Friday, October 17, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 1-9-ఉ. - అంబనవాంబుజోజ్వల

1-9-ఉ.
అం, నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంర చారుమూర్తి, ప్రకస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
          ఓ యమ్మా! వికాస ప్రకాశాలకి ప్రతీకగా నవనవలాడుతూ విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్త్రుతంగా విహారిస్తుండే నా తల్లీ! భారతీదేవి! నన్ను నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!
ఎఱ్ఱన గారి అరణ్యపర్వంలోని ఈ మహత్తర మైన పద్యాన్ని, భాగవత గ్రంధారంభ ప్రార్థనగా గ్రహించి, గౌరవించారు పోతనామాత్యుల వారు.
1-9-u.
aMba, navaaMbujOjvalakaraaMbuja, SaaradachaMdrachaMdrikaa
DaMbara chaarumoorti, prakaTa sphuTa bhooshaNa ratnadeepikaa
chuMbita digvibhaaga, SRtisookti vivikta nijaprabhaava, bhaa
vaaMbaraveedhi viSrutavihaariNi, nan gRpa@M jooDu bhaaratee!
          అంబ = తల్లీ; నవ = లేత; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదాన; శారద = శరదృతువు లోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = డాబు గల; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = కొట్టొచ్చినట్లు కనబడెడి; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శృతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్త్రుతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = అనుగ్రహించుము; భారతీ = సరస్వతీదేవీ.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: