Saturday, August 12, 2017

శ్రీ కృష్ణ జననం - 24

10.1-84-వ.
మఱియు వైరానుబంధంబున నన్యానుసంధానంబు మఱచి యతండు.
10.1-85-క.
తిరుగుచుఁ గుడుచుచుఁ ద్రావుచు
నరుగుచుఁ గూర్చుండి లేచు చనవరతంబున్
హరిఁ దలఁచితలఁచి జగ మా
హరిమయ మని చూచెఁ గంసుఁ డాఱని యలుకన్.
10.1-86-వ.
వెండియు.
10.1-87-సీ.
శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినఁబడు; 
నది హరిరవ మని యాలకించు; 
నక్షిమార్గమున నెయ్యది చూడఁబడు నది; 
హరిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ; 
దిరుగుచో దేహంబు తృణమైన సోఁకిన; 
హరికరాఘాతమో యనుచుఁ నులుకు; 
గంధంబు లేమైన ఘ్రాణంబు సోఁకిన; 
హరిమాలికాగంధ మనుచు నదరుఁ;
10.1-87.1-తే.
బలుకు లెవ్వియైనఁ బలుకుచో హరిపేరు
పలుకఁబడియె ననుచు బ్రమసి పలుకుఁ; 
దలఁపు లెట్టివైనఁ దలఁచి యా తలఁపులు
హరితలంపు లనుచు నలుఁగఁ దలఁచు.

భావము:
విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా, కంసుడు విష్ణువు తప్ప ఇతర విషయాలు సమస్తం మరచిపోయాడు. తిరుగుతున్నా, భోజనంచేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, లేచినా, కూర్చున్నా, ఎప్పుడూ విష్ణువునే స్మరించసాగాడు. క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమయంగానే దర్శించసాగాడు. ఇంకా కంసుడి పరిస్థితి ఎలా ఉంది అంటే.... చెవులకు ఏ శబ్దం వినబడినా అది విష్ణువు మాటేనని వింటూ ఉన్నాడు. కనులకి ఏది కనిపించినా అది విష్ణుదేవుడి రూపమేనని చూస్తున్నాడు. శరీరానికి గడ్డిపరక తగిలినా విష్ణుని చేయి తగిలిందేమోనని ఉలుక్కిపడుతూ ఉన్నాడు. ముక్కుకు సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమోనని అదిరిపడుతున్నాడు. తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమోనని భ్రమపడి విష్ణువు పేరే పలుకుతున్నాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=87

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: