Wednesday, August 9, 2017

శ్రీ కృష్ణ జననం - 18

10.1-66-క.
ఆనకదుందుభి మనమున 
శ్రీనాథుం డంశభాగశిష్టతఁ జొరఁగన్
భానురుచి నతఁడు వెలిఁగెను
గానఁగఁ బట్టయ్యె భూతగణములకు నృపా!
10.1-67-ఉ.
ఆ వసుదేవుఁ డంతఁ దన యం దఖిలాత్మక మాత్మ భూతముం
బావనరేఖయున్ భువనభద్రమునై వెలుఁగొందుచున్న ల
క్ష్మీవిభు తేజ మచ్చుపడఁ జేర్చినఁ దాల్చి నవీనకాంతితో
దేవకి యొప్పెఁ బూర్వయగు దిక్సతి చంద్రునిఁ దాల్చు కైవడిన్.
10.1-68-వ.
అనిన విని తర్వాతి వృత్తాంతం బెట్లయ్యె నని రా జడిగిన శుకుం డిట్లనియె.

భావము:
శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించిడంతో అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు. పంచభూతాలకూ జీవులకూకూడా అది చూసి ఆనందం కలిగింది. అలా తనలో విష్ణుతేజం ప్రవేశించిన వసుదేవుడు, ఆ తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశపెట్టాడు. ఆ విష్ణుతేజస్సు సృష్టి అంతా నిండి ఉండేది. అన్నిటికి ఆత్మ అయినది. లోకాలను పునీతం చేయగలది. లోకాలు అన్నిటికి క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణువు యొక్క తేజస్సు అది. ఆ తేజస్సు చక్కగా తనలో ప్రవేశించడంతో, దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పుదిక్కు అనే స్తీ చంద్రోదయానికి ముందు చంద్రునికాంతితో నిండిపోయినట్లు, దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది.” అలా శుకముని చెప్పగా విన్న పరీక్షుత్తు కుతూహలంతో “ఆ తరువాత ఏమి జరిగింది.” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=8&padyam=67

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: