Monday, August 7, 2017

శ్రీ కృష్ణ జననం - 15

10.1-58-వ.
అయ్యవసరంబున విశ్వరూపుం డగు హరి దన్ను నమ్మిన యదువులకుఁ గంసునివలన భయంబు గలుగు నని యెఱింగి యోగమాయాదేవి కిట్లనియె.
10.1-59-సీ.
గోపికా జనములు గోపాలకులు నున్న; 
పసులమందకుఁ బొమ్ము భద్ర! నీవు
వసుదేవుభార్యలు వరుసఁ గంసుని చేత; 
నాఁకల బడియుండ నందుఁ జొరక
తలఁగి రోహిణి యను తరళాక్షి నంద గో; 
కుల మందు నున్నది గుణగణాఢ్య
దేవకికడుపున దీపించు శేషాఖ్య; 
మైన నా తేజ మీ వమరఁ బుచ్చి
10.1-59.1-ఆ.
నేర్పు మెఱసి రోహిణీదేవి కడుపునఁ
జొనుపు దేవకికిని సుతుఁడ నగుదు
నంశభాగయుతుఁడనై యశోదకు నందు
పొలఁతి కంత మీద బుట్టె దీవు. 
వసుదేవుని భార్యలు 
వసుదేవుని వంశ వృక్షం 

భావము:
ఆసమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు. “భద్రా! మాయాదేవీ! నీవు గోపాలకులు గోపికలు ఉన్న వ్రేపల్లె కువెళ్ళు. వసుదేవుని భార్యలు అందరూ కంసునిచేత బంధీలు అయి జైలులో ఉన్నారు. కానీ, రోహిణి మాత్రం నందుని గోకులంలో తలదాచుకుంది. ఆమె చక్కని గుణగుణాలు కలది. దేవకి కడుపులో ఉన్న శేషుడు అనే తేజస్సును నీవు బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆతరువాత నీవు నందుని ఇంట యశోదాదేవికి బిడ్డగా పుట్టగలవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=59

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: