Wednesday, August 9, 2017

శ్రీ కృష్ణ జననం - 17

10.1-62-తే.
దేవకీదేవికడుపులోఁ దేజరిల్లు
దీప్త గర్భంబు మెల్లనఁ దిగిచి యోగ
నిద్ర రోహిణికడుపున నిలిపి చనియెఁ; 
గడుపు దిగె నంచుఁ బౌరులు గలగఁ బడగ.
10.1-63-వ.
అంత.
10.1-64-ఆ.
బలము మిగులఁ గలుగ "బలభద్రుఁ" డన లోక
రమణుఁ డగుటఁ జేసి "రాముఁ" డనగ
సతికిఁ బుట్టె గర్భసంకర్షణమున "సం
కర్షణుం" డనంగ ఘనుఁడు సుతుఁడు.
10.1-65-వ.
తదనంతరంబ.

భావము:
యోగనిద్రాదేవి, కాంతులు చిమ్ముతున్న దేవకీదేవి కడుపులో ఉన్న గర్భాన్ని నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులు బాధపడ్డారు. కొన్ని నెలలకు... రోహిణిగర్భాన చాలా గొప్పవాడు అయిన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కనుక సంకర్షణుడు అనీ, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అనీ, అందరిని ఆనందింపచేసేవాడు కనుక రాముడు అనీ అతనికి పేర్లు వచ్చాయి. పిమ్మట. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=64

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: