Wednesday, April 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౨౭(527)

( వసుదేవుని గ్రతువు ) 

10.2-1119-సీ.
"సన్మునీశ్వరులార! జన్మభాక్కులమైన-
  మాకు నిచ్చోట సమ్మతిని దేవ
నికరదుష్ప్రాపులు నిరుపమయోగీంద్రు-
  లైన మీ దర్శనం బబ్బెఁ గాదె
ధృతి మందభాగ్యు లింద్రియపరతంత్రులు-
  నైన మూఢాత్ముల కనఘులార!
భవదీయ దర్శన, స్పర్శన, చింతన,-
  పాదార్చనలు దుర్లభంబు లయ్యు
10.2-1119.1-తే.
నేఁడు మాకిట సులభమై నెగడెఁ గాదె!
జగతిపైఁ దీర్థభూతులు సాధుమతులు
మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ
వేఱ తీర్థంబు లవనిపై వెదక నేల?

భావము:
“మహామునిశ్రేష్ఠులారా! దేవతలకు సైతం లభించని మీ వంటి పరమ యోగీశ్వరుల దర్శనం మానవమాతృలైన మాకు ఇక్కడ లభించింది. దురదృష్టవంతులకు ఇంద్రియలోలురకు మూఢులకు మీవంటి పుణ్యాత్ముల దర్శనం, స్పర్శనం, చింతనమూ, పాదార్చనమూ దుర్లభ్యములు. అయినా ఇక్కడ మాకు అవి అతి సులభంగా ప్రాప్తించాయి. ఈ లోకంలో సాధువులు పవిత్ర తీర్థాల వంటి వారు. మిమ్మల్ని దర్శించటయే చాలు. వేరే పుణ్యతీర్ధాలు వెదకవలసిన అవసరం లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=79&Padyam=1119

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: