8-481-క.
కన్నుల సంతోషాశ్రులు
చన్నులపైఁ బఱవఁ బులక జాలము లెసగన్
సన్నతులును సన్నుతులును
నున్నత రుచిఁ జేసి నిటల యుక్తాంజలియై.
8-482-క.
చూపుల శ్రీపతి రూపము
నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై
వాపుచ్చి మంద మధురా
లాపంబులఁ బొగడె నదితి లక్ష్మీనాథున్
టీకా:
కన్నులన్ = కళ్ళనుండి; సంతోష = సంతోషపు; అశ్రులున్ = కన్నీరు; చన్నుల్ = స్తనముల; పైన్ = మీద; పఱవన్ = ప్రవహించగా; పులకజాలములు = పులకరింతలు; ఎసగన్ = అతిశయించగా; సత్ = చక్కటి; నతులును = నమస్కారములు; సన్నుతులును = స్తోత్రములు; ఉన్నత = ఉత్తమమైన; రుచిన్ = ఇచ్ఛతో; చేసి = చేసి; నిటల = నుదుట; ఉక్త = ఉంచబడిన; అంజలి = జోడించినచేతులుగలది; ఐ = అయ్యి.
చూపులన్ = చూపులతో; శ్రీపతి = విష్ణుని; రూపమున్ = స్వరూపమును; ఆపోవకన్ = తృప్తిచెందక; త్రావిత్రావి = మిక్కలిగ ఆస్వాదించి; హర్ష = సంతోషముతో; ఉద్దత = అతిశయించినది; ఐ = అయ్యి; వాపుచ్చి = నోరుతెరచి; మంద = మృదువైన; మధుర = తీయని; ఆలాపంబులన్ = వాక్కులతో; పొగడెన్ = స్తుతించెను; అదితి = అదితి; లక్ష్మీనాథున్ = విష్ణుమూర్తిని.
భావము:
సంతోషం వల్ల అదితి కన్నుల నుండి కురిసిన కన్నీళ్ళు ఆమె వక్షస్థలంపై జాలువారాయి. ఆమె శరీరము అంతా పులకరించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదిటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది. అదితి ఆ దేవదేవుని రూపాన్ని చూపులతో తనివితీరా త్రాగింది. నిండు సంతోషంతో మైమరచి ఆ లక్ష్మీపతిని మృదుమధుర వాక్కులతో ఇలా స్తుతించింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=481
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment