8-483-సీ.
యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం;
గళనామధేయ! లోకస్వరూప!
యాపన్న భక్త జనార్తి విఖండన! ;
దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత! ;
సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు ననుపమ లక్ష్మియు;
వసుధయు దివముఁ ద్రివర్గములును
8-483.1-తే.
వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము
నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార!
ప్రణత వత్సల! పద్మాక్ష! పరమపురుష!
టీకా:
యజ్ఞేశ = హరి {యజ్ఞేశుడు - యజ్ఞములపై ఈశ (దేవుడు), విష్ణువు}; విశ్వంభర = హరి {విశ్వంభరుడు - విశ్వన్ (జగత్తును) భరుడు (భరించెడివాడు), విష్ణువు}; అచ్యుత = హరి {అచ్యుతుడు - చ్యుతము (నాశము) లేనివాడు, విష్ణువు}; శ్రవణమంగళనామధేయ = హరి {శ్రవణమంగళనామధేయుడు - శ్రవణ (వినినంతనే) మంగళ (శుభములను కలిగించెడి) నామధేయుడు (పేరుగలవాడు), విష్ణువు}; లోకస్వరూప = హరి {లోకస్వరూపుడు - లోక (జగత్తే) స్వరూపుడు (తన రూపమైనవాడు), విష్ణువు}; ఆపన్నభక్తజనార్తి విఖండన = హరి {ఆపన్నభక్తజనార్తివిఖండనుడు - ఆపన్న (శరణువేడిన) భక్త (భక్తులైన) జన (వారి) ఆర్తిన్ (దుఃఖములను) విఖండనుడు (పూర్తిగా తొలగించెడివాడు), విష్ణువు}; దీనలోకాధార = హరి {దీనలోకాధారుడు - దీనులైనవారికి ఆధారుడు (ఆధారముగానుండువాడు), విష్ణువు}; తీర్థపాద = హరి {తీర్థపాదుడు - తీర్థ (పవిత్ర స్థానములైన) పాదుడు (పాదములు కలవాడు), విష్ణువు}; విశ్వోద్భవస్థితివిలయకారణభూత = హరి {విశ్వోద్భవస్థితివిలయకారణభూతుడు - విశ్వ (జగత్తునకు) ఉద్భవ (సృష్టికి) స్థితికి విలయ (నాశమునకు) కారణభూతుడైనవాడు, విష్ణువు}; సంతతానంద = హరి {సంతతానందుడు - సంతత (ఎడతెగని) ఆనందుడు (ఆనందముగలవాడు), విష్ణువు}; శశ్వద్విలాస = హరి {శశ్వద్విలాసుడు - శశ్వత్ (శాశ్వతముగా) విలాసుడు (విరాజిల్లువాడు), విష్ణువు}; ఆయువు = ఆయుష్షు; దేహంబున్ = జన్మము; అనుపమ = సాటిలెని; లక్ష్మియున్ = సంపదలు; వసుధయు = రాజ్యము; దివము = స్వర్గలోకప్రాప్తి.
వైదిక = వేదసంబంధమైన; జ్ఞాన = విజ్ఞానమునందు; యుక్తియున్ = ప్రావీణ్యత; వైరి = శత్రువులపై; జయమున్ = విజయము; నిన్నున్ = నిన్ను; కొలువని = సేవించని; నరుల్ = మానవుల; కున్ = కు; నెఱయన్ = నిండుగా; కలదె = దొరకునా; వినుతమందార = హరి {వినుతమందారుడు - వినుత (స్తుతించువారికి) మందారుడు (కోరికలువర్షించువాడు), విష్ణువు}; గుణహార = హరి {గుణహారుడు - గుణ (సుగుణములు) హారుడు (అలంకారముగా కలవాడు), విష్ణువు}; వేదసార = హరి {వేదసారుడు - వేదముల యొక్క సారమైనవాడు, విష్ణువు}; ప్రణతవత్సల = హరి {ప్రణతవత్సలుడు - ప్రణత (కొలిచెడివారికి) వత్సలుడు (వాత్సల్యము చూపువాడు), విష్ణువు}; పద్మాక్ష = హరి {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పరమపురుష = హరి {పరమపురుష - సర్వాతీతమైన పురుషయత్నము కలవాడు, విష్ణువు}.
భావము:
“యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్చ్యతా! నీ పేరు తలచిన చాలు సర్వమంగళాలూ ఒనగూడుతాయి; లోకమే రూపమైనవాడవు; పూజించేవారిని ఆపదలనుండి ఆర్తినుండి బ్రోచేవాడవు; దీనులందరికి దిక్కైనవాడవు; పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు; లోకాలు పుట్టి పెరిగి గిట్టుటకు కారణమైనవాడవు; ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు; శాశ్వత మైన లీలావిలాసాలు కలవాడవు; అంతటా నిండిన వాడవు; నీవు భక్తులపాలిటి కల్పవృక్షానివి; సుగుణనిధివి; పరమాత్ముడవు; వేదాలకు ఆధారమైనవాడవు; సేవించేవారి యందు వాచ్సల్యము కలవాడవు; కమలాల వంటి కన్నులు కలవాడవు; పరమపురుషుడవు; ఈలోకంలో మంచి మనుగడ, కలిమి, ఇహము, పరమూ, ధర్మార్ధ కామాలూ, వేదవిజ్ఞానమూ, శత్రు జయమూ నిన్ను పూజించని వారికి లభించవు కదా!
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=483
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment