Tuesday, November 8, 2016

వామన వైభవం - 18:

8-489-క.
ఏలింతు దివము సురలనుఁ
బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం
దూలింతు దానవుల నిర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్. "
8-490-వ.
అని యిట్లు భక్తజనపరతంత్రుండగు పురాణపురుషుం డానతిచ్చి తిరోహితుడయ్యె; అ య్యదితియుఁ గృతకృత్య యై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి సేవించుచుండె; అంత నొక్క దివసంబున.

టీకా:
ఏలింతున్ = పరిపాలింపజేసెదను; దివమున్ = స్వర్గమును; సురలనున్ = దేవతలను; పాలింతున్ = కాపాడెదను; మహేంద్ర = ఇంద్రుని {మహేంద్రుడు - మహా (గొప్ప) ఇంద్రుడు, దేవేంద్రుడు}; యువతిన్ = భార్యయొక్క; భాగ్య = సౌభాగ్యము; శ్రీలన్ = సంపదలను; తూలింతున్ = చలింపజేసెదను; దానవులన్ = రాక్షసులను; నిర్మూలింతున్ = నాశము చేసెదను; రిపు = శత్రువుల; ప్రియ = భార్యల; అంగముల = దేహమునందలి; భూషణముల్ = అలంకారములు.
                            అని = అని; ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తులైన; జన = వారికి; పరతంత్రుడు = లొంగిపోవువాడు; అగు = అయినట్టి; పురాణపురుషుండు = హరి; ఆనతిచ్చి = చెప్పి; తిరోహితుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అదితియున్ = అదితి; కృతకృత్య = కృతార్థురాలు; ఐ = అయ్యి; సంతోషంబునన్ = సంతోషముతో; తన = తన యొక్క; మనోవల్లభుండు = భర్త; అగు = అయిన; కశ్యపున్ = కశ్యపుని; ఆశ్రయించి = చేరి; సేవించుచుండెన్ = కొలుచుచుండెను; అంతన్ = అంతట; ఒక్క = ఒక; దివసంబున = దినము.

భావము:
దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడతాను. రాక్షసులను అధికారం నుంచి తొలగించి, వారి ఇల్లాళ్ళ అలంకరాలను పోగొడతాను.”ఆ విధంగా భక్తజన విధేయుడైన విష్ణుమూర్తి సెలవిచ్చి మాయమయ్యాడు. కృతార్ధురాలైన అదితి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యపప్రజాపతిని చేరి సేవించసాగింది. అటు పిమ్మట ఒకనాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=489

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


No comments: