదు రయ్యై స్థానంబుల యం”దని యెఱింగించి సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన మహాప్రసాదం బని యయ్యోగనిద్ర యియ్యకొని మ్రొక్కి చయ్యన ని య్యిల కయ్యెడ బాసి వచ్చి.
భావము:
మాయాదేవీ! కల్యాణమయీ! నీవు అన్నిరకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవనీ, మానవులు నిన్ను భక్తితో పూజిస్తుంటారు. నీకు కానుకలు, బలులు ఇస్తారు. దేశంలో వివిధ ప్రాంతలలో ఉన్న మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పద్నాలుగు పేర్లతో సేవిస్తారు. ఇక వెళ్ళిరా” అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగ నిద్రాదేవి “మహప్రసాద” మని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=61
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment