Monday, November 18, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 116



abhraMlihaadabhra

4-107-సీ.
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్ర భ్రమ; కృన్నీల దీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్త జ్వాలికా జాల; జాజ్వల్యమాన కేములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ; సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణ త్రయ లోక వీక్షణ ద్యుతి లోక;వీక్షణ తతి దుర్నిరీక్ష్యముగను
తే. గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపా లాస్థి వనమాలిలును దనర
నఖిల లోక భయంకరుఁ గుచు "వీర
భద్రుఁ" డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
                దక్షయజ్ఞంలో ఉమాదేవి యోగాగ్ని యందు దగ్ధమయింది. పరమశివుడు మహాకోపంతో తన జటాజూటం నుంచి ఒక జట పెరికి భూమి మీద విసిరి కొట్టాడు. ఆ మహారుద్రుని జట నుంచి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసార్థమై ఉదయించాడు. ఈ సందర్భంలో పదౌచిత్యం వృత్తౌచిత్యం భావౌచిత్యం శబ్దాడంబరం అర్థగాంభీర్యాలతో అలవోకగా అలరించే మన సహజకవి పోతనామాత్యలు వీరభద్రుని దీర్ఘదేహాన్ని సూచిస్తున్నట్లున్న మణిరత్మం ఈ సీసపద్యం. సకల లోకాలకూ భయం కలిగించే రెండవ రుద్రుని వలె వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సుదీర్ఘమైన నల్లని శరీరం ఆకాశాన్ని అంటుతు కాలమేఘ మేమో అనే భ్రాంతి కలిగిస్తున్నది. తల వెంట్రుకలు భగభగమండే మంటల ప్రజ్వలనంలా ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వంటి వెయ్యి బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయన మూడు కన్నులు చండప్రచండ మార్తాండుల వంటి ప్రకాశంతో కళ్ళెత్తి తేరి చూడరాకుండా ఉన్నాడు. మెడనిండా కపాలమాలలు వ్రేల్లాడుతుండగా. వంకర్లు తిరిగి రంపాల్లా కరకు దేలిన కోరలుతో మిక్కలి భయంకరంగా ఉన్నాడు.


4-107-see.
abhraMlihaadabhra vibhra maabhra bhrama; kRnneela deergha Sareera mamara@M
brajvalajjvalana deepta jvaalikaa jaala; jaajvalyamaana kaeSamulu me~raya@M
jaMDa digvaedaMDa SuMDaabha dOrdaMDa; saahasra dhRta haetisaMgha moppa
veekshaNa traya lOka veekshaNa dyuti lOka; veekshaNa tati durnireekshyamuganu
tae. grakacha kaThina karaaLa daMshTralu veluMga
ghana kapaa laasthi vanamaalikalunu danara
nakhila lOka bhayaMkaru@M Daguchu "veera
bhadru@M" DudayiMche maa~raTa rudru@M Daguchu.
అభ్రంలిహ = ఆకాశమును నాకుచున్న; అదభ్ర = మహావిస్తార మై; విభ్రమ = పరిభ్రమిస్తున్న; అభ్ర = మేఘముల వంటి; భ్రమకృత్ = సుడులు తిరుగుచున్న; నీల = నల్లని; దీర్ఘ = పొడవైన; శరీరము = దేహము; అమరన్ = అమరి యుండగ; ప్రజ్వల = బాగా మండుతున్న; జ్వలన = మంటల; దీప్త = వెలుగుతున్న; జ్వాలికా = మంటల; జాల = సమూహముల వలె; జాజ్వల్యమాన = మండిపోతున్నట్టున్న; కేశములు = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగ; చండ = భయంకరమైన; దిగ్వేదండ = దిగ్గజముల యొక్క; శుండా = తొండములు; అభ = వంటి; దోర్దండ = చేతులు; సాహస్ర = వేనవేలు; ధృత = ధరింపబడిన; హేతి = ఆయుధముల; సంఘము = సమూహము; ఒప్ప = ఒప్పుతుండగ; వీక్షణ = కన్నుల; త్రయ = మూడింటి; లోక = లోకములను; వీక్షణ = చూసెడి చూపుల; ద్యుతిన్ = కాంతి; లోక = లోకము లందలి; వీక్షణ = చూసే వారి; తతి = సమూహమునకు; దుర్నిరీక్ష్యముగను = చూడశక్యము కాకుండగ; క్రకచ = ఱంపము వలె; కఠిన = కరుకైన; కరాళ = వంకర్లు తిరిగిన; దంష్ట్రలు = కోరలు; వెలుంగ = ప్రకాశిస్తుండగ; ఘన = పెద్ద; కపాల = పుర్రెలు; అస్థి = ఎముకలు కూర్చిన; వనమాలికలు = ఆకులు పూల దండలు; తనరన్ = అతిశయించగ; అఖిల = సమస్త మైన; లోక = లోకములకు; భయంకరుడు = భీకరుడు; అగుచున్ = అవుతూ; వీరభద్రుడు = వీరభద్రుడు; ఉదయించెన్ = పుట్టెను; మాఱట = రెండవ; రుద్రుడు = భయంకరుడు వలె; అగుచున్ = అవుతూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: