Friday, November 18, 2016

వామన వైభవం - 28:

8-508-శా.
చింతం బాసిరి యక్ష తార్క్ష్య సుమనస్సిద్ధోరగాధీశ్వరుల్
సంతోషించిరి సాధ్య చారణ మునీశబ్రహ్మ విద్యాధరుల్
గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్.
8-509-క.
దిక్కులకావిరి వాసెను
నెక్కువ నిర్మలత నొందె నేఁడు పయోధుల్
నిక్కమెయి నిలిచె ధరణియుఁ
జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై.



టీకా:
చింతన్ = శోకములను; పాసిరి = విడిచితిరి; యక్ష = యక్షులు; తార్క్ష్య = గరుడులు; సుమన = దేవతలు; సిద్ధ = సిద్ధులు; ఉరగ = నాగులు; అధీశ్వరులు = ప్రభువులు; సంతోషించిరి = సంతోషించిరి; సాధ్య = సాధ్యులు; చారణ = చారణులు; మునీశ = మునీశ్వరులు; బ్రహ్మ = ఋత్విజులు; విద్యాధరుల్ = విద్యాధరులు; కాంతిన్ = వికాశమును; చెందిరి = పొందిరి; భాను = సూర్యుడు; చంద్రములు = చంద్రుడు; రంగత్ = ఆనందపు; గీత = గీతములతోను; వాద్యంబులన్ = వాద్యములతోను; గంతుల్ = నాట్యములు; వైచిరి = చేసిరి; మింటన్ = ఆకాశమునందు; కింపురుషులున్ = కింపురుషులు; గంధర్వులున్ = గంధర్వులు; కిన్నరుల్ = కిన్నరలు. దిక్కుల = దిక్కులందలి; కావిరి = నలుపు, మాపు; పాసెను = పోయెను; ఎక్కువ = చాలా; నిర్మలతన్ = నిర్మలముగనుండుటను; ఒందె = పొందినవి; నేడు = ఇప్పుడు; పయోధుల్ = సముద్రములు; నిక్కమెయి = నిచ్చలముగా; నిలిచె = అలరారెను; ధరణియున్ = భూమండలము; చుక్కలత్రోవయును = ఆకాశము {చుక్కలత్రోవ - చుక్కలు (నక్షత్రములు) త్రోవ (తిరుగు స్థలము), ఆకాశము}; విప్ర = బ్రాహ్మణలు; సుర = దేవతలు చేత; సేవ్యములు = కొలువబడినవి; ఐ = అయ్యి.

భావము:
వామనుడు పుట్టటంతో యక్షులూ, గరుడులూ, దేవతలూ, సిద్ధులూ, నాగులూ తమ చింతలు అన్నీ విడిచిపెట్టారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ సంతోషించారు. సూర్య చంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయ్యి కాంతులు విరజిమ్మారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు. సకల దిక్కు లు అందలి కావిరంగు కరగిపోయింది; సప్తసముద్రాలు నిర్మలం అయ్యాయి; భూమి పొంగి పులకరించింది; బ్రాహ్మణులతో దేవతలతో ఆకాశం అలరారింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=509

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: