Wednesday, November 2, 2016

వామన వైభవం - 12:

8-479-క.
నారాయణుఁ బరమేశ్వరు
నేరీతిఁ దలంతు? మంత్ర మెయ్యది? విహితా
చారంబు లే ప్రకారము?
లారాధన కాల మెద్ది? యానతి యీవే. "
8-480-వ.
అనినఁ గశ్యప ప్రజాపతి సతికిఁ బయోభక్షణంబను వ్రతంబుపదేశించి తాత్కాలంబునుఁ, దన్మంత్రంబును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెఱింగించెను. అదితియును ఫాల్గుణ మాసంబున శుక్లపక్షంబునఁ బ్రథమదివసంబునన్ దొరకొని పండ్రెండు దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు జేసి వ్రతాంతంబున నియత యై యున్న యెడఁ జతుర్భాహుండునుఁ బీతవాసుండును శంఖ చక్ర గదాధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని.

టీకా:
నారాయణున్ = శ్రీమహావిష్ణువును {నారాయణుడు - అవతారములందు నరసంబంధమయిన శరీరమును పొందువాడు, విష్ణువు}; పరమేశ్వరున్ = శ్రీమహావిష్ణువును {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నతమైన) ఈశ్వరుడు (దేముడు), విష్ణువు}; ఏ = ఏ; రీతిన్ = విధముగ; తలంతున్ = ధ్యానించవలెను; మంత్రమున్ = పఠించవలసిన మంత్రము; ఎయ్యది = ఏది; విహిత = విధింపబడిన; ఆచారములు = నియమములు; ఏ = ఎట్టి; ప్రకారాములు = విధమైనవి; ఆరాధన = కొలచెడి; కాలము = సమయము; ఎద్ది = ఏది; ఆనతి = సెలవు; ఈవే = ఇమ్ము.
                       అనినన్ = అనగా; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = బ్రహ్మ {ప్రజాపతి - ప్రజలను (సంతానమును) సృష్టించుటకు పతి (అధికారము గలవాడు)}; సతి = భార్య; కిన్ = కి; పయోబక్షణము = పయోభక్షణము యనెడి {పయోభక్షణము - పయస్ (నీరుమాత్రమే) భక్షణము (ఆహారముగాతీసుకొనెడి వ్రతము)}; వ్రతంబున్ = వ్రతమును; ఉపదేశించి = తెలియజెప్పి; తత్ = దానియొక్క; కాలంబును = సమయపాలనను; తత్ = దానియొక్క; మంత్రంబునున్ = మంత్రములను; తత్ = దానియొక్క; విధానంబును = పద్ధతులను; తత్ = దానియొక్క; ఉపవాస = చేయవలసిన ఉపాసనలు; దాన = దానములు; భోజన = ఆహరనియమాలు; ప్రకారములు = విధానములు; ఎఱింగించెను = తెలియజేసెను; అదితియును = అదితి; ఫాల్గుణ = ఫాల్గుణ; మాసంబునన్ = నెలలో; శుక్ల = శుక్ల; పక్షంబునన్ = పక్షమునందు; ప్రథమదివసంబునన్ = పాడ్యమినాడు; దొరకొని = ప్రారంభించి; పండ్రెండు = పన్నెండు (12); దినంబులు = రోజులు; హరి = విష్ణుమూర్తికి; సమర్పణంబు = సమర్పించినదిగా; వ్రతంబున్ = వ్రతమును; చేసి = చేసి; వ్రత = వ్రతము; అంతంబునన్ = పూర్తియగునప్పుడు; నియత = నిష్ఠగాయున్నది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; చతుర్బాహుండును = నాలుగుచేతులు గలవాడు; పీతవాసుడును = పట్టుబట్టలు కట్టినవాడు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గదలను; ధరుండును = ధరించినవాడు; ఐ = అయ్యి; నేత్రంబుల = కన్నుల; కున్ = కు; అగోచరుండు = కనబడనివాడు; ఐన = అయినట్టి; నారాయణదేవుండు = విష్ణుమూర్తి; ప్రత్యక్షంబు = సాక్షాత్కారించినవాడు; ఐననన్ = కాగా; కనుంగొని = చూసి.

భావము:
“స్వామీ! పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ఏవిధంగా ధ్యానించాలి. అందుకు తగిన మంత్రమేది. దాని నియమాలు ఏవి. పూజింప వలసిన కాలమేది. అన్నీ నాకు ఉపదేశించు.”
                       ఇలా భగవంతుని పూజించే విధానం చెప్పమని అడిగిన భార్య అదితికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి తగిన కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని; వ్రతకాలంలో పాటించవలసిన ఉపాస, దాన, భోజనాది విధివిధానలనూ బోధించాడు. అదితి ఫాల్గుణ మాస శుక్ల పక్ష మొదటి దినము అయిన పాడ్యమి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించింది. పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుడు విష్ణుమూర్తికి సమర్పిస్తూ వ్రతం పూజించింది. వ్రతం ముగించి నియమవంతురాలు అయి ఉన్న ఆమెకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చతుర్భాహుడు. శంఖాన్ని చక్రాన్ని ధరించి, పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు అలా ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=479

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: