8-504-క.
విచ్చేయు మదితి గర్భము
చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్
విచ్చలవిడి లే కమరులు
ముచ్చటపడి యున్నవారు ముద మందింపన్. "
8-505-వ.
అని యిట్లు కమలసంభవుండు వినుతిచేయు నయ్యవసరంబున.
టీకా:
విచ్చేయుము = రమ్ము; అదితి = అదితి యొక్క; గర్బమున్ = కడుపులో నుండి; చెచ్చెరన్ = శ్రీఘ్రమే; వెలువడి = బయటకొచ్చి; మహాత్మా = గొప్పవాడ; చిరకాలంబున్ = చాలాకాలమునుండి; విచ్చలవిడిన్ = స్వేచ్ఛ; లేక = లేకపోవుట చేత; అమరులు = దేవతలు; ముచ్చటపడి = కోరుతు; ఉన్నవారు = ఉన్నారు; ముదము = సంతోషమును; అందింపన్ = సమకూర్చుటానికై. అని = అని; ఇట్లు = ఈ విధముగ; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - కమలమునందు సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; వినుతి = స్తోత్రములు; చేయన్ = చేయగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:
మహానుభావా! చాలాకాలంగా దేవతలు స్వేచ్ఛకోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అదితి గర్భం నుండి వెలువడి వేంచేయవయ్యా." కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్న ఆ సమయములో. . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=68&Padyam=504
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment