Thursday, November 10, 2016

వామన వైభవం - 20:

8-493-క.
చలచలనై పిదపిదనై
గలలంబై కరుడు గట్టి గళనాళముతోఁ
దల యేర్పడి గర్భంబై
నెలమసలం జీరచిక్కె నెలఁతకు నధిపా!
8-494-క.
నెలతకుఁ జూలై నెల రె
న్నెలలై మఱి మూఁడు నాల్గు నెలలై వరుసన్
నెల లంతకంత కెక్కఁగ
నెలలును డగ్గఱియె నసుర నిర్మూలతకున్.

టీకా:
చలచలను = కదిలెడిద్రవమువలె; ఐ = అయ్యి; పిదపిదన్ = మెత్తమెత్తగా; ఐ = అయ్యి; కలలంబు = గర్భపిండము; ఐ = అయ్యి; కరడుగట్టి = గట్టిబడి; గళనాళము = గొంతు; తోన్ = తోబాటు; తల = శిరస్సు; ఏర్పడి = ఏర్పడి; గర్భంబు = పిండముగా; ఐ = అయ్యి; నెలమసలన్ = నెలతప్పగా; చీరజిక్కె = కడుపు వచ్చినది {చీరజిక్కు - చీర చాలలేదు, కడుపు వచ్చెను}; నెలత = యువతి; కున్ = కు; అధిపా = రాజా.
                             నెలత = సతి; కున్ = కి; చూలు = కడుపు; ఐ = వచ్చి; నెల = ఒకటవనెల (1); రెన్నెలలు = రెండునెలలు (2); ఐ = అయ్యి; మఱి = ఇంకా; మూడు = మూడు (3); నాల్గు = నాలుగు (4); నెలలు = నెలలు; ఐ = నిండి; వరుసన్ = క్రమముగా; నెలలు = నెలలు; అంతకంతకున్ = అంతకంతకు; ఎక్కగా = నిండుతుండగా; నెలలు = సమయము; డగ్గఱియెన్ = దగ్గరపడినది; అసుర = రాక్షస; నిర్మూలత = సంహారమున; కున్ = కు.

భావము:
ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపమూ మెత్తని రూపమూ గడ్డకట్టి పిండరూపము ఏర్పడింది. నెల తప్పింది గొంతుతోపాటు తల ఏర్పడి గర్భం నిలిచింది.
                        అదితి చూలాలైన తరువాత వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగినాయి. దానితోపాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=493

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: