Saturday, November 5, 2016

వామన వైభవం - 15:

8-484-ఆ.
అసురవరులు సురల నదలించి బెదరించి
నాక మేలుచున్న నాఁట నుండి
కన్న కడుపుఁ గాన కంటఁ గూరుకు రాదు
కడుపుఁబొక్కు మాన్పి కావవయ్య.
8-485-వ.
అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె.

టీకా:
అసుర = రాక్షస; వరులు = ఉత్తములు; సురలన్ = దేవతలను; అదలించి = హడలగొట్టి; బెదరించి = భయపెట్టి; నాకమున్ = స్వర్గమును; ఏలుచున్న = పరిపాలించుచున్న; నాటి = దినము; నుండి = నుండి; కన్న = జన్మనిచ్చిన; కడుపు = తల్లి; కాన = కావున; కంటన = కంటికి; కూరుకు = నిద్ర; రాదు = రావటములేదు; కడుపుబొక్కు = గర్భశోకము; మాన్పి = పోగొట్టి; కావవు = కావుము; అయ్య = తండ్రి.
              అనినన్ = అనగా; విని = విని; దరహసిత = చిరునవ్వుగల; వదనుండు = ముఖము కలవాడు; అయి = ఐ; ఆశ్రిత = ఆశ్రయించినవారికి; కామధేనువు = కోరినవి యిచ్చువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
తండ్రీ! బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదలించి బెదరించి స్వర్గ లోకాన్ని పాలిస్తున్నారు. కన్నకడుపు కదా. ఆ బెంగతో దేవతల కన్నతల్లిని అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువైంది. ఈ నా గర్భశోకాన్ని పోగొట్టి కాపాడు.'' అని పలికిన అదితి మాటలు విని శ్రీ మహా విష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేనువు అయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=484

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: